బీఆరెస్ చేతిలో దీక్షాదివస్ అస్త్రం!
దీక్షా దివస్‌ను ఈ నెల 29వ తేదీన ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు

- 29న నిర్వహించాలన్న కేటీఆర్
- మరుసటి రోజే అసెంబ్లీ పోలింగ్
- ఎన్నికల సంఘం అనుమతిస్తదా?
- పోలింగ్ నిబంధనలు వర్తించవా?
- రాజకీయ విశ్లేషకుల్లో చర్చలు
విధాత, హైదరాబాద్: దీక్షా దివస్‌ను ఈ నెల 29వ తేదీన ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడంతోపాటు పార్టీ కార్యకర్తలు తమ ఇళ్లపై బీఆరెస్ జెండాలు ఎగురవేయాలన్నారు. అయితే.. మరుసటి రోజే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. సాధారణంగా ఎన్నికలకు ముందు రోజు ఎలాంటి పార్టీ కార్యక్రమాలకు అనుమతి ఉండదు. మరి దీక్షా దివస్‌కు ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందా? అనే అంశం రాజకీయ పరిశీలకుల్లో చర్చనీయాంశంగా ఉన్నది. అదే జరిగితే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం బీఆరెస్‌కు ఉంటుందని అంటున్నారు.
దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన రోజు నవంబర్ 29కి ప్రత్యేక గుర్తింపు ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు,కేసీఆర్ పోరాట స్ఫూర్తిని నవంబర్ 29న దీక్షా దివస్ ద్వారా చాటాలని కోరారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చాయని, కనుమరుగు అయ్యాయని చెబుతూ.. ఎత్తిన జెండా దించకుండా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఆమరణ నిరాహారదీక్షతో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కేసీఆర్ తెగించి పోరాడి తెలంగాణ సాధించారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుకుందని ఆరోపించారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని అన్నారు.
బీజేపీతో రేవంత్ లోపాయికారి ఒప్పందం
రేవంత్ రెడ్డికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందని కేటీఆర్ ఆరోపించారు. పీఎం కిసాన్ యోజనపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గోషామహల్, కరీంనగర్, కోరుట్ల నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను ఎందుకు పెట్టిందని నిలదీశారు. రైతు బంధు కొత్త పథకం కాదని, రేవంత్ రెడ్డికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా? తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈసారి గోషామహల్‌లో రాజాసింగ్‌ను, కరీంనగర్‌లో బండి సంజయ్‌ను ఓడిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు లేకుండా చేస్తామని అన్నారు. రాహుల్ గాంధీ కర్ణాటకలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జీవితంలో ఉద్యోగం చేశారా? అని ప్రశ్నించారు. డిసెంబర్ 4న తానే స్వయంగా అశోక్ నగర్ వెళ్లి జాబ్ క్యాలెండర్ రూపొందిస్తానని చెప్పారు.