విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లో ఈ నెల 9నుంచి 11వరకు తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ -2025 క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన తెలంగాణ పోలీస్ క్రీడాకారులు, అధికారులు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీస్ జట్లు ఈ పోటీలలో వివిధ విభాగాల్లో 133 పతకాల కోసం పోటీ పడ్డాయి. ఇందుల తెలంగాణ పోలీస్ శాఖ క్రీడాకారులు 28 పతకాలు ( 21 బంగారు, 4 రజతం, 3 కాంస్యం) కైవసం చేసుకున్నారు. డ్యూటీ మీట్‌లో ఓవరాల్ చాంపియన్‌గా తెలంగాణ జైళ్ల శాఖ నిలిచింది. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిరవి గుప్తా, జైళ్ల విభాగం డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళి బాబు, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, ఎస్పీలు శివ కుమార్ గౌడ్, కళాసాగర్, డ్యూటీ మీట్ పోటీ విజేతలు పాల్గొన్నారు.