బీఆరెస్‌-కాంగ్రెస్‌లకు అనుకూలంగా ట్యాపింగ్ కేసు

సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీలు కాంగ్రెస్‌, బీఆరెస్‌లకు ఉపయోగపడే విధంగా ట్యాపింగ్ కేసును కొనసాగిస్తున్నారని, అలాకాకుండా 2014నుంచి 2023 ఎన్నికల వరకు నిష్పాక్షిక విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు

బీఆరెస్‌-కాంగ్రెస్‌లకు అనుకూలంగా ట్యాపింగ్ కేసు

విధాత, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీలు కాంగ్రెస్‌, బీఆరెస్‌లకు ఉపయోగపడే విధంగా ట్యాపింగ్ కేసును కొనసాగిస్తున్నారని, అలాకాకుండా 2014నుంచి మొన్నటి ఎన్నికల వరకు నిష్పాక్షిక విచారణ జరిపించాలని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జి.రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. అలా జరుగకపోతే దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు 2014కేసీఆర్ పాలనలో మొదలైన ఫోన్ ట్యాపింగ్ లపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.

2016తర్వాతా నుంచే విచారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, అంతకుముందు రేవంత్‌రెడ్డి ఫోన్ విని ఆయనను ఓటుకు నోటు కేసులో అరెస్టు చేశారని, దానిని ఎందుకు పక్కన పెట్టమని చెబుతున్నారో రేవంత్‌రెడ్డి చెప్పాలన్నారు. అప్పుడు డీజీపీగా అనురాగ్ శర్మ ఉన్నారని, ఆ ఆపరేషన్ నడిపించింది సిటీ కమిషనర్‌గా ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి అని గుర్తు చేశారు. నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినపుడున్న ఇంటెలిజెన్స్‌ చీఫ్ శివధర్ రెడ్డి ఇప్పుడు అదే స్థానంలో ఉన్నాడని, అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ సజ్జనార్ ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నాడని చెప్పారు.

రేవంత్‌రెడ్డిని జైళ్లో వేసి, బిడ్డ పెండ్లిని కూడా చేసుకోనివ్వకుండా చేసిన ఆ దుర్మార్గాన్ని మరిచి అప్పటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇప్పుడు విచారణలోకి రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు దాచిపెడుతున్నారని, ఆ కేసులో ఉన్నవారందరిని ఇప్పుడు పక్కన పెట్టుకోవడం వెనుక మతలబు ఏమిటని రఘునందన్‌రావు ప్రశ్నించారు. ట్యాపింగ్ చేసినోళ్లు ఎవరైనా కావచ్చు..చేయించినవారెవరో వారిపై చర్యలు తీసుకోవాల్సివుందన్నారు. బీఆరెస్‌, కాంగ్రెస్‌ల మధ్య అవగాహాన లేకపోతే కేసీఆర్‌ను మొదటి ముద్దాయిగా, రెండో ముద్దాయిగా హరీశ్‌రావు, మూడో ముద్దాయి వెంకట్రామిరెడ్డి, నాల్గవ ముద్దాయి కేటీఆర్ సహా ఇంకా చాల మందిని ముద్దాయిలుగా పేర్కోనవలసి ఉందన్నారు. ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పట్టుబడినట్లుగా చెప్పిన 30కోట్లు ఎటు పోయినవని అందుకే ఈడీకి తాను ఫిర్యాదు చేశానని…ఆ కేసులో నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలను నలుగురిని ప్రగతిభవన్‌లో పెట్టుకుని, మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని ఓడించేందుకు నేరుగాహెలిక్యాప్టర్‌లో తీసుకొచ్చారని, బీజేపీ సెక్రటరీ బీఎల్ సంతోష్‌ను కేసులో ఇరికించేందుకు ట్యాపింగ్ తో ప్రయత్నించారని రఘునందన్‌రావు ఆరోపించారు.