BSOD | ఏమిటీ ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్’.. ఈ సమస్య ఎందుకు వస్తుంది..?
BSOD | ప్రపంచవ్యాప్తంగా విండోస్ వినియోగదారులు శుక్రవారం (జూలై 19న) బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) సమస్యను ఎదుర్కొన్నారు. దీనివల్ల లక్షల మంది వినియోగదారుల ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్‌లు వాటంతట అవే షట్‌డౌన్ అయ్యాయి.

BSOD : ప్రపంచవ్యాప్తంగా విండోస్ వినియోగదారులు శుక్రవారం (జూలై 19న) బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) సమస్యను ఎదుర్కొన్నారు. దీనివల్ల లక్షల మంది వినియోగదారుల ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్‌లు వాటంతట అవే షట్‌డౌన్ అయ్యాయి. లేదంటే రీస్టార్ట్ అయ్యాయి. ప్రపంచ దేశాల్లో విమానయాన సంస్థలు, మీడియా సంస్థలు, స్టాక్ మార్కెట్‌లు కూడా దీని కారణంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ బీఎస్‌ఓడీ అంటే ఏమిటి..? ఈ సమస్య ఎందుకు వస్తుంది..? అనే వివరాలు తెలుసుకుందాం..
బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే..
ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్‌నే బ్లూ స్క్రీన్ ఎర్రర్, బ్లాక్ స్క్రీన్ ఎర్రర్, స్టాప్ కోడ్ ఎర్రర్ అని కూడా పిలుస్తారు. మీ సిస్టమ్ అనుకోకుండా షట్ డౌన్ అయినప్పుడు లేదంటే రీస్టార్ట్ అయినప్పుడు ఇది జరుగుతుంది. మీ కంప్యూటర్‌లో హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఈ రకమైన సమస్య వస్తుంది. కొత్త హార్డ్‌వేర్ కారణంగా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. నిపుణుల చెబుతున్న ప్రకారం.. ఈ సమస్య తలెత్తితే సిస్టమ్‌ను సేఫ్ మోడ్‌లో ప్రారంభించాలి. అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా రీఫ్రెష్ చేయాలి.
ఈ సమస్య తలెత్తినప్పుడు వినియోగదారుల ల్యాప్‌టాప్ లేదంటే పర్సనల్ కంప్యూటర్‌కు ఒక సందేశం అందుతుంది. ‘మీ కంప్యూటర్‌ను కాపాడటానికి మేం విండోస్‌ను మూసివేస్తున్నాం’ అనేది ఆ సందేశం సారాంశం. అంటే కంప్యూటర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటడానికి విండోస్ షట్ డౌన్ అవుతాయి. ఈ సమస్య హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ కారణాల వల్ల కూడా ఏర్పడుతుంది. అంటే ర్యామ్, హార్డ్ డ్రైవ్, గ్రాఫిక్స్ కార్డ్, పవర్ సప్లయ్ యూనిట్ కారణంగాగానీ, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లు, గేమ్‌లు, డ్రైవ్‌ల కారణంగాగానీ సమస్య తలెత్తవచ్చు.
బ్లూ స్క్రీన్ డెత్ సమస్యకు పరిష్కారం ఎలా..?
అయితే విండోస్ బ్లూ స్క్రీన్ డెత్ సమస్యను పరిష్కరించుకోవడానికి మైక్రోసాఫ్ట్ కచ్చితమైన మార్గ దర్శకాలను వెల్లడించలేదు. కానీ విండోస్‌లో గెట్ హెల్ప్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ ట్రబుల్ షూట్ బీఎస్ఓడీ ఎర్రర్ అని టైప్ చేయాలి. ఆ తరువాత మీకు కనిపించే సూచలనను అనుసరిస్తూ సమస్యను పరిష్కరించుకోవాలి.