భ‌విష్య‌త్తు అంతా ఏఐదేన‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఆ దిశ‌గా చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది

  • ప్ర‌పంచ స్థాయి కంపెనీల రాకతో మ‌రింత పెర‌గ‌నున్న ఉద్యోగాలు
  • వాటితోపాటే ఉపాధి అవ‌కాశాలు
  • రాష్ట్ర ప్ర‌భుత్వం ముమ్మ‌ర క‌స‌ర‌త్తు!
  • ఐఎస్‌బీ త‌ర‌హాలో స్కిల్ యూనివ‌ర్సిటీ
  • హైద‌రాబాద్‌లో స్కిల్ వ‌ర్సిటీ ఏర్పాటు!
  • జిల్లా కేంద్రాల్లో మ‌రో ప‌ది సెంటర్లు
  • ఇక్క‌డ శిక్ష‌ణ తీసుకున్న విద్యార్థుల‌కు
  • పుష్క‌ల‌మైన అవ‌కాశాలు ల‌భిస్తాయి
  • ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు
  • నాస్కామ్ సౌజన్యంతో ఏఐ స‌ద‌స్సు

విధాత‌, హైద‌రాబాద్‌: ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ఈ మాట‌ ఈ మ‌ధ్య త‌ర‌చుగా విన్పిస్తున్న‌ది. మూడు నాలుగు ద‌శాబ్ధాల క్రితం ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఐటీ) పేరు విన్నాం. ఐటీ రాక‌తో ఉద్యోగాలు ఊడిపోతాయ‌ని అప్ప‌ట్లో దుష్ప్ర‌చారం జ‌రిగింది. ఐటీ రాక‌తో ఉద్యోగాల క‌ల్ప‌న, ఉపాధి అవ‌కాశాలు పెరిగాయేకానీ.. ఏ రంగంలోనూ ఉపాధి అవ‌కాశాల‌కు అంత‌గా గండి ప‌డ‌లేదు. గ‌త రెండు మూడు సంవ‌త్స‌రాల ఏఐపై పలు అంత‌ర్జాతీయ సంస్థ‌లు పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెడుతున్నాయి. భ‌విష్య‌త్తు అంతా ఏఐదేన‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఆ దిశ‌గా చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. ఈ రంగంలోనూ భారీగా ఉద్యోగావ‌కాశాలు ఉండ‌నున్న నేప‌థ్యంలో స‌ర్కారు వ‌డివ‌డిగా అడుగులేస్తున్న‌ది. హైద‌రాబాద్ న‌గ‌రంలో, ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు కొర‌త లేదు. ఇప్ప‌టికే ఐటీ రంగంలో సుమారు ప‌ది లక్ష‌ల మంది వ‌ర‌కు ఉపాధి పొందుతున్నారు. రోజు రోజుకు విస్త‌రిస్తున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో వంద ఎక‌రాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేయ‌నున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా ఏర్పాటు చేస్తున్నందున అంత‌క‌న్నా ముందే ఏఐ సిటీని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం స‌న్నాహాలు మొద‌లు పెట్టింది. గ్లోబ‌ల్ ఐటీ కంపెనీల‌ను ఇక్క‌డ ఆహ్వానించ‌నున్నారు. ఇటీవ‌ల పెట్టుబ‌డుల‌ను ఆకర్షించేందుకు ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి బృందం స్విట్జ‌ర్ ల్యాండ్ లోని దావోస్‌లో ప‌ర్య‌టించి వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సులో పాల్గొన్న‌ విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కాన్ఫ‌రెన్స్‌ను నిర్వ‌హించేందుకు నాస్కామ్ (నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ స‌ర్వీస్ కంపెనీస్‌) అంగీక‌రించింద‌ని ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధ‌ర్ బాబు తెలిపారు. ఏఐ రావ‌డం వ‌ల్ల ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని, అంత‌గా ఆందోళ‌న చెందాల్సిన ప‌రిస్థితులు లేవ‌న్నారు. గ‌తంలో ఐటీ రాక వ‌ల్ల ఉద్యోగాలు పోతాయ‌ని అపోహ‌లు క‌ల్పించార‌ని, ఆ స్థాయిలో న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఏఐలో కూడా ప్ర‌పంచ ప‌టంలో తెలంగాణ‌ చోటు ద‌క్కించుకుంటుంద‌ని మంత్రి ధీమా వ్య‌క్తం చేశారు.

ఐఎస్‌బీ త‌ర‌హాలో స్కిల్ యూనివ‌ర్సిటీ

ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) త‌రహాలో న‌గ‌రంలో స్కిల్ యూనివ‌ర్సిటీ ని ఏర్పాటు చేయాల‌నే యోచ‌న‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ఉంది. టాటా కంపెనీతో పాటు మ‌రో నాలుగు ప్ర‌ముఖ కంపెనీలు ఇందులో భాగ‌స్వామ్యం అయ్యేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యంతో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత స్కిల్ యూనివ‌ర్సిటీని స్థాపించ‌నున్నారు. దీనికి అనుబంధంగా మ‌రో ప‌ది స్కిల్ సెంట‌ర్ల‌ను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధ‌ర్ బాబు వెల్ల‌డించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీఅ రంగంలో వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా శిక్ష‌ణ ల‌భిస్తుంద‌ని, ఫ‌లితంగా ఇంజినీరింగ్ చేసి బ‌య‌ట‌కు వ‌స్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు. ఇక్క‌డ శిక్ష‌ణ తీసుకున్న విద్యార్థుల‌కు ఫుష్క‌ల‌మైన అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని, పోటీ ప్ర‌పంచంలో నిల‌దొక్కుకుంటార‌ని శ్రీధ‌ర్ బాబు తెలిపారు.

TAAZ

TAAZ

Next Story