అడ్డగింతలు.. నిలదీతలు
మంచిర్యాల జిల్లాలో అధికార బీఆర్ఎస్ కు ఎన్నికల ప్రచారమంటేనే దడపుట్టిస్తోంది. ఆపార్టీ అభ్యర్థులకు అడుగడుగునా అడ్డగింతలు, నిలదీతలే ఎదురవుతున్నాయి

– హామీలేమయ్యాయి.. అభివృద్ధి ఏది?
– మళ్లీ ఓట్లంటూ ఎలా వచ్చారు?
– ప్రచారాల్లో బీఆరెస్ అభ్యర్థులకు నిరసన సెగ
– మంచిర్యాల జిల్లాలో గులాబీకి ఎదురీత
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో అధికార బీఆర్ఎస్ కు ఎన్నికల ప్రచారమంటేనే దడపుట్టిస్తోంది. ఆపార్టీ అభ్యర్థులకు అడుగడుగునా అడ్డగింతలు, నిలదీతలే ఎదురవుతున్నాయి. నాయకులు ప్రచారం కోసం వెళ్తున్న చాలా గ్రామాల్లో జనం నిరసన సెగలు అంటిస్తున్నారు. హామీలు ఇవ్వడం తప్ప, అమలు కాలేదంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకూ ఇదే పరిస్థితి ఎదురైంది. నెన్నెల మండలం కుశ్నాపల్లికి ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా, గ్రామ శివారులోనే ప్రజలు ఆందోళనకు దిగారు.

ఏకంగా ఎమ్మెల్యే వాహనాలను అడ్డుకున్నారు. గ్రామంలోకి రావొద్దంటూ నినాదాలు చేశారు. ఏమి అభివృద్ధి చేశామని మా ఊరికి ఓట్లు అడగడానికి వస్తున్నావంటూ నిలదీశారు. పోడు భూములకు పట్టాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నుంచి స్పందన లేకపోవడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ, మా ఊళ్లోకి అడుగుపెట్టకూడదని మహిళలు వాగ్వాదానికి దిగారు.
10 ఏళ్ల కాలం నుండి మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు కదా.. మా ఊరి సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించలేదు, మళ్లీ ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నారని వాహనాలను అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అవేమీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు దురుసుగా వ్యవహరించారు. గ్రామస్థులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. గ్రామస్థుల మాటలు పట్టించుకోకుండా, మీప్రశ్నలు తమకు సంబంధం లేదన్నట్టుగా ఊర్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మంచిర్యాలలోనూ ఇదే తీరు
మంచిర్యాల నియోజకవర్గంలో నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావును నస్పూర్ సీతారాంపల్లి ఎస్సీ కాలనీ ప్రజలు నిలదీశారు. మళ్లీ ఓట్లంటూ ఎలా వచ్చావని , ఓట్లేస్తే మాకు ఏమి అభివృద్ధి చేశారని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు . 200 ఇళ్లు ఉన్న ఎస్సీ కాలనీకి రోడ్డు మీద నుంచి డ్రైనేజీ పారుతోందని, డ్రైనేజీ నిర్మించాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. ఓట్లు వేసిన మాకు అడిగే అధికారం ఉందని ఎమ్మెల్యే, పార్టీ నాయకులను నిలదీశారు.
మంచిర్యాలకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతారాం పల్లి ఎస్సీ కాలనీ ప్రజలు ఎమ్మెల్యేని అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించడంతో దివాకర్ రావు చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో, గెలిచిన తర్వాత మూడు నెలల్లోపు తప్పకుండా డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఎస్సీ కాలనీ ప్రజలు శాంతించారు .
చెన్నూరులో కరెంటు పాట్లు
ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు 24 గంటలు కరెంటు సరఫరా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పట్టణంలో పలువురు రైతులు ఆందోళనలూ చేపట్టారు. 12 గంటలు కూడా కరెంటు సరఫరా కావడం లేదని నిలదీస్తున్నారు. 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ లో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు అందుబాటులో ఉందని చెబుతూనే, కనీసం 10 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండేళ్లుగా కాళేశ్వరం బ్యాక్ వాటర్ మూలంగా పంటచేలల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. పంటంతా చేతికి అందకుండా పోయింది. ప్రభుత్వం ఒక రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.
వర్షాకాలంలో ముంపునకు గురైన పంటల స్థానంలో, మరో పంట వేయగా.. నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని పట్టణంలో డిమాండ్ చేస్తున్నారు. ఇలా మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బీఆరెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పదేళ్ల కాలంలో ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని కుండబద్దలు కొడుతూ ఎమ్మెల్యేలను ఎక్కడికి అక్కడ నిలదీస్తున్నారు.