కేసీఆర్ పై 100 నామినేషన్లు వేస్తాం: కామారెడ్డి రైతులు

కేసీఆర్ పై 100 నామినేషన్లు వేస్తాం: కామారెడ్డి రైతులు

– కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు

విధాత ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్ ను ఓడిస్తామని, ఆయనపై పోటీగా రైతులు 100 నామినేషన్లు వేస్తామని మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు.. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా ప్రకటించారు.

మంగళవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలపై చర్చించారు. ఆయా గ్రామాల రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ తమ భూములు కాపాడుకునేందుకు ఎందాకైనా వెళ్తామని తెగేసి చెప్పారు.

మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ కాలేదని, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను అనవసరంగా బద్నాం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అసంబద్ధ మాటలు మాట్లాడారన్నారు. రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతోనే తాము ఉద్యమ బాట పట్టామన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

మొన్న గజ్వేల్ కార్యకర్తలతో సీఎం మాట్లాడుతూ కామారెడ్డిలో తనకు పని ఉండటం వల్లనే అక్కడికి వెళ్తున్నానని కేసీఆర్ చెప్పారని, కేసీఆర్ కు ఇక్కడేం పని ఉందని రైతులు ప్రశ్నించారు. గజ్వేల్ లో భూములు అయిపోయాయి… ఇక్కడికి ఆ పనిమిదే వస్తున్నారా అని ప్రశ్నించారు. రైతు రాములు ఆత్మహత్య లాంటి ఘటనలు మరోసారి జరగకముందే కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని చెప్పిన తర్వాతే కేసీఆర్ కామారెడ్డికి రావాలని సూచించారు.

గవర్నర్ ద్వారా మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రతి గ్రామం నుంచి 15 చొప్పున కేసీఆర్ పై 100 నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు. దానికోసం రైతులందరం పార్టీలకు అతీతంగా సంఘటితం అవుతామని, 9 గ్రామాల్లో రైతులకు సంబంధించిన బంధువులతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. 9 గ్రామాల్లోనే కాకుండా నియోజకవర్గం మొత్తం కలియ తిరిగి కాళ్ళు మొక్కి అయినా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని, తమకు మద్దతిచ్చే వ్యక్తికి ఓటు వేస్తామని స్పష్టం చేశారు.