లోక్‌సభ ఎన్నికల్లో ఇలాగైతే త్రిముఖ పోరు అలాగైతే ద్విముఖ పోరు

బీజేపీ అధిష్ఠానం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రెండు వ్యూహాలను అమలు చేస్తున్నది

లోక్‌సభ ఎన్నికల్లో ఇలాగైతే త్రిముఖ పోరు అలాగైతే ద్విముఖ పోరు

(విధాత ప్రత్యేకం)

బీజేపీ అధిష్ఠానం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రెండు వ్యూహాలను అమలు చేస్తున్నది. ఒకటి ఎన్నడూ గెలువని స్థానాలను దక్కించుకోవడం. రెండోది కాంగ్రెస్‌ పక్కాగా గెలిచే చోట తమకు అవకాశం లేకపోతే ప్రాంతీయపార్టీలను కలుపుకుని అక్కడ కాంగ్రెస్‌ గెలువకుండా చూడటం. ఆ వ్యూహాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తుందా? అన్న చర్చ జరుగుతున్నది.రాష్ట్రంలో ప్రధానపార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించాయి. వీటిలో కాంగ్రెస్‌ పార్టీ రెండు పార్టీలను ఎదుర్కోవాలి. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు, రాజకీయ అంశాలు లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి వేరే విధంగా ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రంలో అధికారమార్పు కోరుకున్న వాళ్లలో యువతతో పాటు మధ్య వయస్కులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడి యువత బీ జే పీ మతోన్మాదాన్ని ఎంతవరకు సమర్థిస్తారన్నది చూడాలి. ఇప్పుడు రాష్ట్రంలో మూడు పార్టీల పరిస్థితి ఎలా ఉన్నది? ప్రజల ఆలోచన ఎలా ఉన్నది? 2014, 2019 కంటే ఈసారి ఎన్నికలకు అంత ప్రాధాన్యం ఎందుకు? అన్న విషయాలను విశ్లేషిస్తే అనేక విషయాలు తెలుస్తాయి.  

అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఓటమి తర్వాత పార్టీ క్యాడర్‌ నిరాశ నిస్పృహలో ఉన్నది. రెండు దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని అవకాశాలు రాని వాళ్లు మూడోసారి అధికారంలోకి వస్తే తమను అదృష్టం వరిస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు పార్టీలో అసెంబ్లీ ఎన్నికల నాటి జోష్‌ ఏమీ కనిపించడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. బీఆర్‌ఎస్‌ గెలిచినా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదనే భావన ఒకటి అయితే పదేళ్లుగా అన్నిరంగాల్లో విఫలమైన కేంద్రంలోనూ ప్రభుత్వం మారితే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది.

పార్టీ పరంగా చూస్తే లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోనూ మార్పు తథ్యం అనేది బీఆర్‌ఎస్‌ నేతల ఆలోచన. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదంటూనే అధికార పార్టీ మెజారిటీకి అవసరమైన నాలుగు సీట్లే అదనంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాలేదు. ప్రస్తుత ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తామని, వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అప్పుడు ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. కానీ ఉన్నపళంగా ఎదురుదాడికి ఎందుకు దిగుతున్నారు? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

వీటికితోడు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి నియోజకవర్గాల సమీక్ష చేస్తున్న ఆ పార్టీ పార్లమెంటు పరిధిలోని గెలిచిన, ఓడిన ఎమ్మెల్యేల, ఇతర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నది. చేవెళ్ల నుంచి సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని, అలాగే కరీంనగర్‌ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్‌ బరిలో ఉంటారని ప్రకటించింది.

ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని సెగ్మెంట్‌లలో బీఆర్‌ఎస్‌కు లక్షకు పైగా మెజారిటీ సాధించింది. అయితే గత ఎన్నికల ఫలితాన్నే పునరావృతం చేయాలంటే నేతలంతా సమన్వయంత పనిచేయాలి. కానీ తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డిల విభేదాలు మధ్య ఎన్నికలకు ముందే ఉన్నాయి. ఫలితాల అనంతరమూ అవి తీవ్రతరం అయినట్టు చేవెళ్ల నియోజకవర్గ సమావేశంలో స్పష్టమైంది. కరీంనగర్‌ ఒకప్పుడు బీఆర్‌ఎస్‌కు కంచుకోట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను దక్కించుకున్న పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈసారి అక్కడ త్రిముఖ పోరు ఉండనున్నది. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు స్థానాల్లో కరీంనగర్‌, సిరిసిల్ల, హుజురాబాద్‌లలో బీఆర్‌ఎస్‌ గెలువగా.. చొప్పదండి, వేములవాడ, మానకొండూర్‌, హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ నియోజకవర్గ పరిధిలో కాంగ్రస్‌ కంటే బీఆర్‌ఎస్‌కు 5 వేల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ఇక్కడ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ మరోసారి బరిలో నిలువనున్నారు. ఇక్కడ త్రిముఖ పోరు తప్పదు.  

మరో నియోజకవర్గం పెద్దపల్లి. రిజర్వ్‌ నియోజకవర్గంలో ఈసారి పోరు రసవత్తరంగా ఉండబోతున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో, 2019లోనూ ఇక్కడ బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. 2014లో ఈ నియోజవర్గ పరిధిలోని అన్నిఅసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. ఫలితంగా ఇక్కడ 2014లో బీఆర్‌ఎస్‌ ఇక్కడ 56.82 శాతం ఓట్లు సాధించింది. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి 27.57 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ 2018లో ఈ నియోజవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోకవర్గాల్లో ఒక్క మంథని మినహా మిగిలిన అన్నిచోట్లా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. అయినా 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 11.33 శాతం ఓట్లు కోల్పోయి 45.49 శాతం ఓట్లు దక్కించుకున్నది.

కాంగ్రెస్‌ 8.11 శాతం ఓట్లు పెంచుకుని 35. 68 శాతం ఓట్లు సాధించింది. ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల్‌, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. దీంతో ఇక్కడ బీఆర్‌ఎస్‌ ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ బోరకుంట వెంకటేశ్‌ నేతకు బదులు మాజీ మంత్రి కొప్పులు ఈశ్వర్‌ను పోటీలో నిలబెడుతుందనే ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్‌ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆగం చంద్రశేఖర్‌ లేదా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ తనయుడు వంశీ పోటీ చేస్తారంటున్నారు. ఇక్కడ బీజేపీ ఎవరిని నిలబెడుతుందనేది చూడాలి. 

మరో ముఖ్యవిషయం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈసారి లోక్‌సభ ఎన్నికల్ల బరిలో ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఆయన సికింద్రాబాద్‌ లేదా మల్కాజ్‌గిరి లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుచుకోగా, సికింద్రాబాద్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ 6, ఎంఐఎం 1 సీటు దక్కించుకున్నది. మల్కాజిగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. బీఆర్‌ఎస్‌ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ఈ నియోజకవర్గంలో గెలువలేకపోయింది. 2014లో బండారు దత్తాత్రేయ, 2018లో కిషన్‌రెడ్డి గెలుపొందారు. కానీ 2004, 2009లలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంజన్‌కుమార్‌ యాదవ్‌ గెలుపొందారు.

ఈసారి మరోసారి ఆయన లేదా ఆయన తనయుడు పోటీలో ఉంటారని అనుకుంటున్నారు.చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ లోకసభ స్థానాలను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే కృత నిశ్చయంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉన్నది. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్‌ పోటీ చేస్తారని అంటున్నారు. పార్టీ ఆదేశిస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పటికే తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ మైనంపల్లి హన్మంతరావును బరిలోకి దింపే అవకాశాలున్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీకి నిరాశ కలిగించే ఫలితాలు వచ్చాయి. అందుకే సీఎం రేవంత్‌ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ, బీఆర్‌ఎస్‌ వ్యూహాలు జాగ్రత్తగా గమనిస్తే రెండుపార్టీల టార్గెట్‌ కాంగ్రెస్‌ పార్టీనే అన్నది స్పష్టమవుతున్నది. రాజకీయాల్లో శాశ్వత శతృవులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నది నానుడి. లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండుపార్టీలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌ పార్టీనే. అందుకే ఇక్కడ పార్టీ గెలుపును అడ్డుకోవడానికి ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తాయి. పరోక్షంగా సహకరించుకుంటాయి అనే వాదనలు వినిపిస్తున్నాయి.