జడ్పీటీసీ ఉప ఎన్నికలతో పులివెందులలో పొలిటికల్ హీట్

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలతో జగన్ అడ్డాలో రాజకీయ వేడి.. టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ, చంద్రబాబు వ్యూహాలతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి.

జడ్పీటీసీ ఉప ఎన్నికలతో పులివెందులలో పొలిటికల్ హీట్

అమరావతి : పులివెందుల నియోజకవర్గంలోని జడ్పీటీసీ స్థానాల ఉపఎన్నికల అంశం స్థానికంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య రాజకీయ వాతావారణం ఒక్కసారిగా వేడెక్కించింది. ఆంధ్రప్రదేశ్ లో జూలై 28వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఖాళీయైన 3 ఎంపీటీసీ, 2 జడ్పీటీసీ, 2 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, కారంపూడి, విడవలూరు మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు, పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు.. కొండపూడి, కడియపులంక గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగనున్నాయి. శుక్రవారంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆగస్టు 12న జరుగుతాయి. ఆగస్టు 14 ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్ ఎన్నికలు ఆగస్టు 10న జరుగుతాయి. ఫలితాలు అదే రోజున ప్రకటిస్తారు.

పులివెందుల బరిలోకి టీడీపీ

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య మారెడ్డి లతా రెడ్డి, తమ్ముడు జయభరత్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ నుంచి దివంగత జడ్పీటీసీ తుమ్మల మహేశ్వర్ రెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు హేమంత్ రెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి కూడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పులివెందుల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కెంది. ఒంటిమిట్ట సీటుకు వైసీపీ నుంచి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి, టక్కోలి శివారెడ్డి, కోనేటి హరి వెంకటరమణ, మధుమూర్తి తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి పోటీ చేయబోతున్నారు.

జగన్ కు సవాల్ గా మారిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల అసెంబ్లీ స్థానంలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలు గెలవడం ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. పులివెందుల జడ్పీటీసీ తుమ్మల మహేశ్వర్ రెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్మన్ గా పదవి చేపట్టిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ రెండు స్థానాల్లో ఉపఎన్నిక అనివార్యమయింది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటీసీలు తిరిగి కైవసం చేసుకోవడం జగన్ కు అత్యంత కీలకమైనవిగా మారాయి. గతంలో పులివెందుల జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అయింది. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలలో హోరాహోరి పోటీకి తెరలేచింది. పులివెందుల జడ్పీటీసీ తుమ్మల మహేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపధ్యంలో వచ్చిన ఉప ఎన్నికలలో మానవతా దృక్ఫథంతో తాము పోటీ చేయబోమని ముందుగా ప్రకటించిన టీడీపీ అనూహ్యంగా పోటీకి సిద్దపడింది. దీంతో అప్రమత్తమైన వైఎస్. జగన్ పార్టీ నాయకత్వాన్ని ఉప ఎన్నికల కార్యక్షేత్రంలోకి దించారు.

వైసీపీకి సవాల్ గా మారిన పులివెందుల ఉప ఎన్నిక

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల జడ్పీటీసీ స్థానం ఉప ఎన్నికల బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆయన కేడర్ ను ఏకతాటిపై నడిపించలేకపోతున్నారన్న ప్రచారం వినిపిస్తుంది. మరోవైపు వైఎస్. జగన్ కు వరుసకు సోదరుడైన కమలాపురం ఇంచార్జి దుష్యంత్ రెడ్డి ఇటీవల టీడీపీకి దగ్గరవ్వడం..ఆయన టీడీపీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుండటం వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారింది. గతంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేసిన కొత్తపల్లికి చెందిన పుష్పనాథ్ రెడ్డి తాజాగా టీడీపీలో చేరడం కూడా జగన్ కు ప్రతికూలాంశమైంది. అటు వైఎస్సార్ కుటుంబం జగన్ వర్గం.. షర్మిల, సునీతల వర్గంగా చీలిపోయింది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు పులివెందులలో మెజార్టీ తగ్గిన నేపథ్యం కూడా రాజకీయంగా ఇబ్బందికరమైంది. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వైసీపీ పార్టీ బాధ్యతలను రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కడప నగరపాలక మేయర్‌ కె.సురేష్‌బాబులు పర్యవేక్షిస్తున్నారు.

జగన్ అడ్డాపై చంద్రబాబు ఫోకస్

మరోవైపు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను గెలిచి జగన్ కు షాక్ ఇవ్వాలని టీడీపీ పావులు కదుపుతుంది.
జిల్లా ఇంచార్జి మంత్రి సవిత, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, పులివెందుల టీడీపీ ఇంచార్జి బీటెక్ రవిలు టీడీపీ విజయం కోసం ఎన్నికలలో జగన్ తో తలపడుతున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో మహానాడు నిర్వహించి వైసీపీకి సవాల్ విసిరిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్ అడ్డాలో జరుగుతున్న ఉపఎన్నికల్లో పోటీకి సై అనడంతో ఈ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. విజయం కోసం స్వయంగా చంద్రబాబు పులివెందుల టీడీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా వైసీపీ పరిస్దితిలో ఎలాంటి మార్పు లేదని టీడీపీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ అంచనాలతో వెళ్లవచ్చు. టీడీపీ ఓడితే కూటమికి కౌంట్ డౌన్ మొదలైందని వైసీపీ ప్రచారం చేసుకునే వీలు చిక్కనుంది.