తెలంగాణ కాంగ్రెస్ మరిన్ని వరాలు.. తులం బంగారం, లక్ష నగదు

- మహాలక్ష్మి హామీ పథకం కింద
- విద్యార్థులకు ఫ్రీ ఇంటర్‌నెట్
- టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ
- చైర్మన్ డీ శ్రీధర్ బాబు వెల్లడి
విధాత: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మరిన్ని వరాలు కురిపించింది. గతంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటు తాజా మరో రెండు పథకాలను ప్రవేశపెట్టబోతున్నది. మ్యానిఫెస్టోలో మరో రెండు పథకాలను కూడా ప్రవేశపెట్టనున్నట్టు టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ డీ శ్రీధర్ బాబు తెలిపారు. అర్హులైన యువతులకు వివాహ సమయంలో పది గ్రాముల బంగారం, లక్ష రూపాయల నగదు, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ వంటి మరికొన్ని హామీలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం బీఆర్ ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 18 ఏండ్ల నిండిన వధువులకు వివాహ సమయంలో రూ. 1,00,116 ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తున్నది. వధువు తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ. 2 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నది.
బీఆర్ ఎస్ కల్యాణలక్ష్మి పథకానికి మించి అదనంగా ఒక తులాల (10 గ్రాములు) బంగారం ఇస్తామని, దీని సుమారు రూ. 50,000 -55,000 వరకు ఉంటుందని శ్రీధర్ బాబు చెప్పారు. విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ వసతిని కూడా మ్యానిఫెస్టోలో చేర్చాలని యోచిస్తున్నట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడి విధివిధానాలను రూపొందిస్తామని వెల్లడించారు.
‘మహాలక్ష్మి’ హామీ కింద, మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, రూ. 500కి ఎల్‌పిజి సిలిండర్, రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని గత మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ వెల్లడించిన సంగతి తెలిసిందే.