IED Blast | వెంకటాపురం మండలంలో మందుపాతర పేలి ముగ్గురు పోలీసుల మృతి

IED Blast | ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం , తడపాల గుట్టలపై మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు మృతి చెందారు. మృతిచెందిన ముగ్గురిని శ్రీధర్, సందీప్, పవన్ కల్యాణ్ అనే జవాన్లుగా గుర్తించారు. గాయపడ్డ వారిలో ఆర్‌ఎస్‌ఐ రణధీర్‌ది వరంగల్ మండలం పైడిపల్లి గ్రామం. తీవ్ర గాయాల పాలైన ఆర్ఎస్ఐ రణధీర్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృత దేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. పోలీసు అధికారులు మృతులకు నివాళులు అర్పించారు.
కొద్దిరోజులుగా ముమ్మర కూంబింగ్
గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 25వేల మందితో కర్రెగుట్టలను చుట్టుముట్టి గత 18 రోజులుగా ఈ పరిసర ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలోనే వెంకటాపురం మండలంలో వీరభద్రవరం తడపాలగుట్టలపై మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులో అమర్చిన ఎల్ఈడి బాంబు పేలి ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పేలుడు సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు.