కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధికి నష్టం: కేసీఆర్

కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధికి నష్టం: కేసీఆర్
  • అభివృద్ధి కావాలంటే బీఆరెస్ గెలువాలి
  • రైతుబంధు, ధరణి వద్దంటున్నారు
  • మూడు గంటల కరెంట్ చాలంటున్నారు
  • ల్యాండ్‌పూలింగ్‌లో మీ భూములు పోవు
  • తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు
  • అనేక‌సార్లు మోసం చేసిన కాంగ్రెస్‌
  • మానుకోట, వర్ధన్నపేట, పాలేరు సభల్లో కేసీఆర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ నాయకులు నయామాటలు, నయా ముఖాలతో వస్తున్నారు.. నమ్మి ఓటేస్తే నష్టం వాటిల్లతుందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి బీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. రైతు బంధు, ధరణి, 24 గంటల కరెంట్, సంక్షేమ పథకాలు అమలుకావాలంటే తిరిగి ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాద్, వర్ధన్నపేట నియోజకవర్గంలోని భట్టుపల్లిలో శుక్రవారం బీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. మహబూబాద్ సభలో లంబాడీ భాషలో కేసీఆర్.. గోర్ భాయీ రాం రాం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.




 


రైతుబంధు దుబారా అంటున్న కాంగ్రెస్

రైతు బంధు దుబారా పథకమని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని కేసీఆర్ విమర్శించారు. మూడు గంట‌ల క‌రెంటు స‌రిపోతుంద‌ని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. రైతుబంధు ఇవ్వాలా వద్దా, 24 గంటల కరెంటు రావాలా వద్దా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటూ రాహుల్, ఉత్తమ్, భట్టి అంటున్నారన్న సీఎం.. మీ భూములపై మీకే హక్కు కల్పించి, వీఆర్వో నుంచి సీఎం వరకు ఎవరికీ హక్కులేకుండా చేసిన ధరణి ఉండాలా? వద్దా అంటూ ప్రశ్నించారు. ధరణిని వద్దనే వారినే బంగాళాఖాతంలో విసిరేయాలని పిలుపునిచ్చారు. మారుమూల గిరిజన ప్రాంతమైన మానుకోటను అన్ని విధాలుగా అభివద్ది చేశామన్నారు.

తెలంగాణ ఇవ్వ‌డంలో కాంగ్రెస్ మోసం

తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టుబట్టి, చావునోట్లో బెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్‌ అన్నారు. మనతో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చి , మన బిడ్డల ప్రాణాలు బలిగొన్న తర్వాత కొట్లాడితేగానీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. వచ్చిన తెలంగాణను సంక్షేమ, అభివృద్ధి రాజ్యంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. మహబూబాద్, వర్ధన్నపేట రూపురేఖలు మారాయన్నారు.

ల్యాండ్‌పూలింగ్‌లో భూములు పోవు

ఆరూరి రమేష్ మళ్ళీ గెలిస్తే రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు గుంజుకుంటారని కొంతమంది దుర్మార్గులు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్‌ విమర్శించారు. సీఎంగా చెబుతున్నా అలాంటిదేమీ లేదన్నారు. తాము రైతు బంధు, దళిత బంధు అమలు చేస్తుంటే గతంలో మింగుడు బంధు మాత్రమే ఉందన్నారు. వెయ్యి రూపాయలకు, గుడుంబాకు అమ్ముడుబోతారంటూ లంబాడోళ్ళ గురించి కొంద‌రు చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమేనని అధికారంలోకి రాగానే విలీనం గ్రామాలకు ప్రత్యేక ఫండ్ ఇస్తామన్నారు. సాదా బై నామాల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు రవిందర్ రావు, కడియం, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సభలకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.