బీజేపీవి చిల్లర రాజకీయాలు: చీఫ్ విప్ వినయ్ భాస్కర్

బీజేపీవి చిల్లర రాజకీయాలు: చీఫ్ విప్ వినయ్ భాస్కర్

మోడీకి ప్రేమ ఉంటే విభజన హామీలేవీ?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీజేపీ చిల్లర రాజకీయం చేస్తూ తెలంగాణ ప్రజలని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విరుచుకుపడ్డారు. హనుమకొండ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.


మేము గాంధీని పూజిస్తుంటే, బీజేపీ వాళ్ళు గాడ్సేని పూజిస్తున్నారని ఎద్దేవా చేశారు. మాకు బీజేపీతో పని లేదు, ఎన్డీయేలో చేరాల్సిన అవసరం లేదన్నారు. మోడీకి తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే విభజన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఓడిపోతారని అన్నారు.

6న కేటీఆర్ రాక

ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 6న వరంగల్ లో పర్యటించనున్నారని వినయ్ భాస్కర్ చెప్పారు. రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని చెప్పారు. కుడా గ్రౌండ్స్ లో పార్టీ కార్యకర్తలతో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టెంపుల్ టూరిజంగా వరంగల్ నగరం రూపొందనుందన్నారు.



ఆర్టీసీ మాడల్ బస్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ కేటీఆర్ పై మోడీ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. దేశ ప్రజలంతా రాష్ట్రం వైపు చూస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. ఈసమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మర్రి యాదవ రెడ్డి పాల్గొన్నారు.