ఈ పదేండ్లలో ఏం జరిగింది..? 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది..?: సీఎం కేసీఆర్
ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనను, 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనను బేరిజు వేసుకుని, ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.

విధాత: ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనను, 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనను బేరిజు వేసుకుని, ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతుంది. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదు. ప్రజాస్వామ్య పరిణితి చెందిన దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. ఆలోచన చేయాలి. మంచేదో చెడేదో గుర్తించాలి. ప్రజలు గెలిచినప్పుడే వారి ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఈ రోజు బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన తర్వాత మీ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి వచ్చి పదేండ్ల నుంచి పరిపాలన చేస్తున్నాం. ఈ పదేండ్లలో ఏం జరిగింది..? 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది..? అనేది బేరీజు వేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో నిధులు, నీళ్లు లేవు. కరెంట్ లేదు. రైతులు, చైనేతల ఆత్మహత్యలు. వలసలు పోవుడు. చాలా భయంకరమైన బాధలు. మూడు నాలుగు నెలలు మెదడు కరగదీసి, ఒక ప్రణాళిక వేసుకున్నాం. చెట్టు ఒకడు, గుట్టకు ఒకడు ఉన్నాడు. ఇవన్నీ గమనించి పేదల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నాం.
వ్యవసాయ స్థీరికరణ జరగాలని రైతులను బాగు చేసుకున్నాం. రైతు బాగుంటే గ్రామం చల్లగా ఉంటుంది.. గ్రామం బాగుంటే దేశం చల్లగా ఉంటుందని రైతులను ఆదుకున్నాం. పెన్షన్‌ను 200 నుంచి రూ. 2 వేలకు పెంచుకున్నాం. సమాజానికి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వమే వారిని కాపాడాలని అధికారులకు చెప్పాను. అప్పుడు లెక్కలేసి.. రూ. 600 సరిపోతది అన్నారు. ఈ పేదోళ్ల వద్దనే కొసరల్నా అని పెన్షన్ వెయ్యి చేసుకున్నాం. సంపద పెరుగుతున్న కొద్ది పెన్షన్లు పెంచుకుంటూ పోయాం. అంతే కాకుండా కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలు చేశాం.
మన వద్ద నీటి తిరువా రద్దు చేశాం. ఏడాదిన్నర లోపే కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నాం. 24 గంటల కరెంట్ రైతాంగానికి ఫ్రీగా ఇస్తున్నాం. రైతుబంధు అనే పథకం గురించి జమానాలో వినలేదు. గత గవర్నమెంట్ రూపాయి ఇవ్వలేదు.. ఆలోచించలేదు. మొట్టమొదటిసారి రైతుబంధును పుట్టించిందే కేసీఆర్. ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందుతుంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొంటున్నాం. అదృష్టం బాగాలేక రైతు చనిపోతే వారంలోపే 5 లక్షల బీమా ఇస్తున్నాం. వీటితో రైతుల ముఖాలు తెల్లవడుతున్నాయి.
రైతుబంధు దుబారానో లాభమో రైతులు తేల్చాలి. మూడు గంటల కరెంట్ సరిపోతదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలి. రైతులందరూ 10 హెచ్‌పీ మోటార్ పెట్టుకోవాలని రేవంత్ అంటున్నారు. 3, 5 హెచ్‌పీ మోటారు ఉంటది రైతుల వద్ద. ఇప్పుడు 10 హెచ్‌పీ మోటార్ ఎవడు కొనియ్యాలా..? వాడి అయ్యా కొనియ్యాల్నా.. యాడికెళ్లి రావాలి. మన వద్ద 30 లక్షల మోటార్లు ఉన్నాయి. ఆలోచించాలి. కరెంట్ బిల్లు ఏంది.. ఎన్ని అవస్థలు.. ఎన్ని లంచాలు గతంలో. ఇవాళ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలడం లేదు. ఏ బాధ లేదు. మంచిగా రైతు పండించుకున్నంత చేతికి డబ్బులు వస్తున్నాయి. ఈ పద్ధతి పోవాలని అంటున్నారు కాంగ్రెసోళ్లు. వారు చాటుకు చెప్తలేరు.. టీవీ ఇంటర్వ్యూల్లో భాజప్తా చెబుతున్నారు. వీటి గురించి ఆలోచించాలి.
ధరణి పోర్టల్ వల్ల రైతుల భూములు సేఫ్‌గా ఉన్నాయి. మీ భూములను కాపాడుకునేందుకు మీ బొటనవేలికి అధికారం ఇచ్చింది ప్రభుత్వం. మీ భూమి హక్కు మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు. ఈ అధికారం ప్రభుత్వం మీకు ఇచ్చింది. ఈ అధికారాన్ని మీరు కాపాడుకుంటారా..? కాంగ్రెస్‌కు అప్పజెప్పి పొడగొట్టుకుంటారా..? మీరు నిర్ణయం చేయాలి. రైతుబంధు డబ్బులు ఎలా వస్తున్నాయి.. మేం హైదరాబాద్‌లో విడుదల చేస్తే సెల్‌ఫోన్లు టింగ్ టింగ్‌మని మోగుతున్నాయి. బ్యాంక్‌కు వెళ్లి చూస్తే డబ్బులు మీ ఖాతాలో ఉంటున్నాయి. ఆ డబ్బులతో ఎరువులు, విత్తనాలు కొంటున్నారు. మరి ఇవాళ ధరణి ఎత్తేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి. ఇవన్నీ పోతే వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్టు అవుతది.
కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్లీ పైరవీకారులు, దళారులు వస్తరు. ఇప్పుడు ఎవరికి లంచం ఇవ్వకుండానే మీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడంటే మళ్లా భూ కబ్జాలు, పైరవీకారులు, పాత రిజిస్ట్రేషన్ పద్ధతి, పడిగాపులు పడి ఉండాలి, పట్టా కోసం ఏడాది తిరగాలి, దానికి ముట్టజెప్పేది ముట్టజెప్పాలి. ఇవన్నీ చూశాం. భూమి అమ్మితే, కొంటే ఆర్డీవో ఆఫీసుకు పోవాలి.. ఇచ్చేటోనికి ఇవ్వాలి. ఇవాళ ఆ బాధ లేదు.. ఇవాళ నిమిషాల్లో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. భాజప్త వెబ్‌సైట్‌లో వచ్చేస్తుంది. దాన్ని ఎవరూ కూడా కదిరలించలేరు. ఇలాంటి ధరణిని తీసేస్తరట. ఇంత క్లీన్‌గా ఉన్న వ్యవహారం మళ్లీ మురికి కుంటగా కావాల్నా..? ఇది పెద్ద ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ ఎత్తేస్తామని వాళ్లు కుల్లా చెప్తున్నారు.. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలు. కాబట్టి చర్చ పెట్టి ఏ పార్టీకి అధికారం ఇస్తే బాగుంటదని ఆలోచించాలి.
మనం కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్నాం. కేసీఆర్ కంటే ఎత్తు, దొడ్డుగా ఉన్నోళ్లు సీఎంలు అయ్యారు. కానీ మంచినీళ్ల గురించి ఆలోచించలేదు.. తీసుకురాలేదు. ఎన్ని బాధలు పడ్డాం మంచినీళ్లకు. ఇప్పుడు ఆ బాధ లేదు. ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నాం. ఈ మాత్రం పని వారు ఎందుకు చేయలేదు. కేసీఆర్ కిట్ గురించి ఎవరూ ఆలోచించలేదు. గర్భిణులను అమ్మ ఒడి వాహనం ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లి, కాన్పు అయ్యాక మళ్లా ఇంటి దగ్గర వదిలిపెడుతున్నాం. హాస్పిటల్‌కు డబ్బులు కట్టేది పోయి ఉల్టా గవర్నమెంట్ పైసలు ఇస్తుంది. దీంతో పేదలకు బాధ తప్పింది.
కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా 3 కోట్ల మందికి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కండ్లద్దాలు ఇచ్చాం. ఇవన్నీ మానవీయ కోణంలో చూశాం. సంపద పెరిగిన కొద్ది పంచుకుంటూ పోతున్నాం. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని చెప్పి ఇన్ని కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తున్నాం. దయచేసి ఇవన్నీ ఉండాల్నా.. పదేండ్లు పడ్డ శ్రమ వృథా కావాల్నా.. అద్భుతంగా అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రంలో మళ్లీ పాత కథనే రావాల్నా..? ఇవన్నీ ఆలోచించాలి.
ఇక్కడ మంచిప్ప రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. అది త్వరలోనే పూర్తవుతది. ఇజ్రాయెల్ టెకన్నాలజీతో మూడు ఎకరాలకు ఒక ఔట్‌లెట్ పెట్టి ఈ నీళ్లు తీసుకువస్తాం. ఈ ప్రాజెక్టు కింద బాల్కొండ, నిజామాబాద్ రూరల్ కలిసి ఉంది. అది పూర్తయితే ఈ రెండు నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయి. ఆ రిజర్వాయర్ బాధితులు ఉంటే మంచి నష్టపరిహారం ఇద్దాం. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తున్నాం.
బీడీ కార్మికులకు ఏ ప్రభుత్వం కూడా పెన్షన్ ఇవ్వలేదు. బీడీ కార్మికుల బాధలను కండ్లారా చూశాను. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఒక్క తెలంగాణలోనే ఇస్తున్నారు. కొత్త వారికి కూడా పెన్షన్ ఇస్తాం. రాష్ట్రం ఏర్పడ్డాక 103 డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పాం. గతంలో మూడే సెంటర్లు ఉండే. కిడ్నీ రోగులకు కూడా 2 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నాం. పెన్షన్ అందుకుంటున్న వారంతా పేదోళ్లు కాబట్టి 5 వేలకు పెంచుతామని ఇటీవలే ప్రకటించాను.
కేసీఆర్ బీమా చేపిస్తాం అని చెప్పినం. అందరికి చేపిస్తాం. గల్ఫ్ వలసపోయిన కుటుంబాలకు కూడా బీమా వర్తింపజేస్తాం. ప్రతి ఒక్కరికి బీమా వస్తది. కులం, మతం, జాతి అనే తేడా లేకుండా అందరూ సమానమని భావించి, ప్రజల అవసరాన్ని బట్టి వాళ్లకు చేసుకుంటూ పోతున్నాం. ఈ విధంగా మంచి పద్దతుల్లో రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చాం. మరి దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఒక్క కేసీఆరే కొట్లడడు. మీరు కూడా కొట్లాడాలి. ఈ ఎలక్షన్లనో మీరే కొట్లాడాలి.
ఇవాళ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. గోవర్ధన్ ప్రజల నాయకుడు. ఆయన ప్రజా ఎమ్మెల్యే. ఆయన ఇంటి నిండా ఎప్పుడు చూసినా ప్రజలే ఉంటరు. ఎంత మంది వచ్చినా వారి పనులు చేసి పెడుతడు. సీనియర్ నాయకుడు.. మంచి నాయకుడు కాబట్టి పెద్ద మెజార్టీతో గెలిపించాలి. ఆయన కోరినటువంటి పనులను చేసి పెట్టే బాధ్యత నాది. అందులో ఏం ఇబ్బంది లేదు. మంచి నాయకుడిని గెలిపించాలని కోరుతున్నా.