ఎన్నిక‌ల్లో కాడెత్తేసిన బీజేపీ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ కాడేత్తేసిందా? అన్న సందేహాలు వెలువ‌డుతున్నాయి. 118 స్థానాల్లో జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేసిన బీజేపీకి 100కు పైగా స్థానాల్లో డిపాజిట్ వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేదు

ఎన్నిక‌ల్లో కాడెత్తేసిన బీజేపీ?
  • ప్రభుత్వ వ్య‌తిరేక ఓటు చీలేలా లేదు!
  • కాంగ్రెస్‌ను నిలువరించడం ఎలా?
  • పువ్వు గుర్తు బదులు కారు గుర్తకే ఓటు!
  • ఇప్ప‌టికే ప‌లు చోట్ల‌ బీజేపీ నేతల నిర్ణ‌యం!
  • మోదీ ప్ర‌చార‌మంతా లోక్‌సభ ఎన్నిక‌ల‌కే!

విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ కాడేత్తేసిందా? అన్న సందేహాలు వెలువ‌డుతున్నాయి. 118 స్థానాల్లో జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేసిన బీజేపీకి 100కు పైగా స్థానాల్లో డిపాజిట్ వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేదు. ఇదే స‌మ‌యంలో దేశంలోనే త‌న‌కు ప్ర‌ధాన శ‌త్రువైన కాంగ్రెస్‌ పార్టీని నిలువ‌రించాలంటే ఏమి చేయాల‌న్న‌దానిపై అంత‌ర్గ‌తంగా మేధో మ‌థనం చేసిన బీజేపీ నేత‌లు.. అనూహ్య‌మైన నిర్ణ‌యం తీసుకున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతున్నది. బీఆరెస్‌, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నదనే అభిప్రాయం ఇప్పటికే బలంగా ప్రజల్లోకి వెళ్లింది. దీంతో రహస్య మైత్రి ఎలానూ పనిచేయదనే అభిప్రాయానికి వచ్చిన నేతలు.. పలు ప్రాంతాల్లో నేరుగా కారుగుర్తుకే ఓటేయాలని తమ పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ముందుగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌డం ద్వారా కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా నిరోధించగలమని భావించిన బీజేపీ నాయకత్వం.. తెలంగాణపై మునుపెన్నడూ లేని స్థాయిలో కేంద్రీకరించింది. ప్రధాని మోదీ సైతం ఐదు రోజుల పాటు ప్రచారంలో పాల్గొన్నారు. మోదీకి షాడోగా చెప్పే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎనిమిది రోజులు ప్రచారం నిర్వహించారు.


జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఇత‌ర అగ్ర‌నేత‌లు వ‌చ్చి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఎంతమంది అగ్ర నేత‌లు వ‌చ్చి ప్ర‌చారం చేసినా, బీసీని ముఖ్య‌మంత్రి చేస్తామని మోదీ ప్రకటించినా, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు క‌మిటీ వేస్తామని హామీ ఇచ్చినా.. అవి జనంలోకి పోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. పైగా మొద‌టి నుంచీ వ్య‌తిరేక ఓటును చీల్చ‌డానికే బీజేపీ ప్ర‌య‌త్నం చేసింద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చ‌డం ద్వారా ప‌రోక్షంగా బీఆరెస్‌కు స‌హ‌కరించాల‌ని య‌త్నించింద‌ని ఆరోపిస్తూ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, వివేక్ వెంక‌ట‌స్వామి, విజ‌య‌శాంతి, యెన్నం శ్రీ‌నివాస్‌రెడ్డి త‌దిత‌ర కీల‌క‌మైన‌ బీజేపీ నేత‌లు ఆ పార్టీని వీడి, కాంగ్రెస్‌లో చేరారు. వారు బీజేపీని వీడటం కూడా ప్రజల్లో గట్టి ప్రభావాన్నే కల్పించిందని చెబుతున్నారు. బీజేపీలో నుంచి వచ్చినవారే చెప్పడంతో ఆ రెండు పార్టీల రహస్యమైత్రిపై జనంలో మరింత స్పష్టత వచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీ, బీఆరెస్‌ ఒక్కటేనని అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ వ్యతిరేక ఓటరు.. బీజేపీకి బదులు కాంగ్రెస్‌నే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. కనుమరుగై పోయిందనుకున్న కాంగ్రెస్‌ ఉవ్వెత్తున లేవడం, బీఆరెస్‌ వ్యతిరేక ఓటు చీల్చగలమన్న నమ్మకం బీజేపీలో లేకపోవడంతో కాషాయ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్నది. అయితే.. ఈ విషయాలపై బీజేపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు.

మోదీ ప్రచారం అసెంబ్లీ ఎన్నికల కోసం కాదా? లోక్‌సభ కోసమా?

రాష్ట్రంలో మోదీ ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. అది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకో, ఓట్లను చీల్చేందుకో కాదని, అసలు వ్యూహం.. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు భూమికను సిద్ధం చేసుకునేందుకేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ను తెలంగాణలో కట్టడి చేయకపోతే.. జాతీయ రాజకీయాలపై, ప్రత్యేకించి లోక్‌సభ ఎన్నికలపై పెను ప్రభావం పడే ప్రమాదం ఉందని భావించే ముందు చూపుతో మోదీ ప్రచారానికి వచ్చారని చెబుతున్నారు.