బీఆరెస్‌ అస్త్రం.. పోల్‌ మేనేజ్‌మెంట్‌?

పోలింగ్‌కు ఐదు రోజులే గ‌డువు ఉంది. ఎక్కువ సర్వేలు బీఆరెస్‌కు కష్టకాలాన్ని సూచిస్తున్నాయి. ప్రత్యేకించి విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు ప్రభుత్వం

బీఆరెస్‌ అస్త్రం.. పోల్‌ మేనేజ్‌మెంట్‌?
  • ప్రతి 50 మందికి ఒక ఇన్‌చార్జ్‌
  • బూత్‌ స్థాయిలో ప్ర‌త్యేక భేటీలు
  • హైదరాబాద్‌లో బీఆరెస్‌ వార్‌రూమ్‌
  • కీలక నేతల డైరెక్షన్‌లో ప్రణాళిక!
  • భారీగా న‌గ‌దు పంపిణీకి యత్నం!
  • మౌత్‌టాక్‌ను అడ్డుకోవడమే టార్గెట్‌
  • తప్పులు ఒప్పుకొంటున్న బీఆరెస్‌
  • టీఎస్పీఎస్సీ, ధ‌ర‌ణిలో లోపాలు
  • స‌రిచేస్తామంటున్నకేటీఆర్‌, హ‌రీశ్‌
  • వ్యతిరేకతను అధిగమించే కసరత్తు

విధాత‌, హైద‌రాబాద్‌ : పోలింగ్‌కు ఐదు రోజులే గ‌డువు ఉంది. ఎక్కువ సర్వేలు బీఆరెస్‌కు కష్టకాలాన్ని సూచిస్తున్నాయి. ప్రత్యేకించి విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. బీఆరెస్‌ అహంకారంతో పాలిస్తున్నదన్న వాదనను కాంగ్రెస్‌ బలంగా ప్రజల్లోకి తీసుకు వెళుతున్నది. ఒక వైపు జరిగిన అభివృద్ధిని అంగీకరిస్తూనే.. ఒకసారి ప్రభుత్వాన్ని మార్చి చూద్దాం అనే ధోరణి కూడా ప్రజల్లో కనిపిస్తున్నదని స్థానికంగా జరిగే చర్చల్లో అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈసారి ఏది చేసైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న అధికార బీఆరెస్‌.. సామ దాన బేధ దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పోల్‌ మేనేజ్‌మెంట్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే గ్రామస్థాయిలో పోల్‌ మేనేజ్‌మెంట్‌ పక్కాగా అమలవుతున్నదని చెబుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసి.. దాని ఆధ్యర్యంలో పనిచేసేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారన్న వాదన వినిపిస్తున్నది.

ప్రతి నియోజకవర్గం నుంచి పోలింగ్‌ కేంద్రాల వారీగా సమాచారాన్ని తెప్పించుకుని, ఎక్కడ బలహీనతలు ఉన్నాయో గుర్తిస్తున్నారని సమాచారం. బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టిసారించి.. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేకంగా దూతలను పంపిస్తున్నారని తెలుస్తున్నది. ఆ దూత ద్వారా వారి డిమాండ్లను గెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు హామీలు ఇస్తున్నారని సమాచారం. ఇలా ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక ఇన్‌చార్జిని నియమించినట్టు చెబుతున్నారు. ప్ర‌తి బూత్‌లో 50 ఓట్ల‌కు ఒక‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించారని, వీరంతా ప్ర‌తి రోజు ఆ 50 మంది ఓట‌ర్ల‌ను క‌లువడం, వారితో మాట్లాడ‌డం, వారి కోరిక‌లు, అవ‌స‌రాలు ఏమిటో తెలుసుకొని తీర్చ‌డం అనేది కార్యక్రమంగా పెట్టుకున్నారని తెలుస్తున్నది.


వ‌రంగ‌ల్ జిల్లాలోని ఒక నియోజ‌క‌వ‌ర్గంలోని ఒక బూత్‌లో ఉన్న మ‌హిళా పింఛన్‌ దారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించి.. ‘గంప‌గుత్తగా ఓట్ల‌న్నీ మాకే వేయాలి.. మీకు మేం ఏమి చేయాలో చెప్పండి.. చేస్తాం’ అని చెప్పారని తెలిసింది. అలాగే.. ఎంత మంది ఉన్నారు? ఎంత కావాలి? అని నేరుగానే అడుగుతున్నారని సమాచారం. కావల్సినవి సమకూర్చి.. తప్పకుండా ఓటేస్తామని ప్రమాణం చేయించుకుంటున్నారని చర్చలు జరుగుతున్నాయి. ముందుగా ఆయా గ్రూపుల వారీగా డబ్బులు ఇస్తున్నారని, ఆ తర్వాత ఓటుకు ఇంత చొప్పున ఇస్తామని చెబుతున్నారని అంటున్నారు. డ‌బ్బులు ఎంత ఖ‌ర్చు అవుతున్నాయ‌నేది సమస్యే కాదని, ఓట్లు పక్కాగా వస్తాయో లేదో స్పష్టమైన లెక్కలు కావాలని హైదరాబాద్ వార్‌రూమ్‌ నుంచి మార్గదర్శకాలు వస్తున్నాయని తెలిసింది.

ప్రతి నియోజకవర్గానికీ ఇన్‌చార్జులు

ఒక్కో అభ్య‌ర్థికి ఆ నియోజ‌కవ‌ర్గంలో అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌డంతో పాటు.. పోల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డం కోసం చేయాల్సిన ప‌నుల కోసం ప్ర‌త్యేకంగా ఇంచార్జీల‌ను కూడా నియ‌మించారని తెలుస్తున్నది. వారు మొద‌టి నుంచీ పోల్ మేనేజ్‌మెంట్ పైనే గురి పెట్టిన‌ట్లు ప్ర‌చారం జరుగుతున్నది. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 30 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేయ‌డానికి కూడా బీఆరెస్ వెనుకాడ‌టం లేద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున డ‌బ్బులు ఎప్పుడో గ్రామీణ ప్రాంతాల‌కు త‌ర‌లించారన్న ప్ర‌చారం కూడా ఉన్నది. ఒక్కో ఓటుకు 3 నుంచి 5 వేల వ‌ర‌కు పంచే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. బీఆరెస్‌నేత‌లు 3 వేలు ఇస్తారా? లేక 5 వేలు ఇస్తారా? అన్న చ‌ర్చ న‌లుగురు కూడిన చోట్ల జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

మౌఖిక ప్రచారం అడ్డుకునేదెలా?

ఎన్నికల్లో నాయకులు చేసే ప్రచారం ఒక ఎత్తయితే.. గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో అంతర్గతంగా సాగే మౌత్‌టాక్‌ మరో ఎత్తు. నాయకులు చేసే ప్రచారాన్ని ఈ మౌత్‌టాక్‌ను అడ్డుకోవడం అన్ని పార్టీలకూ సవాలుగానే మారింది. ప్రత్యేకించి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. బీఆరెస్‌కు వ్యతిరేకత ఉన్నదని, కాంగ్రెస్‌కు సానుకూలత కనిపిస్తున్నదని మౌత్‌టాక్‌ పెద్ద ఎత్తున నడుస్తున్నది. ఇది అధికార బీఆరెస్‌ విజయావకాశాలను గణనీయంగా దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు సాధారణ ప్రజలనుంచి సైతం వినిపిస్తున్నాయి. దీంతో ఈ మౌత్‌టాక్‌ను అడ్డుకునేందుకు బీఆరెస్‌ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నదని సమాచారం. ఈ క్రమంలోనే మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు మాటతీరు కాస్త మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీఎస్పీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. గెలిచిన త‌రువాత అశోక్ న‌గ‌ర్ చౌర‌స్తా వ‌ద్ద‌కు వ‌చ్చి నిరుద్యోగుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకొంటాన‌ని హామీ ఇచ్చారు. దానితోపాటు.. గ్రూప్‌-1 పరీక్షల విషయంలో పొర‌పాటు జ‌రిగిందని ఒప్పుకోక తప్పలేదు. ఇదే తీరుగా మంత్రి హ‌రీశ్‌రావు ధ‌ర‌ణిలో బాలారిష్టాలున్నాయని, వాటిని స‌రి చేస్తామ‌ని అన్నారు. నిజానికి గతంలో టీఎస్‌పీఎస్సీ విషయంలోగానీ, ధరణి విషయంలోగానీ బీఆరెస్‌ నేతలు ఏ మాత్రం వెనక్కుతగ్గకుండా ఎదురుమాట్లాడిన సందర్భాలు సైతం చూశాం. కానీ.. దానికి భిన్నంగా ఈ రెండు కీలక అంశాలపై తప్పులు అంగీకరించడం.. మౌత్‌టాక్‌ను అడ్డుకునే ప్రయత్నమేనన్న చర్చ నడుస్తున్నది.

విస్తృతంగా జనంలోకి

పోల్‌మేనేజ్‌మెంట్‌ పనులు ఒకవైపు చేస్తూనే బీఆరెస్‌ నాయకత్వం ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నియోజవకర్గాలను చుట్టేస్తున్నారు. మరోవైపు కేటీఆర్‌, హరీశ్‌రావు రోడ్డుషోలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని ఉధృతం చేశారు.