మనోరాబాద్ కు 24 గంటల వైద్య సౌకర్యం: మంత్రి హరీష్ రావు

విధాత, మెదక్ బ్యూరో: మనోహరాబాద్ మండలం చేయాలని దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ నిజం చేశారనీ, ప్రస్తుతం 24 గంటల వైద్యం అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బుధవారం మంత్రి తూప్రాన్ పర్యటనలో భాగంగా మనోహరాబాదులో నూతనంగా నిర్మించిన పీహెచ్ సీ ప్రారంభించి మాట్లాడారు.
పీహెచ్సీలో ఉచితంగా అన్ని రకాల పరీక్షలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గర్భిణులకు చెకప్ లు కూడా ఇక్కడ జరుగుతాయన్నారు. త్వరలో మనోహరాబాద్ కి పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తామన్నారు. ఎండాకాలంలో కూడా హల్దీ వాగు పారుతుందంటే కేసీఆర్ కృషివల్లే సాధ్యమైందన్నారు.
తాగడానికి మంచినీళ్లు లేనటువంటి ప్రాంతంలో ఈరోజు ప్రతి ఇంటికీ నీళ్లు తెచ్చామన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తానంటే నమ్ముతారా? ఈరోజు కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతుకు విలువ పెరిగింది భూమికి ధర పెరిగిందన్నారు.
సద్ది తిన్న రేవు తలవాలి.. పనిచేసిన కేసీఆర్ ను ఆశీర్వదించాలనీ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రజహర్షి షా, జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి పాల్గొన్నారు.