సిద్దిపేట‌కు లేనిది లేదు.. గాలి మోట‌ర్ త‌ప్ప‌

సిద్దిపేట తెలంగాణకే ఆదర్శమని, ఇక్కడి మంచినీటి పథకమే రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకానికి నాంది పలికింద ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సిద్దిపేట‌ను ప్ర‌యోగ‌శాల‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.

సిద్దిపేట‌కు లేనిది లేదు.. గాలి మోట‌ర్ త‌ప్ప‌
  • అభివృద్ధికి ప్రయోగశాల సిద్దిపేట 
  • ఇక్క‌డి మంచినీటి పథకమే మిషన్ భగీరథ
  • ద‌ళిత బంధు ఆలోచ‌న ఇక్క‌డి నుంచే
  • అభివృద్ది కాముకుడు హరీశ్‌రావు
  • ఆయ‌న ఆరు అడుగుల బుల్లెట్‌
  • ప్రతి సారి విజేతగా నిలబెట్టిన సిద్దిపేట
  • ఆ ఆశీర్వాదాన్ని ఎన్నటికీ మర్చిపోను
  • సిద్దిపేట స‌భ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌

విధాత:మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సిద్దిపేట తెలంగాణకే ఆదర్శమని, ఇక్కడి మంచినీటి పథకమే రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకానికి నాంది పలికింద ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సిద్దిపేట‌ను ప్ర‌యోగ‌శాల‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. ‘నా జ‌న్మ‌భూమి సిద్దిపేట‌. నా రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు ఊత‌మిచ్చింది సిద్దిపేట‌. నేను సీఎం అవ‌డానికి, భార‌త‌దేశంలో తెలంగాణ‌ను ఆద‌ర్శంగా నిలుప‌డానికి సిద్దిపేట ప్ర‌జ‌ల దీవెనే కార‌ణం’ అని కేసీఆర్ చెప్పారు. మంగ‌ళ‌వారం బీఆరెస్ అభ్య‌ర్థి, మంత్రి హ‌రీశ్‌రావు పోటీ చేస్తున్న సిద్దిపేట‌లో ప్ర‌జా ఆశీర్వాద స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో సీఎం మాట్లాడుతూ.. సాగునీరు, తాగునీరు, సిద్దిపేట జిల్లా, రైలు, ఐటీ హబ్, మెడికల్ కళాశాల.. ఇలా సిద్దిపేట‌కు అన్నీ ఉన్నాయ‌ని చెప్పారు.


 


ఇక్కడ లేనిది ఒక్క గాలి మోటరేనని చ‌మ‌త్క‌రించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి సిద్దిపేటనే ప్రయోగ శాల అని సీఎం గుర్తు చేశారు. దళిత బంధు, సాగునీరు, తాగునీరుతో సాహా అన్నింటికీ ఆదర్శం సిద్దిపేట అన్నారు. ప్రాజెక్టులు కట్టి, సాగునీరు అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇంటింటికీ నల్లా బిగించి మిషన్ భగీరథ నీళ్ళు అందిస్తున్నామ‌న్నారు. తెలంగాణ భారత దేశానికే తలమానికం అయితే సిద్దిపేట తెలంగాణకే తలమానికం అన్నారు.

దళిత బంధుకు రామంచ గ్రామమే త‌న‌ను ప్రేరేపించిందంటూ.. ఆనాటి సైకిల్ క‌థ‌ను చెప్పి అంద‌రినీ న‌వ్వించారు. దళిత బంధును ప్రతి ఇంటికీ అందిస్తామని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. బీసీ బంధు నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అన్న కేసీఆర్‌.. ఒక్క చాన్స్‌ అంటూ మాయమాటలు చెప్పి, మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నార‌ని విమ‌ర్శించారు. వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి కావాలంటే బీఆరెస్‌ను దీవించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

హరీశ్‌పై ప్రశంసల వర్షం

మంత్రి హరీశ్‌రావుపై ముఖ్య‌మంత్రి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తాను ఎమ్మెల్యేగా ఉంటే కూడా సిద్దిపేటను ఇంత అభివృద్ధి చేసే వాడిని కాదేమోనని అన్నారు. కష్టపడి పనిచేసే తత్వం హరీశ్‌రావుద‌ని చెప్పారు. సిద్దిపేట‌కు గాలిమోట‌ర్ త‌ప్ప అన్నీ ఉన్నాయంటూ హ‌రీశ్‌రావుకు కితాబునిచ్చారు. దీనికి అదే స్థాయిలో స్పందించిన హ‌రీశ్‌రావు.. త‌న‌ కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే త‌న జీవితం అంకిత‌మ‌ని చెప్పారు. ఈ సభలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మధుసూదనా చారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ్ రెడ్డి, దామోదర్ రావు జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభ కు భారీగా జనం తరలి వచ్చింది.