ప్రముఖులు ఎవరెక్కడ ఓటెయ్యనున్నారు..
తెలంగాణ శాసనసభకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది

– చింతమడకలో కేసీఆర్
– గ్రేటర్ లో సినీ సెలెబ్రిటీలు
– తెలంగాణలో ఓటేసే ఏపీ ఉద్యోగులకూ అవకాశం
– హైదరాబాద్ లో ఓటింగ్ పెంచేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు
విధాత: తెలంగాణ శాసనసభకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, ఓటర్లకు సౌకర్యాలు కల్పించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిసారి గ్రామంలో కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కూడా బరిలో ఉన్నారు. అయితే ఆయన ఓటు మాత్రం తన సొంత నియోజకర్గం కొడంగల్‌లోని జడ్పీ హైస్కూల్‌లో వినియోగించుకోనున్నారు. సీఎస్ శాంతి కుమారి జూబ్లీహిల్స్‌లో తన ఓటును వినియోగించుకోనున్నారు.
సినీ సెలెబ్రిటీలు ఇలా..
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హైదరాబాద్ పరిధిలోని వివిధ పోలింగ్ బూత్ లలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హీరో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్ – జూబ్లిహిల్స్ క్లబ్ పోలింగ్ బూత్ 149లో, హీరో రవితేజ -ఎంపీ,ఎమ్మెల్యే కాలనీ పోలింగ్ బూత్ 157లో, జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి – ఓబుల్ రెడ్డి స్కూల్ పోలింగ్ బూత్ 150లో, అల్లు అర్జున్, స్నేహారెడ్డి,అల్లు అరవింద్, అల్లు శిరీష్ – బీఎస్ ఎన్ ఎల్ సెంబర్ పోలింగ్ బూత్ 153లో, ప్రభాస్, అనుష్క, వెంకటేష్, బ్రహ్మానందం – మణికొండలో, అల్లరి నరేశ్ – జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, ఆర్థిక సహకార సంస్థ కార్యాలయంలో, నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్ – వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పోలింగ్ బూత్ 151లో, మహేశ్ బాబు, నమ్రత, మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ – జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ బూత్ 165లో, రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్ – జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ ఎఫ్ఎన్సీసీ పోలింగ్ బూత్ 164లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు గురువారం సెలవు ప్రకటించింది. వారంతో ఓటింగ్ లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటోంది.
ఏపీ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తూ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఓటు కలిగి ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందు ఏపీ ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం వినతికి ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పందించారు. ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.