తెలంగాణలో అధికారమే కాంగ్రెస్ లక్ష్యం: ఏఐసీసీ పరిశీలకుడు రవీంద్ర ఉత్తమ్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి, ఏఐసీసీ అబ్జర్వర్ రవీంద్ర ఉత్తమ్ రావు దళ్వి అన్నారు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి, ఏఐసీసీ అబ్జర్వర్ రవీంద్ర ఉత్తమ్ రావు దళ్వి అన్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం ఆదివారం స్థానికంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దళ్వి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలా అదుకుందో, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలకు ఏం సంక్షేమ పథకాలు అందించిందో ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ హామీలు ఇచ్చి, అధికారంలోకి రాగానే తుంగలో తొక్కిందని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత లాంటి 6 గ్యారంటీ స్కీంలను తక్షణమే అమలు చేస్తామని చెప్పారు. ఇంటింటికి తిరుగుతూ ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ అధికారం చేజిక్కుంచుకొని, తెలంగాణా ఇచ్చిన తల్లి సోనియమ్మకు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీసీ ఉపాధ్యక్షురాలు బీ శోభారాణి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, ఏఐసీసీ ఎస్సీ విభాగం నేషనల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్ కుమార్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు కూర వెంకట్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఓబీసీ విభాగం చైర్మన్ బొమ్మతి విక్రం పాల్గొన్నారు.