World’s shortest couple | ప్రపంచంలోనే అత్యంత పొట్టి దంపతులు.. ఈ ఇద్దరి మధ్య అద్భుతమైన ప్రేమకథ..!
World's shortest couple | ఒకప్పుడు పెళ్లంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు చూడాలనే వాళ్లు. ఇప్పుడు ఏ తరాలూ లేవు. ఆస్తిపాస్తులు మాత్రమే అసలైన కొలమానంగా మారాయి. యువత కూడా తాము చేసుకోబోయే వ్యక్తికి బాగా ఆస్తులుంటే చాలు మిగతా అన్ని విషయాల్లో రాజీపడుతున్నారు. ఆస్తి మినహా మిగతా ఏ అర్హతలున్నా పెళ్లి చేసుకోవడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో శారీరకంగా పొట్టిగా ఉన్న ఓ జంట మాత్రం తమలాంటి ఆహార్యం ఉన్న వ్యక్తి దొరికే వరకు నిరీక్షించి మరీ పెళ్లి చేసుకున్నారు.

World’s shortest couple : ఒకప్పుడు పెళ్లంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు చూడాలనే వాళ్లు. ఇప్పుడు ఏ తరాలూ లేవు. ఆస్తిపాస్తులు మాత్రమే అసలైన కొలమానంగా మారాయి. యువత కూడా తాము చేసుకోబోయే వ్యక్తికి బాగా ఆస్తులుంటే చాలు మిగతా అన్ని విషయాల్లో రాజీపడుతున్నారు. ఆస్తి మినహా మిగతా ఏ అర్హతలున్నా పెళ్లి చేసుకోవడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో శారీరకంగా పొట్టిగా ఉన్న ఓ జంట మాత్రం తమలాంటి ఆహార్యం ఉన్న వ్యక్తి దొరికే వరకు నిరీక్షించి మరీ పెళ్లి చేసుకున్నారు. అదే వారిని విలక్షణమైన జంటగా రికార్డులకెక్కేలా చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌కు చెందిన పాలో గాబ్రియేల్ డా సిల్వా బారోస్, కటియుసియా లీ ఇద్దరూ ఆహార్యం పరంగా అత్యంత పొట్టి వ్యక్తులు. వారు సమాజం నుంచి ఎదురైన అవహేళనలకు కుంగిపోకుండా.. తమలాంటి వ్యక్తుల కోసం అన్వేషించారు. వారి భౌతిక లక్షణాలను అంగీకరించి మరీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. వారి అన్వేషణ ఎట్టకేలకు ఫలించి 2006లో ఇరువురు కలుసుకున్నారు. దాదాపు 15 ఏళ్లు వారు ఒకరి అభిప్రాయాలను ఒకరు షేర్ చేసుకుంటూ.. ఇద్దరి మధ్య బలమైన సంబంధాన్ని పెంపొందించుకున్నారు.
ఆ తర్వాత ఇరువురు వివాహబంధంతో ఒక్కటవ్వాలని భావించి పెళ్లి చేసుకున్నారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి వివాహిత జంటగా గిన్నిస్ రికార్డులకెక్కారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగామని, తామిరువురం ఎదురపడతామనే ఊహించలేదని వారు చెప్పారు. తమ బంధాన్ని కొనసాగించగలమా..? ఎలాంటి సవాళ్లనైనా తట్టుకుని ఇరువురం నిలబడగలుగుతామా..? అని ఆలోచించుకున్నామని తెలిపారు. అలా ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన ఏర్పడ్డాక వివాహ బంధంలోకి అగుడుగుపెట్టామని వారు వెల్లడించారు.
తాము చూసేందుకు చిన్నగా ఉన్నా తమ ఇద్దరి మనసులు చాలా విశాలమని, జీవితం విసిరే ప్రతి సవాలుని ఎదుర్కొని సంతోషంగా జీవించగలమని ఆ జంట నమ్మకంగా చెప్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డుల ప్రకారం.. ఈ జంట ఉమ్మడి ఎత్తు 181.41 సెం.మీ (71.42 ఇంచులు). పాలో గాబ్రియేల్ ఎత్తు 90.28 సెంటీ మీటర్లు (35.54 ఇంచులు) కాగా.. కటియుసియా ఎత్తు 91.13 సెంటీమీటర్లు (35.88 ఇంచులు). ఈ విషయాన్ని గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. నెటిజన్స్ ‘ది బెస్ట్ కపుల్’ అంటూ స్పందిస్తున్నారు. ఈ జంట సూపర్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.