Asia Cup 2025 | ఆసియాకప్ ఫైనల్లో భారత్ – బంగ్లాపై అలవోక విజయం
దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్ సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరుగబోయే పాక్–బంగ్లాల మధ్య విజేతలో ఫైనల్ పోరు

Asia Cup 2025 | ఊహించినట్లుగానే, భారత్ తన రెండో సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి ఆసియాకప్ ఫైనల్లో ప్రవేశించింది. ఇంతకుముందు మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించిన టీమిండియా, నేడు బంగ్లాదేశ్‌పై గెలిచి నాలుగు పాయింట్లలో టేబుల్ టాపర్‌గా నిలిచి, ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఒకవిధంగా భారత్ బ్యాటింగ్‌లో విఫలమైనట్లే. షరామామూలుగా అభిషేక్ శర్మ(75 పరుగులు: 37 బంతులు, 6 ఫోర్లు, 5 సిక్స్‌లు ) సగం స్కోరు చేయగా, మిగతావారు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఒక్క హార్థిక్(38 పరుగులు: 29 బంతులు, ఒక సిక్స్, 4 ఫోర్లు) మళ్లీ నిలదొక్కుకుని భారత్‌కు ఆ మాత్రమైనా గౌరవప్రదమైన స్కోరు ఇచ్చాడు. అభిషేక్ వీరవిహారం దుబాయ్ మైదానాన్ని మళ్లీ అదిరేలా చేసింది. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డ ఈ యువ ఓపెనర్, పాక్‌తో మ్యాచ్‌లోలాగే చెలరేగిపోయాడు. లేని పరుగుకు రనౌటయ్యాడు గానీ, లేకపోతే భారత్ స్కోరు తీజీగా 200 దాటేది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ధాటిగానే ఆడినా, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం వారిని దెబ్బతీసింది. ఓపెనర్ సైఫ్ హస్సన్(69 పరుగులు, 5 సిక్స్‌లు, 3 ఫోర్లు) తప్ప మిగతావారందరూ తేలిపోవడంతో బంగ్లా 19.3 ఓవర్లకు 127 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ 3, బుమ్రా, వరుణ్ చెరో రెండు, అక్షర్ పటేల్, తిలక్‌వర్మ తలా ఒక వికెట్ తీసుకున్నారు. అభిషేక్ శర్మ వరుసగా రెండోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.