Telangana | అకాల వర్షాలు.. ఆరుగాలం శ్రమ నీటి పాలు!

  • By: sr    news    Apr 27, 2025 6:52 PM IST
Telangana | అకాల వర్షాలు.. ఆరుగాలం శ్రమ నీటి పాలు!

విధాత: నడి వేసవిలో విరుచుక పడుతున్న అకాల వర్షాలు వరి ధాన్యం రైతుల పాలిట నష్టదాయకంగా మారాయి. ప్రస్తుతం అంతటా వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటం..కళ్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పోసిన దృశ్యాలే పల్లెల్లో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆకాల వర్షంతో రైతుల ధాన్యం తడిసిపోతుండటంతో తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు ధాన్యం కుప్పల వద్ధనే పగలు రాత్రి పడిగాపులు పడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున విరుచుక పడిన అకాల వర్షంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సహా పలు జిల్లాలలో ధాన్యం తడిసిపోయింది.

చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట, పోచంపల్లి మండలాల్లో కురిసిన వర్షంతో ధాన్యం పెద్ధ ఎత్తున తడిసిపోయింది. పలుచోట్ల వరద నీటిలో ధాన్యం కొట్టుకపోయింది. బాధిత రైతులు వర్షంలో తమ ధాన్యం కాపాడుకునేందుకు నానాపాట్లు పడ్డారు. ఇక కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంటలు వర్షం పాలై కొందరు…మామిడి కాత రాలి మామిడి రైతులు మరికొందరు కూడా ఆకాల వర్షాలతో నష్టపోతున్నారు. రేపు, ఎల్లుండి కూడా అకాల వర్షాల పడుతాయన్న వాతావరణ శాఖ సమాచారం రైతులను మరింత భయపెడుతోంది.

నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు

ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటం..మరోవైపు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తారో లేదనన్న బెంగతో రైతులు కళ్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో తిప్పులు పడుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వేగం పెంచి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం పోసి 20రోజులైనా కాంటా పెట్టడం లేదని.. తూకంవేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీలు రావడం లేదని.. ఐకేపీ సెంటర్‌ నిర్వాహకులు రైతులకు కనీసం తాగునీటి వసతి కల్పించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నీడ కోసం టెంట్‌ కూడా వేయడం లేదని, ప్రభుత్వం అందించిన టార్పాలిన్‌ కవర్లను రైతులకు అందించడం లేదని వాపోతున్నారు. లారీల కొరత, తరుగు కోతల సమస్యలు మరింత సమస్యాత్మకంగా మారాయంటున్నారు.

లక్ష్యం ఘనం..కొనుగోలు తీరు అధ్వాన్నం

యాసంగి (రబీ) సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా రబీలో సన్నాలు, దొడ్డురకం కలిపి 54.89 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైంది. రెండు రకాలు కలిపి 137.10 లక్షల టన్నుల దిగుబడి వస్తుందన్నది అంచనా. రాష్ట్రవ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. అందులో దొడ్డు రకం 46.71 లక్షల టన్నులు, 23.42 లక్షల టన్నులు సన్నధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాలు ఎక్కువగా సాగుచేసేలా ప్రోత్సహిస్తూ..రూ.500బోనస్ ఇస్తుండటతో రాష్ట్రవ్యాప్తంగా 20.57 లక్షల ఎకరాల్లో రైతులు సన్నరకాలు సాగుచేయగా, 49.89 లక్షల టన్నుల సన్నధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 23.42 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు కొనుగోళ్లు చేయాల్సి ఉండగా..క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటూ మద్దతు ధర నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి.