Under The Train For Reels| ఏం గుండెరా..పిల్లోడా..రీల్స్ కోసం రైలు కింద..!

విధాత : రీల్స్ కోసం రిస్క్ చేయడం జనాలకు పిచ్చిగా మారింది. వైరల్ అయ్యేందుకు రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తునే ఉన్నా రీల్స్, సెల్ఫీ వీడియోలు, ఫోటోలపై మోజు తగ్గడం లేదు. ఇటీవల కదిలే రైలు కింద పట్టాల మధ్య పడుకుని రీల్స్ చేసిన ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం అందరిని కలవరపెడుతుంది. అయితే ఈధఫా ఓ మైనర్ బాలుడు రీల్స్ కోసం పట్టాల మధ్య అడ్డంగా పడుకుని చేసిన రీల్ చూసేవారికి ఒళ్లు గగుర్పోడిచేదిగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఆ పిల్లాడి పిచ్చి సాహసం చూసినవారికే గుండె జారిపోయేలా ఉంటే..ఆ పిల్లాడి గుండె ఎంత గట్టిదో అనుకుంటున్నారు నెటిజన్లు. ఇన్‌స్టా రీల్స్ కోసం ఒడిశాలో ఓ బాలుడు తన ప్రాణాలతో ఆటలాడాడు. రీల్స్ కోసం ట్రైన్ ట్రాక్‌పై పడుకొని స్టంట్ చేశాడు.
అదంతా మరో పిల్లాడు సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. రైలు తన మీద నుంచి దాటిపోయాకా అదేదో ఘన కార్యమన్నట్లుగా ఆ బాలుడు కేరింతలు కొట్టడం విడ్డూరం. ఈ స్టంట్ వీడియోను చూసిన పోలీసులు కేసు నమోదు చేసి సదరు ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పిచ్చి సాహసాలు చేసి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.