గ‌జ్వేల్‌ను వ‌దిలి పోను: కేసీఆర్‌

గ‌జ్వేల్‌ను వ‌దిలి పోను: కేసీఆర్‌
  • నెల‌కో రోజు ఇక్క‌డి అభివృద్ధిపై స‌మీక్ష‌
  • కామారెడ్డిలో పోటీకి కార‌ణాలున్నాయి
  • మూడోసారీ అధికార ప‌గ్గాలు మ‌న‌కే
  • రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్‌
  • పెండింగ్ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కరిస్తా
  • గెల‌వ‌గానే తొలి స‌మావేశం మీతోనే
  • గజ్వేల్‌ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో కేసీఆర్‌


విధాత: త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన గ‌జ్వేల్‌లో అసంతృప్తుల‌ను బుజ్జ‌గించేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ముఖ్య‌మంత్రి త‌మ‌కు అందుబాటులో లేకుండా పోయార‌న్న అసంతృప్తి పార్టీలో ఉన్న‌ద‌నే అభిప్రాయాలు ఉన్నాయి.

మ‌రోవైపు బీఆరెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్ గ‌జ్వేల్ నుంచి పోటీ చేస్తార‌ని, ప‌లువురు ముదిరాజ్ నేత‌లు ఆయ‌న‌తో ట‌చ్‌లోకి వెళ్లార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ కేసీఆర్‌కు ఎదురీత త‌ప్ప‌ద‌న్న అభిప్రాయాలూ ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. వీట‌న్నింటి నేప‌థ్యంలో స్థానిక నాయకులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో మేడ్చల్‌ జిల్లా అంతాయిపల్లిలోని తూంకుంట క‌న్వెన్ష‌న్‌ హాల్‌లో నిర్వహించిన గజ్వేల్‌ నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్తలతో సీఎం కేసీఆర్‌ భారీ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.

తాను ప్ర‌త్యేక కార‌ణాల‌తోనే కామారెడ్డిలో పోటీ చేయాల్సి వ‌స్తున్న‌ద‌ని వివ‌ర‌ణ ఇచ్చిన‌ కేసీఆర్‌.. గ‌తంలో త‌న‌కు ఎదురైన ఓట‌మిని ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. త‌న జీవితంలో ఒకేఒక్క‌సారి ఓడిపోయాన‌ని, అది కూడా గెలిచీ ఓడిపోయాన‌ని చెప్పారు. బ్యాలెట్ సిస్ట‌మ్‌లో త‌న‌కు వ‌చ్చిన ఐదారువేల ఓట్ల‌ను ప్ర‌త్య‌ర్థి ఖాతాలో క‌లిపి, 700 ఓట్ల తేడాతో త‌న‌ను ఓడించార‌న్న కేసీఆర్‌.. హైకోర్టులో కేసు వేసినా రీకౌంటింగ్‌ ఇవ్వలేద‌ని తెలిపారు.

ఆ ఒక్కసారే నేను ఓడించబడ్డాను.. అంతే త‌ప్ప‌ ఓడిపోలేదన్నారు. రాష్ట్రంలో 95 నుంచి 100 స్థానాల్లో విజ‌యం సాధిస్తామ‌ని చెబుతూనే.. త‌న గ‌త‌ ఓట‌మి గురించి కేసీఆర్ ప్ర‌స్తావించ‌డం ప‌రిశీల‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ముఖ్య‌మంత్రి త‌మ‌కు అందుబాటులో ఉండ‌టం లేద‌న్న‌ది ఇక్క‌డి నాయ‌కుల అభిప్రాయంగా ఉన్న‌ది.

గ‌జ్వేల్‌లో ఓట‌మికి భ‌య‌ప‌డే కామారెడ్డికి వెళుతున్నారా? అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉన్నాయి. ఇదికూడా పార్టీలో కొంద‌రిని అయోమ‌యానికి గురి చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఈట‌ల బ‌రిలోకి దిగుతార‌న్న వార్త‌ల‌తో ప‌లువురు ముదిరాజ్ నేత‌లు ఆయ‌న‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు చెబుతున్నారు. అయితే.. తాను ఇక్క‌డ కూడా గెలుస్తాన‌ని, మెజార్టీ ఎంత అనేది మీ ద‌య‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్పిన కేసీఆర్‌.. తాను గ‌జ్వేల్‌ను వ‌దిలిపోన‌ని స్ప‌ష్టం చేశారు.

మూడోసారి అధికారంలోకి రాగానే గజ్వేల్‌ను రాష్ట్రానికే తలమానికంగా తీర్చుదిద్ధుతానన్నారు. ప్రతి నెల ఒక రోజు కేటాయించి నియోజకవర్గంలో సమావేశం నిర్వహించి, మీ మధ్య గడుపుతాన‌ని హామీ ఇచ్చారు.

మీ అంద‌రితో క‌లిసి అభివృద్ధిని సమీక్షిస్తానన్నారు. తాను ఈ దఫా గెలిచిన వెంటనే సీఎం హోదాలో తొలి సమావేశం ఈ హాలులోనే ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. పెండింగ్‌ ప్రాజెక్టులు, సమస్యలపై విస్తృతంగా చర్చించి, బ్లూప్రింట్‌ తయారు చేద్దామ‌న్నారు.

నియోజకవర్గంలోని కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు. ‘గ‌జ్వేల్ అభివృద్ధి అయింది అంటే అయింత ముఖం కొడుత‌ది.. దిష్టి కొడుత‌ది మ‌న‌కు. కావాల్సింది చాలా ఉంది.. జ‌ర‌గాల్సి ఇంకా ఉంది.

నియోజకవర్గంలో ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి పట్ల సంతృప్తి వద్దు. చేయాల్సింది చాలా ఉంది. ఒక విడత అభివృద్ధి జరిగింది. రెండో విడత అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. గజ్వేల్‌ను వదిలిపెట్టి పోయేది లేదు. ఎంత‌ మెజార్టీతో గెలిపిస్తారో మీ దయ‌’ అని సీఎం అన్నారు. 

హ్యాట్రిక్ ఖాయం

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మనం 95-100స్థానాల్లో గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కోసం తాను కొట్లాడిన సంద‌ర్భాల‌ను ఈ సంద‌ర్భంగా సీఎం వివ‌రించారు. 

మంత్రులు హరీశ్‌రావు, నియోజకవర్గం నేతలు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, నియోకవర్గంలోని మండలాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈట‌ల పోటీ నేప‌థ్యంలోనే సమావేశం?

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై బీఆరెస్‌ బహిష్కృత నేత, బీజేపీ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పోటీ చేయనున్న నేప‌థ్యంలో ఈ స‌మావేశాన్ని చూడాల‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. ఈ స‌మావేశానికి ఒక్కో గ్రామం నుంచి పాతిక మంది వరకు నాయకులను రప్పించి ప్రచార బాధ్యతలు నిర్ధేశించారు.

అలాగే నియోజకవర్గంలో 50వేల వరకు ముదిరాజ్‌ ఓటర్లు ఉన్నందున‌ ఎన్నికల్లో వారి ఓట్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇప్పటికే కొందరు ముదిరాజ్‌ నేతలు ఈటలతో టచ్‌లోకి వెళ్లినట్లుగా సమాచారం ఉండ‌టంతో కేసీఆర్‌ అప్రమ‌త్తమై ఈ భేటీ నిర్వహించినట్లుగా తెలుస్తున్న‌ది. సీఎం కేసీఆర్ గ‌తంలో సిద్దిపేట నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

రెండు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రెండుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మూడోసారి గజ్వేల్‌లో పోటీ చేస్తూనే అటు కామారెడ్డి నుంచి కూడా బ‌రిలో దిగుతున్నారు.