Viral: మీ మెదడుకు పరీక్ష.. ఈ ఫొటోలు, వీడియోలోని జంతువులను గుర్తు పట్టగలరా..?

Viral:
విధాత: ప్రకృతి అనేక రకాల జీవరాశులను తనలో ఇముడ్చుకున్న అద్భుత ప్రపంచం. అందులో ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకతతో కూడిన శారీరక నిర్మాణం కలిగి ఉన్నాయి. తమ శారీరక నిర్మాణాల్లోని ప్రత్యేకతలతో పశుపక్ష్యాదులు, జంతుజాలలు తమ ప్రాణరక్షణతో పాటు ఆహారపు వేటలను సాగిస్తుంటాయి. కొన్ని జంతువులు ఆత్మరక్షణకు, ఆహార వేటకు తాము నివసించే పరిసరాల మేరకు శరీర రంగులు, ఆకృతులు మారుస్తుంటాయి.
కొన్ని సీతాకోక చిలుక జాతులు ఆకుల మాదిరి నిర్మాణంతో ఆకుల్లోనే కలిసిపోయి గుర్తుపట్టలేనంతగా మనకు పరీక్ష పెడుతుంటాయి. పసిరిక పాములు, ఆకు పురుగులు సైతం అలాంటి కోవలోనివే. గుడ్లగూబలైతే తమ వంటి రంగు చెట్టుగూడును ఎంపిక చేసుకుని దానిలోనే కలిసిపోయి శతృవును ఏమారుస్తుంటాయి.
ఇక్కడి ఫోటోలోని గుడ్లగూబను చూస్తే సినిమాల్లోని మాయాల మాంత్రికుడి సెట్టింగ్ లను తలపిస్తాయి. సముద్రపు జలచరాల సంగతి సరేసరి. వాటిలో అనేకం నీటిలోని తమ ఆవాసాల రంగులు, ఆకృతులతో వేటను, ఆత్మరక్షణను కొనసాగిస్తుంటాయి.అలాంటి జీవరాశుల ప్రత్యేకతలు ఎంత తెలుసుకున్న ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది.
మనకు తెలిసిన చిరుతపులులలో చీతాలు, మచ్చల చిరుత, నల్ల చిరుత, మంచు చిరుత వంటి పలు చిరుత జాతులున్నాయి. జంతువుల్లో అన్నింటికంటే వేగంగా పరుగెత్తే చిరుతలు చెట్లు కూడా ఎక్కెస్తుంటాయి. అలాంటి ఓ చిరుత ఓ అడవిలో చెట్టుపైన దాగి కిందకు దిగుతున్న ఫోటో వైరల్ గా మారింది. ఇందులో ప్రత్యేకత ఏముందంటే అచ్చం చెట్టు బెరడు ఆకృతి మాదిరిగానే ఆ చిరుత చర్మం కూడా ఉండగా అది పూర్తిగా చెట్టు రంగులో కలిసిపోయింది.
ఆ ఫోటోను చూస్తే ముందుగా వీక్షకులకు చెట్టు మాత్రమే కనిపిస్తుంది. తదేకగా గమనిస్తే చెట్టుపై నుంచి దిగుతున్న చిరుత కనిపిస్తుంది. ఇలాంటి అద్భుతాలెన్నో మనకు ప్రకృతిలో కనువిందు చేస్తుంటాయి. అయితే ఆటవీ ప్రయాణాల్లో మాత్రం ఈ తరహా జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాపాయం తప్పదని నెట్టిజన్లు కామెంట్ చేస్తున్నారు.