BRS రజతోత్సవ వేళ.. కానరాని హరీశ్ జాడ‌?

సభ పనులు ప్రారంభించిన తర్వాత ఇప్పటికి కేటీఆర్, కవితతోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తలసాని, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు. కానీ, తన నియోజకవర్గానికి పక్కనే ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో సభ నిర్వహిస్తున్నా హరీశ్‌ రావు జాడలేక పోవడం పార్టీలో రకరకాల చర్చలకు దారితీస్తున్నది.

  • By: sr    news    Apr 24, 2025 11:05 PM IST
BRS రజతోత్సవ వేళ.. కానరాని హరీశ్ జాడ‌?
  • కేటీఆర్, కవిత వచ్చారు కానీ ఆయన అడ్రస్ లేరు
  • సభాస్థల ఎంపిక సమయంలోనే రాక
  • ఆ తర్వాత అజా లేకుండా పోయిన హరీశ్‌
  • ముగ్గురు ముఖ్య నేతల మధ్య విభేదాలు?
  • ఫామ్‌హౌస్‌ నుంచి నేరుగా బాస్‌ పర్యవేక్షణ!
  • ఆయన ఆలోచన మేరకే పక్కనపెట్టారా?
  • ఎల్కతుర్తి సభకు మిగిలింది రెండ్రోజులే
  • గులాబీ పార్టీ నాయకత్వంలో తీవ్ర చర్చ

విధాత ప్రత్యేక ప్రతినిధి: తాను తెలంగాణ ఇంటి పార్టీనని తనకు తాను అభివర్ణించుకుంటుంది! TRS పేరును కాస్తా BRSగా మార్చేసుకుని.. ఈ దేశానికే అవసరమైన పార్టీగా చెప్పుకొంది. అది తేడా కొట్టడంతో మళ్లీ ఇంటి పార్టీ పాట పాడుతున్నది. పార్టీ 25వ ఏట అడుగు పెడుతున్న వేళావిశేషాన్ని అంతే విశేషంగా పండుగ చేసుకునేందుకు సిద్ధమైంది! అందుకోసం వరంగల్‌ సమీపంలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్న సమయాన.. పార్టీని అంతర్గత విభేదాలు పట్టి పీడిస్తున్నాయన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లోనే సాగుతున్నాయి! ఇప్పటికే వరంగల్‌ జిల్లా స్థాయి ముఖ్య నాయకుల మధ్య గ్రూపుల పంచాయితీ, అసమ్మతి వ్యవహారాలు రచ్చకెక్కాయి. దానికి తోడు ఏకంగా రాష్ట్ర స్థాయిలోనే కీలకమైన ముగ్గురి విషయంలో కూడా విభేదాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తున్నది!

TRS ఆవిర్భావం నుంచి BRSగా రూపాంతరం చెందినప్పటికీ.. ఆ పార్టీ అనేక భారీ సభలకు ఆతిథ్యమిచ్చిన వరంగల్ జిల్లా మరోసారి రజతోత్సవ సభకు వేదికగా మారింది. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ స్థానాలు, ఇద్దరు ఎంపీలకుగాను ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచి, అందులోనూ ఒక్కరే పార్టీలో మిగిలారు. అయినా మరోసారి వరంగల్లోనే సభ నిర్వహణకు అధినేత కేసీఆర్ మొగ్గుచూపారు. ఈ మేరకు ఈ నెల 27వ తేదీన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఈ సభకు వేదికగా మారనున్నది. సభ నిర్వహణకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

మొదట్లో సభా స్థలాన్ని చూసి వెళ్లిన హరీశ్

బీఆర్ఎస్ సభను వరంగల్లో నిర్వహించాలని నిర్ణయించగానే సభా నిర్వహణకు ఏర్పాట్ల కోసం అంటూ  మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు అధినేత పంపారు. ఆయన ఆదేశాలు అందుకొన్న హరీశ్‌రావు.. ఆగమేఘాల మీద భారీ కాన్వాయ్, మందీమార్బలంతో వరంగల్‌కు వచ్చారు. వరంగల్ నగరం, పరిసరాల్లోని పలు ప్రాంతాలు పర్యటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్యనాయకులతో కలిసి సభా స్థలాలను వెదికారు. రెండు మూడు స్థలాలను పరిశీలించి అధినేతతో సంప్రదింపుల తర్వాత ఫైనల్ చేస్తామంటూ మీడియా ముందు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్యమైన నాయకులంతా పాల్గొన్నారు. దీంతో సభ పూర్తయ్యే వరకూ హరీశ్‌రావు ఇక్కడే మకాం వేస్తారని అంతా భావించారు. హరీశ్ రావే సభ ఇన్ చార్జ్ అనే ఫీలర్ వెళ్లింది. ఇక్కడి వరకు కథ సజావుగానే సాగింది. ఆ తర్వాత వరంగల్ జిల్లా ముఖ్యనాయకులతో తన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్.. సభ గురించి చర్చించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు కనిపించకపోగా.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొనడం ఆసక్తి రేపింది. హరీశ్‌ విషయంలో అప్పుడే అనుమానాలు తలెత్తాయని, ఆ తర్వాత అవే నిజమయ్యాయని పరిశీలకులు అంటున్నారు.

అడ్రస్ లేని హరీశ్‌రావు

బీఆరెస్‌లో కేసీఆర్ తర్వాత స్థానం ఎవరిదనే అంశంలో తొలి నుంచీ తీవ్రమైన పోటీ ఉన్నదన్న విషయం బహిరంగ రహస్యమే! తొలి దశలో పోటీలో ఉన్న బయటివారికి చెక్ పెట్టి, పార్టీ నుంచే పంపేసినా.. కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ఈ రేస్ కొనసాగుతూనే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేనల్లుడు తన్నీరు హరీశ్‌ రావు, కుమార్తె కల్వకుంట్ల కవిత మధ్య ఈ వార్ సాగుతోందనే వార్తలు ఉన్నాయి. అటూఇటూగా కొంచెం తూకాలు మారినప్పటికీ ఎవరికి వారు ఈ పరుగుపందెంలో ముందుండేందుకు సకల ప్రయత్నాలు చేస్తుంటారనేది పరిశీలకుల వాదన, పార్టీలో సాగే చర్చ. ఈ నేపథ్యంలో రజతోత్సవ సభ నిర్వహణ క్రెడిట్ ఎవరో ఒక్కరికే దక్కడం ఇష్టంలేకనో, అంతర్గతంగా మరే కారణమో? తెలియదుకానీ.. సభ నిర్వహణ పనుల నుంచి తప్పుకొన్నట్టు కనిపిస్తున్నది. ఇది పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక్క రోజు వరంగల్‌లో పర్యటించి హడావుడి చేసిన ఆయన.. ఆ తర్వాత ఆ ఎల్కతుర్తి మొఖాన కూడా చూడకపోవడం గమనార్హం. కేసీఆర్ నిర్వహించిన సమావేశాల్లో కూడా ఎక్కడా హరీశ్‌రావు కన్పించకపోవడం ఆ పార్టీలో కలకలం రేపుతున్నది. ఇన్ని రోజులుగా సభ పనులు సాగుతున్నా.. ఆయన మాత్రం తొంగిచూడలేదు. హరీశ్‌రావు అడ్రస్ లేకపోవడంపై పార్టీలో బహిరంగంగానే చర్చ సాగుతున్నది. సభ బాధ్యతలు హరీశ్‌ చూస్తే  తర్వాత సక్సెస్‌ క్రెడిట్ ఆయనకే దక్కుతుందనే భావనతోనే ఆయనను వ్యూహాత్మకంగా దూరం పెట్టారన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ ముఖ్య నాయకుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగానే సభ బాధ్యతలు ముఖ్యనేతలెవరికీ అప్పగించకుండా, వరంగల్‌ నాయకులతో పనిచేయిస్తూ స్వయంగా కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలుస్తున్నది.

కేటీఆర్, కవిత వచ్చిపోయారు

సభ పనులు దాదాపు పూర్తయ్యాయి. అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల్లో విభేదాలున్నప్పటికీ సభ ఏర్పాట్లు సజావుగా సాగే విధంగా కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారు. గురువారానికి దాదాపు 90 శాతానికి పైగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25వ తేదీ వరకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో నాయకులున్నారు. పనులన్నీ పూర్తయిన సమయంలో రాష్ట్ర నాయకుల మొక్కుబడి ప్రదర్శనలు, పర్యవేక్షణ ప్రారంభమయ్యాయి. బుధవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ పనులను స్వయంగా పర్యవేక్షించారు. కేటీఆర్ రాక సందర్భంగా నాయకులు భారీ హడావుడి చేశారు. గురువారం ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ ఇద్దరు నాయకుల రాక సందర్భంగా నాయకులు, అనుచరులు హంగామా చేశారు. వారూ మీడియా సమావేశాలు నిర్వహించి వెళ్ళిపోయారు. ముందుగా కవితను కూడా సభకు దూరం పెట్టారనే ప్రచారం సాగినప్పటికీ ఆమె వచ్చిపోయారు. స్థానిక నాయకులకు సభ గురించి వీరిచ్చిన సూచనల సంగతేమోగానీ జరిగే పనులకు ఈ నాయకుల పర్యటనలు అడ్డుగా మారుతున్నాయని పనిచేసే వారు చెబుతున్నారు. అసలు అంతా ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా పనులు సాగుతుండగా ఈ ముఖ్య నాయకులు చేసే హడావుడి అదనంగా ఉందంటున్నారు పార్టీ శ్రేణులు.

సభకు మిగిలింది రెండు రోజులు

సభ పనులు ప్రారంభించిన తర్వాత ఇప్పటికి కేటీఆర్, కవితతోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తలసాని, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు. కానీ, తన నియోజకవర్గానికి పక్కనే ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో సభ నిర్వహిస్తున్నా హరీశ్‌ రావు జాడలేక పోవడం పార్టీలో రకరకాల చర్చలకు దారితీస్తున్నది. సభకు అవసరమైన జనసమీకరణపై హరీశ్‌రావు దృష్టిపెట్టారని కొందరు చెబుతుండగా, అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని మరికొందరు అంటున్నారు. సభ 27న నిర్వహించనుండగా ఇక రెండు రోజుల సమయమే ఉన్నందున ఈ మధ్యలో హరీశ్‌రావు వస్తారా? లేదా? అనే చర్చ సాగుతోంది. ఇదిలాఉండగా వరంగల్‌లో సభ నిర్వహించాలని నిర్ణయించగా హరీశ్‌తోపాటు హడావుడి చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు సైతం కూడా ఎల్కతుర్తి స్థల నిర్ణయం తర్వాత పెద్దగా కనిపించకపోవడం మరో ఆసక్తికర అంశం. అప్పుడప్పుడూ ముఖ్య నాయకులు వచ్చినప్పుడు మెరుస్తూ వచ్చారు. సభ నిర్వహణ బాధ్యతల్లో కొందరు ముఖ్యనాయకులు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మరి కొందరు నాయకులు తదితరులు మాత్రమే నిత్యం తలమునకలయ్యారు.