కాంగ్రెస్‌లో చేరిన.. బీఆరెస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి

- అనర్హత వేటు కోసం మండలి చైర్మన్‌కు ఫిర్యాదు
విధాత : బీఆరెస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కసిరెడ్డికి ఖర్గే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఐసీసీ నేతలు కేసి వేణుగోపాల్, వంశీచందర్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కసిరెడ్డి మాట్లాడుతూ తనతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బీఆరెస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరడం జరిగిందన్నారు.

తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి కూడా తాను కల్వకుర్తి ప్రజల అభివృద్ధి కోసం ఏమి చేయలేకపోయానని, బీఆరెస్‌లో ఉండి ప్రయోజనం లేదని భావించి నా నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో కాంగ్రెస్‌లో చేరడం జరిగిందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వలేదని, నీళ్లు అందడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాను కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నానన్నారు.
కాగా బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై గుస్సాగా ఉన్న బీఆరెస్ అధిష్టానం ఎమ్మెల్సీగా ఆయనపై అనర్హత వేటు వేసేందుకు వేగంగా పావులు కదుపుతుంది. పార్టీ మారిన ఎమ్మెల్సీ కసిరెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి లేఖ అందించింది.
గతంలో పార్టీ మారిన రాములు నాయక్‌పై కూడా బీఆరెస్ అనర్హత వేటు వేయించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇదే రీతిలో ఇటీవల పార్టీ టికెట్లు నిరాకరించినటువంటి, ఇతర పార్టీల్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి వారి నియోజకవర్గ అభివృద్ధి నిధులు అందకుండా నిలిపివేసింది.