Bhopal railway overbridge | ఇటువంటి వంతెన మీరెక్కడా చూసిఉండరు

ఒక నగరంలో వాహనాల ట్రాఫిక్ సులభతరం కావాల్సిన ఓవర్‌ బ్రిడ్జ్‌లో 90 డిగ్రీల మలుపు ఎలా ఉంటుంది? వాహనదారులు అక్కడ ఎలా తిరుగుతారు? అనే ప్రశ్నలు స్థానికులు, నెటిజన్ల నుంచి ఎగసిపడుతున్నాయి. సోషల్ మీడియాలో వంతెనపై వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తాయి. వాస్తవానికి ఇటువంటి డిజైన్‌ సాంకేతికంగా ప్రమాదకరమైనదే కాదు, వాస్తవికతకూ దూరమైనదిగా మారింది.

Bhopal railway overbridge | ఇటువంటి వంతెన మీరెక్కడా చూసిఉండరు

⦁ లంబకోణంలో వంతెన – ఏడుగురు ఇంజినీర్ల సస్పెన్షన్
⦁ భోపాల్‌లో 90 డిగ్రీల మలుపు ఉన్న బ్రిడ్జిపై విపరీత విమర్శలు

భోపాల్‌లో నూతనంగా నిర్మించిన రైలు ఓవర్‌ బ్రిడ్జ్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలను మూటగట్టుకుంది. సోషల్​ మీడియా వెటకారాలు, మీమ్స్​తో దద్దరిల్లిపోతోంది.​ నగరంలోని ఐష్‌బాగ్ ప్రాంతంలో రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) ఓ మంచి పరిష్కారంగా ఉండాల్సింది పోయి, దారుణమైన ఇంజనీరింగ్​ తప్పిదంగా నిలిచింది. కారణం – బ్రిడ్జ్‌లో ఉన్న అతి తక్కువ పొడవు గల 90 డిగ్రీల మలుపు! భోపాల్(Bhopal)​లో కట్టిన ఈ వింత నిర్మాణంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో మధ్యప్రదేశ్(Madhya Pradesh) ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD)కి చెందిన ఏడుగురు ఇంజినీర్లను తక్షణమే సస్పెండ్ చేయగా, పదవీ విరమణ పొందిన మరో ఇంజినీర్‌పై శాఖాపరమైన విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్ (CM – Mohan Yadav) స్వయంగా ఈ వ్యవహారంపై జోక్యం చేసుకున్నారు.

వింత మలుపు.. విచిత్ర స్పందనలు

ఒక నగరంలో వాహనాల ట్రాఫిక్ సులభతరం కావాల్సిన ఓవర్‌ బ్రిడ్జ్‌లో 90 డిగ్రీల మలుపు ఎలా ఉంటుంది? వాహనదారులు అక్కడ ఎలా తిరుగుతారు? అనే ప్రశ్నలు స్థానికులు, నెటిజన్ల నుంచి ఎగసిపడుతున్నాయి. సోషల్ మీడియాలో వంతెనపై వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తాయి. వాస్తవానికి ఇటువంటి డిజైన్‌ సాంకేతికంగా ప్రమాదకరమైనదే కాదు, వాస్తవికతకూ దూరమైనదిగా మారింది.

ఈ తప్పిదానికి కారణమై సస్పెండ్ అయిన ఇంజినీర్లు:
⦁ సంజయ్ ఖాండే (చీఫ్ ఇంజినీర్)
⦁ జి.పి. వర్మ (చీఫ్ ఇంజినీర్)
⦁ జావేద్ షకీల్ (ఇన్‌ఛార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)
⦁ రవిశుక్లా (ఎస్డీవో)
⦁ ఉమాశంకర్ మిశ్రా (సబ్ ఇంజినీర్)
⦁ షానుల్ సక్సేనా (అసిస్టెంట్ ఇంజినీర్)
⦁ షబానా రాజక్ (ఇన్‌ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)

ఇంకా, పదవీ విరమణ పొందిన సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం.పి. సింగ్‌పై శాఖా విచారణ జరగనుంది. అంతేకాక, ప్రాజెక్ట్‌కి సంబంధించి పనిచేసిన ఆర్కిటెక్ట్ సంస్థ పునీత్ చద్ధా ఇంకా డిజైన్ కన్సల్టెంట్ డైనమిక్ కన్సల్టెంట్లపై నిషేధం విధించారు. అధికారుల వాదన ఏమిటంటే… రోడ్డు నిర్మాణం కోసం స్థలం తక్కువగా ఉండటం, సమీపంలో మెట్రో స్టేషన్ ఉండటం వల్ల తప్పనిసరిగా ఈ మలుపు ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు. కొన్ని అడుగుల అదనపు స్థలం ఉండుంటే, ఈ మలుపును సాఫీగా, వంపుగా మార్చే అవకాశం ఉండేదని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిడ్జ్‌ను సురక్షితంగా వాడుకునేలా ఎలా మలచుకోవచ్చో ఆ కమిటీ సలహాలు ఇవ్వనుంది. ఇకపోతే, అవసరమైన మార్పులు చేసిన తర్వాతే ఈ ఓవర్‌బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా మహమాయ్ కా బాగ్‌, పుష్పనగర్‌, స్టేషన్ ప్రాంతం నుంచి న్యూ భోపాల్ వైపు అనుసంధానం మెరుగవుతుందని ఆశించారు. దాదాపు మూడు లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలగాల్సిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు నిందలపాలైంది.