కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి అందిన ఫిర్యాదు
ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తొలి రోజునే ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు అందడం ఆసక్తికర పరిణామంగా నిలిచింది

విధాత : ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తొలి రోజునే ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు అందడం ఆసక్తికర పరిణామంగా నిలిచింది. ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విచారణ జరుపాలని ఏసీబీకి ఫిర్యాదు చేశారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టు పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్థిక అవతవకలు జరిగాయని, నకిలీ ఎస్టిమేషన్లు, అంచనాలను పెంచడం ద్వారా వేలాది కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని ఫిర్యాదులో ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు పేరుతో ఒప్పందం జరిగి 7లింకులు, 228ప్యాకేజీలతో పనులు జరుగుతున్న క్రమంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందని, ఆ తర్వారా ప్రాజెక్టు రీడిజైన్లు చేసి, నకిలీ ఎస్టిమేషన్లు, అంచనాల పెంపుతో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి వేలకోట్ల దోపిడికి పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం అవినీతిపై మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావు, కవితతోపాటు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపైన, ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపైన కేసు నమోదు చేసి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.