ధ‌ర‌ణిని తీసేస్తే.. రైతుల‌కు క‌ష్టాలే

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో రైతుల‌కు ఎంతో మేలు జ‌రుగుతున్న‌ద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.ఇలాంటి ధ‌ర‌ణిని కాంగ్రెస్ తీసేస్తామంటున్న‌ద‌ని, అదే జ‌రిగితే రైతుల‌కు మ‌ళ్లీ క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు

ధ‌ర‌ణిని తీసేస్తే.. రైతుల‌కు క‌ష్టాలే
  • రైతుల ర‌క్ష‌ణ కోస‌మే ధ‌ర‌ణిని తెచ్చాం
  • దానిని తీసేస్తామంటున్న కాంగ్రెస్‌
  • 24 గంట‌ల క‌రెంటిచ్చే బీఆరెస్ కావాలా?
  • 3 గంట‌లు చాలనే కాంగ్రెస్ కావాలా?
  • చేతగాని కాంగ్రెస్‌కు ఎన్నో చాన్సులిచ్చారు
  • ఆ దుర్మార్గం అంతా ఇప్పుడు పోయింది
  • బ్ర‌హ్మాండంగా తెలంగాణ‌ అభివృద్ధి
  • సిరిసిల్ల స‌భ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్

విధాత బ్యూరో, కరీంనగర్ : ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో రైతుల‌కు ఎంతో మేలు జ‌రుగుతున్న‌ద‌ని ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. ఇలాంటి ధ‌ర‌ణిని కాంగ్రెస్ తీసేస్తామంటున్న‌ద‌ని, అదే జ‌రిగితే రైతుల‌కు మ‌ళ్లీ క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. మంత్రి హ‌రీశ్‌రావు పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన త‌ర్వాత భూముల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయ‌ని చెప్పారు. వాటిపై రైతుల‌కు భ‌ద్ర‌త‌, హ‌క్కులు క‌ల్పించేందుకు మూడు సంవ‌త్స‌రాలు మేధో మ‌థ‌నం చేసి.. ధర‌ణి పోర్ట‌ల్‌ను తీసుకొచ్చామ‌ని అన్నారు. ధ‌ర‌ణి ద్వారా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అంటే మళ్లీ రైతులను కష్టాల్లోకి నెడతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దుర్మార్గులు పెట్టే తాకులాటలు, పీకులాటలు రైతులు తట్టుకోలేరన్నారు.

ఇంకెన్ని చాన్సులు ఇవ్వాలె

చేతగాని కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చారని, ప్రస్తుతం ఆ దుర్మార్గం అంతా పోయింద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు, కరెంటు కష్టాలు ఈ ప్రాంత ప్రజలు, రైతులు ప్రత్యక్షంగా అనుభవించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఎగువ మానేరు నుండి నేడు సజీవ జలధార సాక్షాత్కరిస్తున్న‌ద‌ని తెలిపారు. గతంలో వ్యవసాయ రంగానికి మూడు గంటలు కరెంటు ఇస్తే, తాము 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని చెప్పారు. మూడు గంటల కరెంటు కావాలో, 24 గంటల కరెంటు కావాలో తేల్చుకోవాలని రైతులకు సూచించారు. కాంగ్రెస్ నేతలు రైతుబంధు లేకుండా చేయాలని చూస్తున్నారని రైతు బిడ్డలు దీనిపై ఆలోచించాలన్నారు.

ఆప‌ద‌మొక్కుల‌వారిని న‌మ్మొద్దు

ఎన్నిక‌లు రాగానే కొంద‌రు దుర్మార్గులు, దుష్టులు నీచాతి నీచంగా రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఆపద మొక్కులు మొక్కుతూ వచ్చేవారిని విశ్వసించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

బంధుత్వాలు, ఆత్మీయ‌త‌లు ఉన్న సిరిసిల్ల‌

బంధుత్వాలు, ఆత్మీయతలు ఉన్న ప్రాంతం సిరిసిల్ల అని సీఎం కేసీఆర్ చెప్పారు. గ‌తంలో తాను ఇక్క‌డి నుంచే ఎమ్మెల్యేగా ఉన్నాన‌ని గుర్తు చేసుకున్నారు. తన 70 ఏళ్ళ జీవితంలో వంద సార్లు ఈ ప్రాంతంలో పర్యటించానని చెప్పారు. ఒకనాడు ఈ ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవన్నారు. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో తీసుకున్న సంక్షేమ చర్యల కారణంగా నేతన్నలను ఆత్మహత్యల స్థితి నుండి బయటపడేలా చేయగలిగామ‌ని సీఎం చెప్పారు. ఇక్కడి నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తే, కొందరు దానినీ రాద్ధాంతం చేస్తున్నారని విమ‌ర్శించారు. షోలాపూర్ తరహాలో సిరిసిల్ల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారు.

సభలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గం పార్టీ అభ్యర్థులు కే తారక రామారావు, చలిమెడ లక్ష్మీనరసింహారావు, సుంకే రవిశంకర్, కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.