కరీంనగర్ హస్తం పార్టీలో.. పాత కాపులకే మళ్లీ ఛాన్స్

- 10 స్థానాలకు అభ్యర్థులు ఖరారు
- 5 ఓసీ, 3 ఎస్సీ, 2 బీసీలకు..
- కరీంనగర్, హుజురాబాద్, హుస్నాబాద్ పెండింగ్
- జగిత్యాల నుండి జైత్రయాత్రకు సిద్ధం
విధాత బ్యూరో, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాల్లో పది స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్, హుజురాబాద్, హుస్నాబాద్ పార్టీ అభ్యర్థులు తేలాల్సి ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి, స్వల్ప ఓట్ల తేడాతో ప్రత్యర్థులపై ఓటమి చవిచూసిన నేతలకే మళ్లీ పార్టీ టికెట్లు కట్టబెట్టింది.

కోరుట్ల – జివ్వాడి నర్సింగరావు, జగిత్యాల – తాటిపర్తి జీవన్ రెడ్డి, ధర్మపురి (ఎస్సీ) – అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం – మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మంథని – దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి – చింతకుంట విజయ రమణారావు, చొప్పదండి (ఎస్సీ)-మేడిపల్లి సత్యం, వేములవాడ – ఆది శ్రీనివాస్, సిరిసిల్ల -కేకే మహేందర్ రెడ్డి, మానకొండూర్ (ఎస్సీ) – డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఆ మూడు స్థానాల్లో..
కాంగ్రెస్ తొలిజాబితాలో అభ్యర్థులను ప్రకటించని కరీంనగర్, హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఆచితూచి అడుగు వేస్తున్నది. కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ను ఢీకొనే సమర్థుడైన అభ్యర్థిని ఎంపిక చేయాల్సి రావడం, దరఖాస్తు చేసిన అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి తదితక అంశాలను లోతుగా విశ్లేషించనుంది. ఇక హుజురాబాద్ నియోజకవర్గంలో సింగాపురం దొర మనవడు ఒడితెల ప్రణవ్ ను ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉంది.

హుస్నాబాద్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పోటీపడుతున్నారు. ఆ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నది అధిష్టానానికి సంక్లిష్టంగా మారింది. పొత్తుల్లో భాగంగా హుస్నాబాద్ సీటు తమకు కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేస్తూ వస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనతో జిల్లాలో ఎన్నికల ప్రచార ఘట్టం ఊపందుకొనుంది.

గత ఎన్నికల్లో ఒకే స్థానం
గత శాసనసభ ఎన్నికల్లో కేవలం మంథని స్థానంలో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి మరింత ఊపు మీద ఉంది. జిల్లాలోని సగం శాసనసభ నియోజకవర్గాలైనా దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలు, పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి పాదయాత్రలు ప్రజల ఆలోచన దృక్పథంలో మార్పు తీసుకువచ్చాయని ఆపార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ శాసనసభ్యులపై ఉన్న అవినీతి ఆరోపణలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, శాసనసభ్యుల అనుచరులు, మద్దతుదారులకు మాత్రమే అవకాశాలు ఈసారి ఓటర్లను మార్పు కోరే దిశగా ప్రేరేపిస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

కేసీఆర్ కు సెంటిమెంట్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు బీఆరెస్ ఎన్నికల ప్రచార సభలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నుంచి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఇక్కడి నుండి ప్రచారం ప్రారంభించడం తమకు అధికారాన్ని చేరువ చేస్తుందని కేసీఆర్ గట్టి నమ్మకం. కొంతకాలంగా అధికార పార్టీపై దూకుడుగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్, పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించబోతున్నది.

జగిత్యాల జిల్లా పరిధిలోకి వచ్చే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ ఆలయం నుండి ఈనెల 18న జైత్రయాత్ర మొదలు పెట్టేందుకు సిద్ధమైంది.

కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలు తొలుత కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుండి పార్టీ ప్రచార రథాలను ప్రారంభించనున్నారు. అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగే రోడ్డు షో, బహిరంగ సభల్లోనూ వారు పాల్గొననున్నారు.
