AI Engineer Devika | డెవిన్‌కు పోటీగా ఇండియన్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దేవిక..!

AI Engineer Devika | డెవిన్‌కు పోటీగా ఇండియన్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దేవిక..!

AI Engineer Devika : సాంకేతికత అభివృద్ధి చెందినా కొద్ది కొత్తకొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ వేగంగా అభవృద్ధి చెందుతున్నది. ఏఐ రేసులో పలు టెక్‌ కంపెనీలు పోటీపడి దూసుకుపోతున్నాయి. ప్రముఖ టెక్‌ కంపెనీ కాగ్నిషన్‌ ఇప్పటికే ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ డెవిన్‌ను రూపొందించింది. ఇది సింగిల్‌ ప్రాంప్ట్‌తో వెబ్‌సైట్‌లు, సాఫ్ట్‌వేర్‌లను కోడింగ్‌ చేయగల సామర్థ్యం కలిగి ఉంది.

ఈ డెవిన్‌కు ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా గుర్తింపు దక్కింది. అయితే డెవిన్‌కు పోటీగా భారత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వీహెచ్‌ ముఫీద్‌.. మరో ఓపెన్‌ సోర్స్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ‘దేవిక’ను రూపొందించారు. ‘దేవిక ఒక ఏజెంటిక్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మనుషులు అందించే హైలెవెల్‌ సూచనలను ఇది అర్థం చేసుకుంటుంది. వాటిని వివిధ భాగాలుగా విభజించి, అవసరమైన సమాచారాన్ని శోధించి, ఇచ్చిన లక్ష్యాన్ని సాధించేలా కోడ్‌ను రాయగలుగుతుంది’ అని ముఫీద్‌ తెలిపారు.

కాగా, అమెరికాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘కాగ్నిషన్‌ ఏఐ’ గత నెలలో ‘డెవిన్‌’ను మార్కెట్లోకి విడుదల చేసింది. సంక్లిష్టమైన ఇంజనీరింగ్‌ టాస్క్‌లను పూర్తిచేయటం డెవిన్‌ ప్రత్యేకత. అయితే అత్యంత పాపులర్‌ అయిన ‘డెవిన్‌’కు పోటీగా ‘దేవిక’ను నిలబెట్టడమే తన ఉద్దేశమని ముఫీద్‌ చెప్పారు. యూజర్ల ప్రమేయం లేకుండా కంప్యూటర్‌ కోడ్‌లో లోపాలను దేవిక సరిచేస్తుందని ఆయన అన్నారు.