రేపు కాంగ్రెస్, బీజేపీ పోటా, పోటీ దీక్షలు
కరీంనగర్ లోకసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకే రోజు చేపడుతున్న నిరసన దీక్షలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి

*కరీంనగర్ లో మంత్రి
పొన్నం ప్రభాకర్
*హుస్నాబాద్ లో
బీజేపీ నేతలు
*ఆసక్తికరంగా మారిన
కరీంనగర్ రాజకీయాలు
*దీక్షా దివస్ ఎవరికి లాభం?
*పొన్నం సెల్ఫ్ గోల్
చేసుకున్నారా?
(తాడూరు కరుణాకర్, కరీంనగర్ )
కరీంనగర్ లోకసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకే రోజు చేపడుతున్న నిరసన దీక్షలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ బిజెపి హామీల అమలులోని వైఫల్యాలకు నిరసనగా ఆదివారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో “దీక్ష” చేపట్టాలని ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు.
“తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపు చెక్కతో నేరెండిస్తా”అన్నట్టుగా కౌంటర్ దీక్షలకు కమలనాధులు సిద్ధమయ్యారు. అది కూడా పొన్నం ప్రభాకర్ శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కేంద్రంలో చేపట్టాలని నిర్ణయించడం ద్వారా లోకసభ ఎన్నికల ముందు మంత్రి ఎత్తుగడలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అటు కాంగ్రెస్, ఇటు బిజెపి ఆదివారం నాడు చేపట్టనున్న పోటాపోటీ దీక్షలు కరీంనగర్ లోకసభ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ రెండు పార్టీల దీక్షల పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? తద్వారా లాభపడేది ఎవరు అనే చర్చ ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు మాసాల పాలన పూర్తిచేసుకుంది. ఈ క్రమంలోనే లోకసభ ఎన్నికలను ఆ పార్టీ ఎదుర్కోవాల్సి వచ్చింది. లోకసభ ఎన్నికల ఫలితాలు ఒక విధంగా నాలుగు నెలల కాంగ్రెస్ పాలనకు ప్రజలు ఇచ్చే తీర్పులాగానే భావించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆచితూచి అడుగులు వేస్తున్న కాంగ్రెస్ రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల్లో, ఇప్పటివరకు 13 స్థానాల అభ్యర్థులను మాత్రమే ఖరారు చేయగలిగింది. రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకమైన కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం నేటికీ కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. మరో ఆరు రోజుల్లో లోకసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అవుతుండడం, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ మీనమేషాలు లెక్కించడం ఆ పార్టీ వర్గాలకే మింగుడు పడడం లేదు. రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలక పాత్ర పోషించే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ లోకసభ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాముగా తయారయింది. ఇది ఒక రకంగా జిల్లా వ్యవహారాలు చక్కబెడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అటు సిట్టింగ్ ఎంపీ, బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్, ఇటు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఆపై కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో జరుగుతున్న జాప్యంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.
శుక్రవారం రాత్రి కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన రోడ్డు షో లో
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బిజెపి, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు.
రాష్ట్రంలో బిజెపి గెలుపుకు అనుకూలంగా బలహీనమైన అభ్యర్థులను అధికార కాంగ్రెస్ రంగంలోకి దింపిందని విమర్శలు గుప్పించారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఇంతవరకు ఎందుకు ఫైనలైజ్ చేయలేకపోతున్నారు? ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఆ పార్టీ
ప్రయత్నిస్తోందని ప్రశ్నించారు.
అటు బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సైతం కరీంనగర్ లో తనను ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలసి కుట్రలు పన్నుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కొండగట్టు అంజన్న సహచర ఎమ్మెల్యేలతో కలిసి దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది ఇప్పటికీ తేలకున్నా, తాను కాంగ్రెస్ శాసనసభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామని చెప్పారు. కరీంనగర్ నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పోటీలో ఉంటారని భావించినా, ఆయన నిజామాబాద్ లోకసభను ఎంపిక చేసుకోవడం వల్ల ఇక్కడ అభ్యర్థి ఖరారులో ఆలస్యం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
సెల్ఫ్ గోల్ చేసుకున్నారా…
కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో జరుగుతున్న జాప్యం, ప్రత్యర్థి పార్టీల విమర్శల నేపథ్యంలో ఫ్రస్టేషన్ లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ‘బిజెపి, బిఆర్ఎస్ పదేళ్ల పాలన, ఇచ్చిన హామీల అమరులో వైఫల్యాలపై’ నిరసన దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించి సంచలనానికి తెర తీశారు.
రాష్ట్రంలోని అధికార పార్టీలో, అందునా మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా దీక్ష సమరానికి ‘సై’ అనడం,
రాజకీయ వేడి రగల్చడం వరకు బాగానే ఉన్నా, అది తిప్పి కొట్టే ప్రమాదం లేకపోలేదని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పొన్నం ఒక విధంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారని ఆ వర్గాలు భావిస్తున్నాయి.
శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సవ్యంగానే నడుస్తున్నా, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ హామీలు హడావుడి నిర్ణయాల వల్ల అర్హులైన లబ్ధిదారులకు అందలేకపోతున్నాయి. ప్రజా పాలనలో వచ్చిన లక్షలాది దరఖాస్తులను ప్రాపర్ గా ఎంట్రీ చేయించ లేకపోవడం, ఎంట్రీ అయినా దరఖాస్తుల్లోనూ వివరాలు సరిగా లేకపోవడం వల్ల ఈ రెండు పథకాల్లో తమకు లబ్ధి చేకూరలేదంటూ వేలాదిమంది నిత్యం కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
ఇక రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతుబంధు, ధాన్యానికి 500 రూపాయల బోనస్, మహిళలకు 2500 నగదు పంపిణీ, కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం లాంటి అనేక హామీల అమలులోని వైఫల్యాలను బిజెపి, బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో సఫలీకృతం అయ్యారు. మంత్రి పొన్నం శాసనసభ ఎన్నికల నాటి తమ ప్రభుత్వ హామీల విషయాన్ని పక్కన పెట్టి “ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన చోట మేము ఓటు అడుగుతాం.. డబుల్ బెడ్ రూమ్ ఇచ్చినచోట మీరు ఓటు అడగండి” అంటూ సవాల్ విసిరే ప్రయత్నాలు చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కరీంనగర్ బహిరంగ సభలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు జారి “హిందూ గాళ్లు, బొందు గాళ్లు”అంటూ చేసిన వ్యాఖ్యలు నాటి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కొంపముంచాయి. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొన్నం దీక్షల పేరుతో అలాంటి అవకాశమే ప్రత్యర్థి పార్టీలకు ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.
మీరు ఇక్కడైతే.. మేము అక్కడ…
హామీల అమలులో వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షకు కూర్చుంటున్నట్టు ప్రకటించగానే బిజెపి నేత బండి సంజయ్ కుమార్ తీవ్రంగానే ప్రతిస్పందించారు. గత పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలపై హైదరాబాద్ తెలంగాణ భవన్ ముందో, ప్రస్తుతం తాము ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ ముందో ఆయన దీక్ష చేస్తే బాగుంటుందని ఘాటుగా స్పందించారు. అంతటితో వదిలిపెట్టకుండా పొన్నం ప్రాతినిధ్య వహిస్తున్న హుస్నాబాద్ లో ఆయన కరీంనగర్ లో దీక్ష చేపడుతున్న సమయానికే, తమ పార్టీ నేతలతో మరో దీక్ష ఏర్పాటు చేయించడం ద్వారా రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. మొత్తం మీద ఈ దీక్ష దివస్ కరీంనగర్ లోకసభ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాల్సిందే!