కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. కుక్కలు చింపిన విస్తరే: బోయినపల్లి

కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. కుక్కలు చింపిన విస్తరే: బోయినపల్లి

– తప్పనిసరి స్థితిలో తెలంగాణ ఇచ్చారు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ వాళ్లకు అధికారం ఇస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడవసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక తప్పదనే విషయాన్ని గ్రహించి, ఇచ్చిందన్నారు. అప్పటికే రెండుసార్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పి, మోసం చేసిందని తెలిపారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లి, మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తామనడం రైతులను మోసం చేయడమే అని అన్నారు. చేయి గుర్తుకు ఓటు వేస్తే రాత్రిపూట లైట్ పట్టుకొని బాయల కాడికి పోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటి కుటుంబాలలో 93 లక్షల తెల్లరేషన్ కార్డులున్న వారందరికీ ఐదు లక్షల బీమాను మ్యానిఫెస్టోలో చేర్చామన్నారు. విద్యుత్ రంగంలో అనేక విధాలుగా అభివృద్ధి చెందిందని, 26 వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామని, మరో రెండు కేంద్రాలు ప్రారంభమయ్యాయన్నారు. గోదావరి, కృష్ణ నదులపై అనేక నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం జరిగిందని అన్నారు. వరంగల్ నగరంలో 24 అంతస్తులతో హాస్పిటల్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

ప్రజల నుంచి విశేష ఆదరణ : వినయ్

ఏ వాడకెళ్ళిన, గల్లీ కెళ్ళిన, డివిజన్ కెళ్ళిన ప్రజలు ఎంతగానో బీఆరెస్ ను ఆదరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రతిచోట లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఎందరో ఉన్నారని, పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందిస్తున్నామన్నారు. ఏ వృత్తిలో ఉన్న వారికైనా, వివిధ రకాల పెన్షన్ల వారికైనా అనేక అభివృద్ధి ఫలాలు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ చీకటి శారద, మైనారిటీ నాయకులు నయీముద్దీన్ పాల్గొన్నారు.