రేపు ఛలో కాళేశ్వరం..హుస్నాబాద్ రైతులకు పొన్నం పిలుపు

ప్రాజెక్ట్ లోపాలు పరిశీలిద్దాం
ఉదయం 7 గంటల వరకు రండి
హుస్నాబాద్ రైతులకు మాజీ ఎంపీ పొన్నం పిలుపు
విధాత, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని సాంకేతిక సమస్యలు, జరుగుతున్న వాస్తవాలను తెలియజేయడానికి హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకుంటుందన్నారు.
అయితే ఇందులో లోపాలను పరిశీలించడానికి రైతులు, మేథావులు, పాత్రికేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొని మండలానికి ఒక్క వాహనం చొప్పున బుధవారం ఉదయం 7గంటల వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళుతున్నామన్నారు.
ప్రాజెక్ట్ నిర్మాణం సమయలో టీఆరెస్ ఎమ్మెల్యేలు విందులు, వినోదాల కోసం ప్రాజెక్ట్ సందర్శనకు తీసుకువెళ్లారని, ఇప్పుడు అదే ప్రజలకు ప్రాజెక్ట్ వైఫల్యాలను చూపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
టీఆరెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు ప్రాధానత్య ఇవ్వడంతో నాణ్యత, నైపుణ్యం లోపించిందని, దీంతో పాటు ప్రజాధనం వృధా అయినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా విచారణ జరిపించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు.