కేసీఆర్ బీమా.. ఇంటింటికీ ధీమా: పద్మా దేవేందర్ రెడ్డి
బీఅర్ఎస్ అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు

విధాత, మెదక్ బ్యూరో: బీఅర్ఎస్ అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, బీఅర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మెదక్ లోని 1, 2 వార్డుల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. డప్పుల చప్పుల, మహిళల మంగళహారతులు, బతుకమ్మ ఆటపాటలు, బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో ఎన్నికల ప్రచారం హోరెత్తింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బీమా పథకం వల్ల రాష్ట్రంలో ఉన్న 93 లక్షల మందికి ప్రయోజనం చేకూరునుందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఐదు నెలలకే అక్కడ ఆ పార్టీ పాలనను చేతులెత్తేసే పరిస్థితి నెలకొందని అన్నారు. ఆ రాష్ట్ర రైతులకు పంటల సాగు కోసం మూడు గంటల కరెంటు ఇస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని, రైతులు ఆలోచించి ఓటేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు.
మైనంపల్లి హనుమంతు రావు కొట్లాటలు పెట్టడం మల్కాజ్ గిరిలో నడుస్తది కానీ మెదక్ నియోజకవర్గంలో కుదరదు అన్నారు. నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మేము వచ్చి గొడవలు పెడతాం, కోట్లాటలు పెడతాం అంటే ఊరుకోమని హెచ్చరించారు. 20 ఏళ్ల నుండి మెదక్ ప్రజలతో తనకు అనుబంధం ఉందని, ఎమ్మెల్యే అయినప్పటికినీ ప్రజలతో మమేకమై ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.