Telangana Police Complaints Authority: అథారిటీ సరే.. ఆఫీస్‌ ఏది?

  • By: sr    news    Jun 04, 2025 6:15 AM IST
Telangana Police Complaints Authority: అథారిటీ సరే.. ఆఫీస్‌ ఏది?
  • పోలీసు కంప్లైంట్ అథారిటీ నియామకం
  • ఇంకా కార్యాలయం లేదు.. సిబ్బందీ లేరు
  • కేసీఆర్‌ సర్కారు బాటలోనే రేవంత్‌ సర్కార్‌!
  • నియామకం, నిర్వహణలో సేమ్‌ టు సేమ్‌
  • ఏపీ సహా పొరుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో
  • ఆన్‌లైన్‌లో ఫిర్యాదులకు వెబ్‌పోర్టల్‌ కూడా
  • గత పదేళ్లలో పోలీసులపై అనేక ఆరోపణలు
  • నేరెళ్ల‌లో ద‌ళితుల‌పై చిత్ర‌హింస‌లు
  • ఖ‌మ్మంలో అన్నదాతలకు బేడీలు..
  • రిపోర్ట్‌ కాని సందర్భాలు ఎన్నెన్నో
  • ఫిర్యాదు చేయడానికి మార్గం ఏది?
  • నెలన్నర క్రితం తెలంగాణలో అథారిటీ
  • ఇకనైనా కార్యాలయం ఏర్పాటు చేస్తారా?

హైద‌రాబాద్‌,  (విధాత‌): వ్యక్తులు దాడి చేసినా, మోసం చేసినా పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు. మరి అదే పోలీసులపై ఫిర్యాదు చేయాల్సి వస్తే? సాధారణ పోలీస్ట్‌ స్టేషన్లలో పోలీసులపై నమోదయ్యే కేసులు అంతే సాధారణంగా మూసేస్తుంటారనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ఎఫ్ఐఆర్ న‌మోదు నిరాక‌రించ‌డం, క‌స్టోడియ‌ల్ మ‌ర‌ణాలు, పోలీసుల దుష్ప్ర‌వ‌ర్త‌న‌, అధికార దుర్వినియోగం, సామాన్యుల‌ను ఇబ్బందుల పాలు చేసే ఫిర్యాదుల‌పై విచారించి చ‌ర్య‌లు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక అథారిటీ, జిల్లా స్థాయిలో మ‌రో అథారిటీని ఏర్పాటు చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను తాము అమలు చేస్తున్నామంటూ చెప్పుకొన్న గత బీఆరెస్‌ ప్రభుత్వం.. తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ (Telangana Police Complaints Authority) కి చైర్మ‌న్‌, స‌భ్యుల‌ను నియ‌మించింది. అక్కడితో చేతులు దులుపుకొన్నది. ఆ అథారిటీ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేందుకు కీలకమైన కార్యాలయాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వంలో తప్పిదాలన్నింటినీ సవరిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకూ కార్యాలయం ఊసే ఎత్తకపోవడం చర్చనీయాంశమవుతున్నది. ఈ విషయంలో బీఆరెస్‌ సర్కారు దారిలోనే రేవంత్‌ ప్రభుత్వం నడుస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్ఎస్ పాలన‌లో నిర్ల‌క్ష్యం

పోలీసుల‌పై వ‌చ్చే ఆరోప‌ణ‌ల‌ను విచారించి, చ‌ర్య‌ల‌కు సిఫార‌సు చేసేందుకు తెలంగాణ స్టేట్ పోలీస్‌ కంప్లైంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ పోలీస్‌ కంప్లైంట్ అథారిటీల‌ ఏర్పాటుకు ఏనాడో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌లో అమ‌లు చేయ‌గా గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌కుండా పూర్లి నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించింది. అథారిటీల‌ను ఏర్పాటు చేయ‌డం లేదంటూ కొంద‌రు హైకోర్టును ఆశ్ర‌యించ‌గా 2018లో తీర్పునిచ్చిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. రెండు నెల‌ల్లో వాటిని ప్రారంభించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అయినా బీఆర్ఎస్ పాల‌కులు ఏమాత్రం ఖాత‌రు చేయలేదు. దీంతో ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డం లేదంటూ కొందరు మ‌ళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారించిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిలో మరో మార్గం లేక.. తెలంగాణ ప్ర‌భుత్వం 2021 జూలై నెల‌లో తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి ఛైర్మ‌న్‌, స‌భ్యుల‌ను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. అలాగే రెండు జిల్లా క‌మిటీల‌కు చైర్మ‌న్‌, స‌భ్యుల‌ను కూడా నియ‌మించింది. పోలీసుల‌పై ఫిర్యాదు చేసేందుకు వ్య‌వ‌స్థ‌లు వ‌చ్చాయ‌ని ప్ర‌జ‌లు సంతోషించారు. కానీ వారి ఆశ‌లు ఆవిరి అయ్యేలా ప్ర‌భుత్వం ఆ త‌రువాత తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను పూర్తిగా విస్మ‌రించింది. ఈ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసేందుకు భ‌వ‌నాల‌ను, రోజువారీ కార్యక‌లాపాల‌ నిర్వహణకు సరిపడా సిబ్బందిని మాత్రం నియమించలేదు. దీంతో పోలీసుల‌పై ఫిర్యాదు చేసేందుకు ఎవ‌రిని సంప్ర‌దించాలో, ఎక్క‌డికి వెళ్లాలో తెలియ‌క ప్ర‌జ‌లు అయోమ‌యానికి గుర‌య్యారు. కార్యాల‌యం ఎక్క‌డ ఏర్పాటు చేశారో తెలుసుకునేందుకు ల‌క్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాల‌యానికి వ‌చ్చి ఆరా తీసి తిరుగుముఖం ప‌ట్టేవారు.

చురుకుగా పలు ప్రభుత్వాలు

త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, పంజాబ్‌, క‌ర్ణాట‌క‌, హ‌ర్యానా, అస్సాం, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు అథారిటీల‌ను ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా ఆన్‌లైన్‌లో పోలీసుల‌పై ఫిర్యాదులు స్వీక‌రించేందుకు వెబ్ పోర్ట‌ల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చాయి. కానీ తెలంగాణ‌లో నాటి బీఆరెస్‌ ప్రభుత్వం ఈ ప్రక్రియలను విస్మరించడం ద్వారా విమర్శలకు గురైంది. ఈ లోపు ప్ర‌భుత్వం మారిపోవ‌డం, కాల ప‌రిమితి తీరిపోవ‌డంతో కార్యాల‌యాలు ఏర్పాటు కాలేదు, సిబ్బందినీ నియ‌మించ‌లేదు.

అథారిటీ కాగితాల‌కే ప‌రిమిత‌మా?

తర్వాత వచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ స్టేట్ పోలీస్‌ కంప్లైంట్ అథారిటీ చైర్మ‌న్‌గా ఏపీ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డాక్ట‌ర్ బీ శివ‌శంక‌ర్ రావు, స‌భ్యులుగా మాజీ ఐపీఎస్ అధికారి పీ ప్ర‌మోద్ కుమార్‌, మాజీ ఆర్టీఐ క‌మిష‌న‌ర్ వ‌ర్రె వెంక‌టేశ్వ‌ర్లను నియ‌మించింది. జిల్లా స్థాయిలో హైద‌రాబాద్ రేంజ్‌, వ‌రంగ‌ల్ రేంజ్‌లకు చైర్మ‌న్‌, స‌భ్యుల‌ను నియ‌మించే ప్ర‌క్రియ‌ను పూర్తి చేసింది. రాష్ట్రస్థాయిలో అథారిటీలో జిల్లా పోలీసు సూప‌రింటెండెంట్ ఆపై స్థాయి అధికారులు, జిల్లా స్థాయిలో కానిస్టేబుల్ నుంచి అడిష‌న‌ల్ ఎస్పీ వ‌ర‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. ఇంత వరకూ బాగానే ఉన్నది.

కానీ.. గత బీఆరెస్‌ ప్రభుత్వం తరహాలోనే.. అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులతో సరిపెట్టింది. ఉత్తర్వులు జారీ అయి నెల‌న్న‌ర అవుతున్నా.. ఇంత వరకూ అథారిటీలు పనిచేసేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు, సిబ్బందినీ నియమించలేదు. దీంతో ప‌లువురు ల‌క్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాల‌యానికి వ‌చ్చి వెళ్తున్నారు. ఇంకా కార్యాల‌యం ఏర్పాటు కాలేద‌ని, నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కు వేచి ఉండాల‌ని చెప్పి ప్ర‌జ‌ల‌కు అక్కడి అధికారులు చెప్పి, తిప్పి పంపిస్తున్నారు. పొరుగున ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌తేడాది రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అథారిటీ చైర్మ‌న్‌, స‌భ్యుల‌ను నియ‌మించ‌డమే కాకుండా కార్యాల‌యం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో కార్యక‌లాపాలు కొన‌సాగిస్తున్నా, మ‌న రాష్ట్రంలో మాత్రం ఇంకా పురుడు ద‌శ‌లోనే ఈ వ్య‌వ‌స్థ‌లు ఉన్నాయి. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అథారిటీల‌ ఏర్పాటుతో చేతులు దులుపుకొన్న చందాన.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే రీతిన వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అథారిటీ లేక పోలీసుల అత్యుత్సాహాలు!

తెలంగాణ స్టేట్ పోలీస్‌ కంప్లైంట్ అథారిటీ, జిల్లా పోలీస్‌ కంప్లైంట్ అథారిటీలు మ‌నుగ‌డ‌లో లేక‌పోవ‌డంతో బీఆర్ఎస్ ప‌దేళ్ల పాల‌న‌లో పోలీసులు చెల‌రేగిపోయారన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ పెద్ద‌ల ఇసుక అక్ర‌మ ర‌వాణా, నెరెళ్లలో ద‌ళితుల‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగం, ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు ఆందోళ‌న‌కు పిలుపునిస్తే ఇళ్ల వ‌ద్దే నిర్భంధించ‌డం వంటి దమనకాండ అప్రతిహతంగా సాగిన విషయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా చీర్లవంచ‌, కొదురుపాక గ్రామాల నుంచి వంద‌లాది ఇసుక టిప్ప‌ర్లు, లారీలు తిరిగేవి. ఎరుక‌ల భూమ‌య్య అనే వ్య‌క్తి 2017లో లారీ ఢీకొని చ‌నిపోయాడు. ఈ ఘటనకు నిరసనగా ద‌ళితులు ఆందోళ‌న‌కు దిగగా, పోలీసులు ప‌లువురిని అదుపులోకి తీసుకుని చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారని వార్తలు వచ్చాయి. ఏ ఒక్క‌రు కూడా సంసారానికి ప‌నికి రాకుండా భౌతికంగా హింసించారన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి స‌హ‌క‌రించిన మాజీ లోక్‌స‌భ స్పీక‌ర్ మీరాకుమారి ఈ ఘ‌ట‌న‌పై చ‌లించి, నేరెళ్ల‌కు వ‌చ్చి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ద‌ళితుల‌పై పోలీసుల దాడి రాజ్య‌హింసేన‌ని అప్ప‌ట్లో పీసీసీ అధ్య‌క్షుడు ఎన్‌ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఖమ్మంలో రైతులకు బేడీలు

ఖ‌మ్మం జిల్లాలో అన్నం పెట్టే రైతుల‌కు బేడీలు వేసి రోడ్డుపై న‌డిపించిన‌ ఘ‌ట‌న అన్నదాతల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చింది. రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఖ‌మ్మం ప‌ట్ట‌ణ మార్కెట్ లో 2016లో మిర్చి పంట గిట్టుబాటు ధ‌ర అమాంతం త‌గ్గించ‌డంతో రైతులు ఆగ్ర‌హించారు. విసిగిన రైతులు ఎల‌క్ట్రానిక్ కాంటాల‌ను, కార్యాల‌యంలో బ‌ల్ల‌లు, కుర్చీలు ధ్వంసం చేశారు. ఘ‌ట‌న‌కు కార‌కులంటూ 18 మంది రైతుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా కోర్టులో హాజ‌రుప‌ర్చి, బేడీల‌తో తీసుకువెళ్లారు. అన్నం పెట్టే రైతుల‌కు బేడీల వేసిన వార్త‌లు చూసిన ప్ర‌జ‌లు చ‌లించిపోయారు.

ఫిర్యాదు చేయకుండా కట్టడి

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ లో భూ సేక‌ర‌ణ‌ను వ్య‌తిరేకించిన రైతుల‌ను వేధింపుల‌కు గురిచేయ‌గా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. వేముల‌ఘాట్ లో రైతు మ‌ల్లారెడ్డి ఇంట్లో క‌ట్టెల‌ను పోగు చేసుకుని దానినే చితిగా మార్చుకుని త‌న‌కు తాను ఆత్మార్ప‌ణ చేసుకున్నాడు. ఇలాంటి దారుణ ఘ‌ట‌న‌ల‌ విషయంలో పోలీసుల‌పై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అథారిటీలు ప‌నిచేయ‌కుండా గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్ర‌భుత్వంలో అయినా పోలీసుల‌పై ఫిర్యాదు చేసేందుకు అథారిటీకి కార్యాల‌యం, సిబ్బందిని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.