సీఎం హోదాను దిగజార్చేలా రేవంత్‌రెడ్డి అబద్ధాల ప్రచారం

సీఎం హోదాను దిగజార్చేలా రేవంత్‌రెడ్డి బీజేపీపై రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యంగం మారుస్తారని అబద్దాలతో, ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నాడని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ మండిపడ్డారు

సీఎం హోదాను దిగజార్చేలా రేవంత్‌రెడ్డి అబద్ధాల ప్రచారం
  • ఫేక్ వీడియోలపై రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి
  • బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ ఫైర్‌

విధాత : సీఎం హోదాను దిగజార్చేలా రేవంత్‌రెడ్డి బీజేపీపై రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యంగం మారుస్తారని అబద్దాలతో, ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నాడని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. బుధవారం రాష్ట్రపార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆరెస్సెస్‌ చీప్ మోహన్ భగవత్ స్పష్టం చేశారన్నారు. రాజ్యాంగాన్ని ధర్మ గ్రంథంగా చూస్తామని మోదీ, అమిత్‌షా చెప్పారని గుర్తుచేశారు. రిజర్వ్షేన్లు కొనసాగిస్తామని, రాజ్యంగాన్ని మార్చే ప్రసక్తే లేదని తమ పార్టీ అగ్రనేతలు స్పష్టంగా చెప్పినప్పటికి రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలు తమపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్ నేతలే రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించారని లక్ష్మణ్ విమర్శించారు. నెహ్రు నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్నిఅవమానించారని ఈ చరిత్రను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. మీ కల్పిత కథనాలను ప్రజలు నమ్మకపోవడంతో ఏకంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడం చూసి యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఫేక్ వీడియోల వ్యవహారంలో రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోలు రూపొందించడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందా లేక చైనా కమ్యూనిస్టులు ఉన్నారా తేలాల్సి ఉందన్నారు. అబద్దపు విష ప్రచారాన్ని నమ్ముకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిందని అదే రీతిలో ఎంపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు లేవని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీనే ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా రిజర్వేషన్లు ముస్లింలకు దారాదత్తం చేసే విధానాలను కొనసాగిస్తుందని విమర్శించారు.