పండుగ త‌ర్వాత ప్ర‌చార జాత‌రే!

పండుగ త‌ర్వాత ప్ర‌చార జాత‌రే!
  • ద‌స‌రా త‌ర్వాత తుది జాబితాలు
  • పొత్తుల‌పైనా పూర్తిస్థాయి స్ప‌ష్ట‌త‌
  • ఇక‌పై ఉమ్మ‌డి ప్ర‌చారాల జోరు
  • మ‌రోసారిరాహుల్‌, ప్రియాంక రాక‌
  • బీజేపీ నుంచి మోదీ, షా, న‌డ్డా
  • పూర్తి స్థాయి ప్ర‌చారంలోకి కేసీఆర్‌
  • 30కిపైగా స‌భ‌ల్లో పాల్గొనే అవ‌కాశం
  • బాంబుల్లాంటి విమ‌ర్శ‌ల‌తో దీపావ‌ళే!


విధాత: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం దగర్గ పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయబోతున్నాయి. అన్ని పార్టీల ప్రచారాలకు దసరా పండుగ కొంత విరామం ఇస్తుండ‌టంతో పండగ తర్వాత‌ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వ‌హించేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. తుది విడుత జాబితాల‌తోపాటు.. పొత్తుల అంశం కూడా కూడా ఒక కొలిక్కి రానున్న‌ది. కీల‌క అంశాల‌న్నీ కుదురుకుంటున్న రీత్యా.. పండుగ ముగియ‌గానే రాబోయే దీపావ‌ళి పండుగ‌కు ముందే అధికార‌, విప‌క్ష పార్టీల నాయ‌కుల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ల‌క్ష్మీబాంబుల్లా మోత మోగ‌నున్నాయి.



ఇప్పటికే బీఆరెస్‌ అందరికంటే ముందుగానే 115మంది అభ్యర్థులను ప్రకటించి, క్షేత్ర స్థాయిలో ప్రచార పర్వంలో ముందుంది. అభ్యర్థుల ప్రచారానికి తోడుగా ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌, కీల‌క మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హిస్తున్న‌ సభలు బీఆరెస్‌ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. పదేళ్లలో బీఆరెస్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కొత్తగా మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలను వారు తమ ప్రచారంలో ప్రజల ముందుంచుతున్నారు.


కాంగ్రెస్‌ సైతం 55మందితో తొలి జాబితా విడుదల చేసింది. రెండో జాబితా కసరత్తు పూర్తి చేసి రేపోమాపో ప్రకటించనుంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వరంగల్‌, కరీంనగర్‌, నిజమాబాద్ జిల్లాల్లో నిర్వ‌హించిన‌ బస్సుయాత్రలలో పాల్గొని, ఆయా ప్రాంతాల్లో స‌భ‌లు, కార్న‌ర్ మీటింగ్‌ల‌లో ప్ర‌సంగించి, ఆ పార్టీ తొలి దఫా ప్రచార పర్వానికి జోష్‌ తెచ్చారు.


ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లతో జనంలోకి తమ పథకాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కూడా 52మంది అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల సన్నాహాల్లో, ప్రచారంలో జోరు పెంచేసింది. బీజేపీ నుంచి ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ సభలకు, అమిత్‌ షా నిర్మల్‌ సభకు హాజరయ్యారు. కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. క‌రీంన‌గ‌ర్‌, జ‌మ్మికుంట స‌భ‌ల్లో పాల్గొన్నారు.


26 నుంచి రాహుల్‌, ప్రియాంక ప్రచార సభలు


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచారాన్ని దసరా తర్వాతా ముమ్మరం చేసే క్రమంలో రాహుల్‌గాంధీ రెండో విడుత బస్సు యాత్రను ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించేందుకు సిద్ధమైంది. రాహుల్‌, ప్రియాంకల ప్రచార కార్యక్రమాల రూట్‌ మ్యాప్‌ను ఆ పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. కాంగ్రెస్‌ ప్రచార ఘట్టంలో ఈ నెల 31వ తేదీన కొల్లాపూర్‌లో ప్రియాంక గాంధీ సభ నిర్వ‌హణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహిళా డిక్లరేషన్‌ ప్రత్యేకంగా వెల్లడించే అవకాశముంది.


నాలుగు హెలికాప్ట‌ర్ల‌తో బీజేపీ ప్రచార సునామీ


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ల‌తో తొలి దఫా ప్రచార సభలు నిర్వహించింది. దసరా తర్వాతా కమలనాథుల ప్రచార వ్యూహంలో రాష్ట్రంలో అగ్రనేతల ప్రచారం కోసం నాలుగు హెలిక్యాప్టర్లను అద్దె తీసుకోవడం విశేషం. కమలం పార్టీ ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీతో 5నుంచి 10 సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్న‌ద‌ని స‌మాచారం. అలాగే ఈ నెల 27న హోంశాఖ మంత్రి అమిత్‌ షా పర్యటన ఉంటుంద‌ని చెబుతున్నారు. బీజేపీలో ఫైర్‌బ్రాండ్ నేత‌గా పేరున్న అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శ‌ర్మ స‌భ‌ల‌ను 28, 29 తేదీల్లో, ఇదే త‌ర‌హా నాయ‌కుడైన యూపీ ముఖ్య‌మంత్రి ఆదిత్య‌నాథ్ స‌భ‌ల‌ను 31వ తేదీన నిర్వ‌హించేందుకు రాష్ట్ర బీజేపీ నాయ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు.


26 నుంచి కేసీఆర్‌ ప్రచార ఉధృతి.. 30 సభలకు ఏర్పాట్లు


బీఆరెస్‌ ప్రచార కార్యక్రమాలు దసరా తర్వాత హోరెత్త‌నున్నాయి. సీఎం కేసీఆర్‌ ఈ నెల 26వ తేదీ నుంచి ఉధృత స్థాయిలో ప్ర‌చారానికి వెళ్ల‌నున్నారు. 26వ తేదీ నుంచి నవంబర్‌ 9వ తేదీ వరకు 15 రోజుల వ్యవధిలో కనీసంగా 30 నియోజకవర్గాల సభల్లో కేసీఆర్‌ ప్రసంగించేలా ఆ పార్టీ నాయకత్వం షెడ్యూల్‌ను ఖరారు చేసింద‌ని స‌మాచారం. ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణకు ఇప్పటికే నియోజకవర్గం ఇన్‌చార్జీల‌ను నియమించిన బీఆరెస్ అధిష్ఠానం ఆదివారం జలవిహార్‌లో వారితో ప్రత్యేక భేటీ నిర్వహించింది.


ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ప్రత్యర్థి పార్టీల ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి? అనే అంశాల‌పై దిశానిర్దేశం చేశార‌ని స‌మాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడం, కుల సంఘాల భేటీలు, గ్రామాలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల‌వారీగా సమావేశాల నిర్వ‌హణతో పార్టీ ప్రచారాన్ని కొనసాగించాలని, లబ్ధిదారుల జాబితా రూపకల్పనతో ఓట్ల సమీకరణ క‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.