కేసీఆర్ పై వివేక్ అర్థరహిత ఆరోపణలు: బాల్క సుమన్

– 8 కోట్లు బినామీ కంపెనీకి బదిలీ చేయలేదా?
– చెన్నూరు బీఆరెస్ అభ్యర్థి బాల్క సుమన్
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: తండ్రిలాంటి కేసీఆర్ పై కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ అర్థరహిత ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, చావు నోట్లో తలపెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని చెన్నూరు బీఆరెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే దివాకర్ స్వగృహంలో బుదవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల బీఆర్ఎస్ అధ్యక్షులు, చెన్నూరు అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడారు. కేసీఆర్ ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించారని తెలిపారు. వివేక్ కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కేసీఆర్ పై అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. వివేక్ తండ్రి వెంకటస్వామి మరణించినప్పుడు శవాన్ని గాంధీభవన్ కి కూడా తీసుకురాకుండా అవమానించారని.. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించడమే కాకుండా ఆయన జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించిన గొప్ప వ్యక్తిని దూషించడానికి వివేక్ నోరెలా వచ్చిందని ప్రశ్నించారు.
వివేక్, అతని కుటుంబ సభ్యులు, ఆయన సొంత మీడియాలో అడ్డగోలుగా ఆరోపణలు చేసినా సహిస్తున్నామని, ప్రజలు గమనించాలని కోరారు. ఆవుల మంద మీద తోడేలు గుంపు పడ్డట్టు.. విశాఖ ఇండస్ట్రీకి చెందిన ఉద్యోగులు, ఆయన మీడియా సంస్థలకు చెందిన ఉద్యోగులు విరుచుకుపడుతున్నారన్నారు. నియోజకవర్గంలో అడ్డూఅదుపు లేకుండా డబ్బు సంచులతో, నోట్ల కట్టలతో బీఆరెస్ లీడర్లను కొంటున్నారని, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి ధన రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. దొంగే దొంగ చందంగా వివేక్ తీరు ఉందని, ఓటమి భయంతో దిగజారిపోయి వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రజలపై నమ్మకం లేక లీడర్లను కొనుగోలు చేస్తున్నారన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆర్టీజీఎస్ ద్వారా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ.8 కోట్లు బదిలీ చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
గతంలో 50 లక్షలను చెన్నూరుకు తరలిస్తూ ఆధారాలతో సహా దొరికిన విశాఖ ఇండస్ట్రీస్ కు చెందిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవి కిషోర్, వెలుగు పత్రిక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ముదిగంటి ప్రేమ్ కుమార్ లను పోలీసుల అరెస్టు చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. నిజంగా తప్పు చేయకపోతే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని, వచ్చే ఒకటి, రెండు రోజుల్లో లీడర్ల కొనుగోలు వ్యవహారాన్ని ప్రజాక్షేత్రంలో ఉంచుతామని అన్నారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు వివేక్ ధన రాజకీయాలను తెప్పి కొట్టి, కారు గుర్తుకే ఓటెయ్యాలని బాల్క సుమన్ కోరారు.