మాజీ సీఎం జగన్ : ఏపీలో శాంతి భద్రతలకు జడ్పీటీసీ ఉప ఎన్నికలే నిదర్శనం

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రిగ్గింగ్ నిదర్శనమని జగన్ ఆరోపణలు, కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు జరపాలని సవాల్.

మాజీ సీఎం జగన్ : ఏపీలో శాంతి భద్రతలకు జడ్పీటీసీ ఉప ఎన్నికలే నిదర్శనం

అమరావతి : పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఎన్నికలు ఏపీలో శాంతిభద్రతల అధ్వాన్న స్థితికి నిదర్శనమని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ విమర్శించారు. అసలు పులివెందులలో జరిగింది ఎన్నికలే కావని..పోలింగ్ బూత్ ఎజెంట్లు లేకుండా ఎన్నికల నిర్వహణ ఎక్కడా చూడలేదన్నారు. సాక్షాత్తూ కలెక్టర్‌ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్‌ జరిపించారని ఆరోపించారు. ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికని ప్రశ్నించారు. బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంపైన..రాజ్యాంగ వ్యవస్థలపైన నమ్మకం ఉంటే జరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారన్నారు. కచ్చితంగా ఈ ఎన్నికను కోర్టుల్లో సవాల్‌ చేస్తాం. మా అభ్యర్థులిద్దరినీ అందుకే పిలిపించామని జగన్ తెలిపారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రెండు ఉప ఎన్నికలు జరిపించాలని కోర్టులను కోరతామన్నారు. సీఎ: చంద్రబాబు పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల నిర్వహణతో గ్రామాల్లో వైషమ్యాలను సృష్టించారని..తప్పుడు విధానాల విత్తనాలు వేస్తున్నారన్నారు. రేపు ఇదే మీకు కూడా చుట్టుకుంటుందని హెచ్చరించారు. అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను వాడుకుని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్‌ చేశారని జగన్ ఆరోపించారు.

నంధ్యాల తరహాలో పులివెందుల రేపు మాదే

ప్రజలు తనకే ఓట్లేస్తారని చంద్రబాబు అనుకున్నప్పుడు, ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు చేయాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను వాడుకుని, ఇన్ని అరాచకాలు చేసి గెలవాలనిచూస్తే దాంతో సాధించేది ఏముంటుందని జగన్ ప్రశ్నించారు. గతంలో 2017 నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చంద్రబాబు ఇదే తరహా కుట్రతో అరాచకాలు చేసి గెలిచి..మా పార్టీ పనైపోయిందంటూ సంబరాలు చేసుకున్నారని..ఏడాదిన్నర తర్వాత జరిగిన అదే నంద్యాల ఎన్నికల్లో వైసీపీ 34,560 ఓట్లతేడాతో ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. చంద్రబాబు జీవితానికి బహుశా ఇదే చివరి ఎన్నిక కావొచ్చు అని.. కృష్ణారామా.. అనుకునే వయసులో గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు రేపితే రేపు నరకానికి పోతాడని చురకలేశారు. ప్రజాస్వామ్యం చేజారిపోతే నక్సలిజం పుడుతుందని.. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు.

జనం మీకే ఓటు వేస్తారనుకుంటే కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించండి

ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేసి..కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నిక జరపాలని చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్ధేశం ఈ ప్రభుత్వానికి లేదు. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇది వాళ్ల విధానం. ఒకప్పుడు బందిపోట్ల పేరు చెబితే వినిపించే చంబల్ లోయను మరిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నిక జరిపారని జగన్ మండిపడ్డారు. ప్రతీ బూత్ లో వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకుందా?. ఎవరెవరు బయటి నుంచి వచ్చారు..ఎవరెవరు బూత్ లను ఆక్రమించుకున్నారో ఆధారాలిస్తా.. అడ్డగోలు రాజకీయాలు చేసే వాళ్లను మోసగాడు అంటారని విమర్శించారు. ఎన్నికల్లో చంద్రబాబు పోలింగ్ బూత్ లను మార్చడం వల్ల నాలుగు వేల ఓట్ల పై ప్రభావం పడిందన్నారు. పోలింగ్ బూత్ లకు వెళ్లకుండా దారిలోనే అడ్డుకున్నారు. పులివెందుల ఎన్నికలు ఆరు పంచాయతీల పరిధిలో జరిగాయి. ఈ ఆరు పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ గ్రామాల్లో పాగా వేశారు. పోలీసులే వారిని రిగ్గింగ్ కు ప్రోత్సహించారని జగన్ ఆరోపించారు.
కనంపల్లిలో పోలింగ్ బూత్ లకు ఏజెంట్లు వెళ్లకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నాడు .పులివెందుల జడ్పీటీసి అభ్యర్ధి హేమంత్‌ను ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వలేదు. భూపేజ్ రెడ్డి పీఏ సుదర్శన్ రెడ్డికి పులివెందులలో పనేంటి అని జగన్ ప్రశ్నించారు.

ప్రతి బూత్ లో పచ్చ రౌడీలు

పోలీసులు పచ్చ చొక్కాలేసుకుంటే.. ప్రతీ బూత్ లో 400 లకు పైగా టీడీపీ రౌడీలు తిష్ట వేశారని..ఒక్కో ఓటరుకి ఒక్కో రౌడీని పెట్టారని జగన్ ఆరోపించారు. మంత్రి సవిత మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి , ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మనుషులు పోలింగ్ బూత్ లలో తిష్టవేశారన్నారు. బిటెక్ రవి పులివెందుల రూరల్ ఓటరు కాదని.. కానీ కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేశాడని జగన్ తెలిపారు. ఓట్లు వేసేందుకు వెళ్లిన వారిని కొట్టి..వారి స్లిప్పులను లాగేసుకున్నారు. ఆ స్లిప్పులతో వాళ్లు ఓట్లేసుకున్నారు. టీడీపీకి ఓటేసేవాడైతేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనిచ్చారన్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారని.. జమ్మలమడుగు నుంచి వచ్చిన టీడీపీ నేతలు పులివెందులలో ఓట్లేశారు. రీపోలింగ్ లో కూడా దొంగఓట్లు వేశారన్నారు. అన్యాయమని ప్రశ్నించిన వారిని తరమికొట్టారన్నారు. రాయచోటి ఎమ్మెల్యే,మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఒంటిమిట్టలో ఏం పని అని..పులివెందుల రూరల్ లో ఎన్నికలు జరుగుతుంటే టౌన్ లో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ కు వెళ్లి డీఐజీ హడావిడి చేస్తే.. పులివెందులలో డీఎస్పీ ‘‘కాల్చిపడేస్తా నాకొడకా’’ అని వైసీపీ వాళ్లను బెదిరించాడని. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టలో పోలింగ్ బూత్ లో రౌడీయిజం చేశాడని జగన్ ఆరోపించారు.

అధికార పార్టీకి అనుకూలంగా డీజీపీ కోయ ప్రవీణ్

డీఐజీ కోయ ప్రవీణ్ .. టీడీపీ మాజీ ఎంపీ సమీప బంధువు అని, పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షలో ఈ ఎన్నిక జరిపారని జగన్ విమర్శించారు. చంద్రబాబు మాట వినకపోతే డిజీ స్థాయి అధికారులైనా ఇబ్బంది పడాల్సిందేనని.. పీఎస్.ఆర్ ఆంజనేయులు,సునీల్ కుమార్,విశాల్ గున్నీల పై కేసులు పెట్టారు ..కొందరిని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కోయ ప్రవీణ్ మాఫియా రింగ్ లీడర్. బెల్ట్ షాపుల కలెక్షన్ల నుంచి పర్మిట్ రూమ్ లు , ఇసుక, మట్టి, క్వార్ట్జ్, సిలికా, పేకాట శిభిరాలకు అనుమతి వరకూ అంతా డిఐజీనే చూసుకుంటున్నాడు. ఈ కలెక్షన్లలో వాటాలను చంద్రబాబు, చినబాబు,ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు. ఇలాంటి డీఐజీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించారని జగన్ విమర్శించారు. ఇప్పటికే ఏడాదిన్నర టీడీపీ పాలన పూర్తయ్యిందని..మరో మూడున్నరేళ్లు కూడా ఇలానే గడిచిపోతుందని…రేపు మా ప్రభుత్వం వచ్చాక తగిన సమాధానం చెబుతామన్నారు.

ఏపీ ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ మాట్లాడరెందుకో

ఓట్లు చోరీ అయ్యాయని మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీ ఓట్ల చోరీపై ఎందుకు మాట్లాడటం లేదని జగన్ నిలదీశారు. ఎన్నికలకు సంబంధించి దేశంలోనే 12.5 శాతం తేడా ఉన్నది ఏపీలో మాత్రమేనని..అంటే పోలింగ్‌ నాటికి, కౌంటిగ్‌ నాటికి 48 లక్షల ఓట్లు పెరిగాయని దీనిపై ఎందుకు రాహుల్ మాట్లాడరని ప్రశ్నించారు. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాకూర్ ఏరోజైనా చంద్రబాబు గురించి మాట్లాడాడా?. కానీ నా గురించి మాట్లాడుతున్నాడని జగన్ విమర్శించారు. కాంగ్రెస్‌ అధిష్టానంతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీకి చంద్రబాబు టచ్‌లో ఉన్నారని..అందుకే చంద్రబాబుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడరన్నారు. ఏపీలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయని..అమరావతి నిర్మాణం పెద్ద స్కాం అని..పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయని., వీటి గురించి కాంగ్రెస్‌ ఎందుకు మాట్లాడడం లేదు? అని జగన్ నిలదీశారు.

ఇవి కూడా చదవండి…

అధికారులు అప్రమత్తంగా ఉండండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

లిబర్టీ స్టాట్యూను మించిపోయిన మహావిష్టువు విగ్రహం – భారత్​లో కాదు