IPL 2024, SRH vs GT | మ్యాచ్‌కు అడ్డుపడ్డ వర్షం – ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య నేడు జరగాల్సిన ఐపిఎల్ మ్యాచ్ రద్దయింది. దాంతో చెరో పాయింట్ దక్కించుకున్న రెండు జట్లలో, 15 పాయింట్లతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్(Sunrisers in Play Offs)కు దూసుకెళ్లింది.

ఐపిఎల్ 2024 సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన 66వ మ్యాచ్ వర్షం(Heavy rain in Hyderabad) కారణంగా రద్దయింది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్లు పోటీపడాల్సిన ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. హైదరాబాద్‌లో నేడు ఆగకుండా కురుస్తున్న వర్షం మ్యాచ్‌ను కనీసం టాస్ కూడా వేయకుండా చేయడంతో ఒక్క బాల్ పడకుండానే, అంపైర్లు రద్దు చేయడం(Match Abandoned)తో పాటు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇదివరకే ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకున్న గుజరాత్‌కు దీంతో ఉపయోగం లేకపోయినా, 14 పాయింట్లతో ఉన్న హైదరాబాద్ 15 పాయింట్లకు చేరుకుని, నేరుగా ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. సన్‌రైజర్స్‌కు ఇంకో మ్యాచ్ మిగిలిఉండటంతో ప్లేఆఫ్ స్థానం మాత్రం ఖరారు కాలేదు.
ఇప్పుడు సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ స్థానం ఆసక్తికరంగా మారింది. మిగిలిన మ్యాచ్‌లో గెలిస్తే 17 పాయింట్లతో నిలబడుతుంది. కానీ, రెండో స్థానానికి చేరాలంటే మాత్రం కోల్‌కతా చేతిలో రాజస్థాన్ ఓడిపోవాలి. ఒకవేళ పంజాబ్ చేతిలో ఓడిపోతే మాత్రం 3వ స్థానంలో ఉంటుంది. అప్పుడు 4వ స్థానానికి పోటీ పడేది చివరి మ్యాచ్‌లు ఆడనున్న చెన్నై, బెంగళూరు, సాంకేతికంగా లక్నో(ముంబైపై భారీ తేడాతో గెలిస్తే), ఢిల్లీ(ఇతర మ్యాచ్‌ల ఫలితాలు అనుకూలంగా ఉంటేనే). ఓడిపోతే రేపటితో లక్నో కథ అధికారికంగా ముగిసిపోతుంది.
ఏదేమైనప్పటికీ సన్‌రైజర్స్‌కు 3వ స్థానమైతే పక్కా. రెండో స్థానంలో ఉంటే రెండు అవకాశాలుంటాయి కాబట్టి ఆఖరు మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిచి రాజస్థాన్ ఓడిపోవాలని ప్రార్థించాలి.