TPCC Working President Jagga Reddy: మీ పాలనా వైఫ్యలాలే మీపై తిట్ల దండకాలు

TPCC Working President Jagga Reddy: మీ పాలనా వైఫ్యలాలే మీపై తిట్ల దండకాలు

అధికారం పోయిందన్న ప్రస్టేషన్ తో నే మా పై నీ తిట్లు

విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ పాలనా వైఫల్యాలే ఆయన ఫ్యామిలీని తిట్టడానికి మాకు కారణాలని.. పదేళ్లలో వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని..అందుకే ప్రజలు వారిని తిట్టుకుని గద్దె దించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యి 18 నెలలు అయ్యిందని…కేసీఆర్ కుటుంబం పదేళ్ల అధికారంలో ఉండి సాధించలేని ఎన్నో పనులు చేస్తున్నారన్నారు.

మీరు పదేళ్లు అధికారంలో ఉండి లక్ష రుణ మాఫీ చేస్తామని..నాలుగు కిస్తీల్లో వడ్డీతో ముంచారని..మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వలేదని.. ఇంటికో ఉద్యోగం చూపించలేదని..డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వలేదని అందుకే ప్రజలు, మేం తిట్టామన్నారు. మీ పాలనతో కోమటిరెడ్డి, సంపత్‌ల ఎమ్మెల్యే సభ్యత్వాలను రద్దు చేశారని..ఇలాంటి పాలన చూసిన ప్రజలు తిట్టకపోతే ఎలా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ రైతులకు లాఠీ దెబ్బల పాలన చూపించి వీపులు పగిలిపోయేలా కొట్టారని..రైతులను వణికించిన మీ నీచమైన పాలనను ప్రజలు తిట్టుకున్నారన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నారని..మేం ఇచ్చిన హామీలను మీరు మిగిల్చిన అప్పుల రాష్ట్రంలో క్రమంగా ఒక్కోటి అమలు చేసుకుంటు వెలుతున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మేమే వచ్చి ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టామని.. సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల మహిళలను అడిగితే వారు ఎన్ని సార్లు బస్సులో తిరిగారో చెబుతారన్నారు. సిరిసిల్లలో చర్చ పెడితే ఎవరు ఇచ్చిన హామీలు నెరవేర్చారో తేలుతుందన్నారు. ఉచిత బస్సుతో పాటు గ్యాస్ రూ.500కే ఇస్తున్నామని..200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకే పెంపు, రూ.200కోట్లతోఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, మహిళ సంఘాల పునరుద్ధరణ, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు.

రైతులకు 2లక్షల రుణమాఫీ చేశామని..రైతు భరోసా ఇస్తున్నామని..సబ్సీడీ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు.. టైమ్ కి ఇస్తున్నామని గుర్తు చేశారు. కేటీఆర్ మాటలు వింటే జాలీ వేస్తుందని..విదేశాల్లో చదివి వచ్చి, నోటికి అదుపు లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందన్నారు. స్క్రిప్ట్ రాయిస్తున్న వాడు సరిగ్గా రాయడం లేనట్లుందని..కేటీఆర్ నీకు చీము నెత్తురా లేదా? ఈ పద్ధతి ఎక్కడదయ్యా? ప్రజలు వినిపించుకునే మాటలు సీఎం రేవంత్ మాటలు అని..నీ మాటలు కావని స్పష్టం చేశారు. అధికారం పోయి ప్రస్టేషన్ లో ఉండి నీవు చేస్తున్న విమర్శలను మేము అర్థం చేసుకుంటామని..విమర్శలు హుందాగా లేకపోతే అదే తీరులో బదులిస్తామన్నారు.