Caller Name Display Service | కాల్ చేసినవారి పేరు ఇక డిస్‌ప్లేలో.. మార్చి నుంచే అమలు!
ఒక్కోసారి తెలియని నంబర్ల నుంచి ఫోన్‌లు వస్తూ ఉంటాయి. అదెవరో తెలియక తికమక పడతాం. ముఖ్యమైన కాల్ కోసం ఎదురు చూసే సమయంలో ఫ్రాడ్ కాల్స్, స్పామ్ కాల్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక ఈ కష్టాలకు చెక్ పడనుంది. ఫోన్ చేసిన వ్యక్తి పేరు ఇకపై డిస్‌ప్లే మీద కనిపిస్తుంది. వచ్చే ఏడాది మార్చి 1నుంచి ఈ విధానం అందుబాటులోకి రానున్నది.
Caller Name Display Service | ఇప్పటి వరకూ అపరిచితులు చేసే ఫోన్‌లకు నంబర్‌లు మాత్రమే కనిపిస్తుంటాయి. కీలకమైన మీటింగ్‌లో లేదా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఇలా వచ్చే ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకోవాలో వద్దో అర్థం కాక అప్పుడప్పుడు చిరాకు పుడుతూ ఉంటుంది. ఏదో ముఖ్యమైన కాల్‌కోసం ఎదురు చూసే సమయంలో ఇలా వచ్చే కాల్స్ తిక్కరేపుతుంటాయి. అదే సమయంలో కొందరు సైబర్ నేరస్తులు కూడా ఫోన్‌లు చేస్తూ ఉంటారు. వెరిఫై చేసుకోవాలంటే ట్రూకాలర్ వాడాల్సి వస్తుంటుంది. ఈ తలనొప్పులన్నింటికీ ఇక తెర పడనున్నది. ఫోన్ చేసిన వ్యక్తి పేరు డిస్‌ప్లేపై కనిపించనుంది. దీనికి సంబంధించిన కాల్ నేమ్ ప్రజెంటేషన్ సర్వీసు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అది విజయవంతం కావడంతో 2026 మార్చి ఒకటవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నారు.
గతంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం ప్రతి సంవత్సరం టెలికం డైరీని ముద్రించేది. అదే విధానం డిజిటల్ రూపంలో అమలు చేయాలని అన్ని మొబైల్ కంపెనీలకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఇండియా (ట్రాయ్) ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఈ విధానాన్ని ప్రైవేటు టెలికం కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వినియోగదారులను రక్షించేందుకు కచ్చితంగా సీఎన్ఏపీ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేయడంతో ప్రయోగాత్మకంగా పనితీరును రెండు రాష్ట్రాలలో పరిశీలిస్తున్నారు.
ఎవరైనా ఒక మొబైల్ ఫోన్ నుంచి మరో మొబైల్ ఫోన్ కు కాల్ చేసినప్పుడు సదరు వ్యక్తి పేరు తో పాటు నెంబర్ స్క్రీన్ మీద కన్పిస్తుంది. ఒకవేళ అప్పటికే ఫోన్ చేసిన వ్యక్తి పేరు మొబైల్ ఫోన్ కాంటాక్టులలో సేవ్ చేసి ఉన్నట్లయితే కొద్ది క్షణాల తరువాత డిస్ ప్లే అవుతుంది. ఉదాహరణకు ఒక ప్లంబర్ పేరును మీరు కాంటాక్టులో సేవ్ చేసి ఉంటారు. ఆ వ్యక్తి ఫోన్ చేస్తే మొదటగా అతను సమర్పించిన రికార్డుల ప్రకారం పేరు స్క్రీన్ మీద కన్పిస్తుంది. ఆ తరువాత కొద్ది క్షణాల్లోనే మారి కాంటాక్టులో సేవ్ చేసుకున్న ప్రకారం కన్పిస్తుంది. ఒకవేళ సేవ్ చేసుకోని మొబైల్ నంబర్లు ఉన్నట్లయితే, కాల్ నేమ్ ప్రజెంటేషన్ సర్వీసు పనిచేస్తుంది. ఆ వ్యక్తి పేరు, నంబర్ కూడా కన్పిస్తుంది. కాల్ కు ఆన్సర్ చేయాలా వదిలేయాలా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధానం 4జీ, 5జీ నెట్ వర్క్ లలో పనిచేయనున్నది. భవిష్యత్తుల్లో 2జీ, 3జీ నెట్ వర్క్ లలో కూడా అమలు చేయనున్నారు. ఒక వేళ ఈ సర్వీసు వద్దని అనుకునే వినియోగదారులు స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
ముఖ్యంగా మహిళలు, చిన్నారులు సీఎన్ఏపీ వినియోగం పట్ల ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లయితే తమ పేరు, నంబర్ కన్పించకుండా ఉండేందుకు టెలికం సర్వీస్ ప్రొవైడర్‌ను కోరవచ్చు. వీరి వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి వారు తమ పేరు మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. దీని మూలంగా మరిన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉందని టెలికం నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో జియో వినియోగదారులకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎయిర్ టెల్ వినియోగదారులకు సీఎన్ఏపీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. సిమ్ కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు నంబర్ కూడా మొబైల్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతోంది. ఈ విధానం అమలు చేయడం మూలంగా ఫ్రాడ్ కాల్స్ బెడద తప్పుతుంది. ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడడం, డబ్బులు పెట్టుబడులు పెట్టాలని, ఫ్లాట్లు కొనుగోలు చేయాలని వేధింపు కాల్స్ సమస్య పూర్తిగా తగ్గుతుందంటున్నారు. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ద్వారానే వినియోగదారులకు కాల్ చేయాలని, సాధారణ నంబర్లతో కాల్ చేయవద్దని కూడా ట్రాయ్ ఆదేశించింది.
Read Also |
America Birth Tourism | అమెరికాలో బర్త్ టూరిజంపై బ్యాన్! గర్భిణులకు నో వీసా!
KC Tyagi : అధిక ప్లైట్ ఛార్జీలు వెనక్కి ఇవ్వాల్సిందే : రాజ్యసభ ఎంపీ కేసీ త్యాగి డిమాండ్
Illegal Aadhaar Centers : అనధికార ఆధార్ సెంటర్లపై అధికారుల దాడులు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram