కదనరంగంలోకి బీఆర్ఎస్ అభ్యర్థులు

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో పార్టీలు దూకుడు పెంచాయి. అభ్యర్థుల గెలుపు కోసం అధినేతలు అలుపెరుగని కృషి చేస్తున్నారు

కదనరంగంలోకి బీఆర్ఎస్ అభ్యర్థులు

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో పార్టీలు దూకుడు పెంచాయి. అభ్యర్థుల గెలుపు కోసం అధినేతలు అలుపెరుగని కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రెండు నెలల ముందుగానే పార్టీ అభ్యర్థుల తొలిజాబితా ప్రకటించారు. ఆయా నియోజకవర్గాల్లో రెండు నెలల నుంచి అభ్యర్థులు ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. అన్ని పార్టీల కన్నా ముందుగానే ఓటర్లకు చేరువవుతున్నారు. అలాగే అన్ని పార్టీలకన్న ముందుగానే బీ ఫామ్స్ కూడా కేసీఆర్ అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు బీఫామ్ అందుకున్నారు. సిర్పూర్ – కోనేరు కోనప్ప, చెన్నూర్ – బాల్క సుమన్, నిర్మల్ -ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ – జోగు రామన్న కు బి ఫామ్స్ ఇవ్వడం జరిగింది. మంచిర్యాల-నడిపల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి – దుర్గం చిన్నయ్య, ముధోల్ – విటల్ రెడ్డి బీ ఫామ్ అందుకున్నారు.

7 నియోజకవర్గాల్లో సిటింగ్ స్థానాలకి బీ ఫామ్ అందించారు. మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఆసిఫాబాద్ అభ్యర్థిగా కోవలక్ష్మి, బోద్ లో అనిల్ జాదవ్, ఖానాపూర్ లో జాన్సన్ నాయక్ బీ ఫామ్ అందుకున్నారు. గెలుపు వ్యూహాలతో ఎలా ముందుకు వెళ్లాలో సీఎం కేసీఆర్ అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పదిమందికి బీ ఫామ్ అందజేసినట్లు సమాచారం. బీ ఫామ్ అందగానే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల కదన రంగంలో నిలిచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.