కాంగ్రెస్ కు కాల పరీక్ష

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు కాల పరీక్ష పెడుతున్నాయి. ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్ధుల ఎంపిక పై పీటముడి నెలకొంది

కాంగ్రెస్ కు కాల పరీక్ష

ఖమ్మం, కరీంనగర్ స్థానాలపై పీటముడి
హైదరాబాద్ సీటు ఆచితూచి నిర్ణయం
పట్టుబడుతున్న ప్రధాన నాయకులు
సమస్యగా మారిన సామాజిక సమీకరణ
కేసీ రాక సందర్భంగా ఎంపికపై ఉత్కంట
సీఎం, డిప్యూటీ సీఎంతో మున్షీ ప్రత్యేక భేటీ

విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు కాల పరీక్ష పెడుతున్నాయి. ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్ధుల ఎంపిక పై పీటముడి నెలకొంది. వీటికి తోడు హైదరాబాద్ స్థానంలో అభ్యర్ధి ఎంపిక పై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఖమ్మం, కరీంనగర్ లలో అభ్యర్ధుల ఎంపిక పరస్పరం ఆధారపడి ఉంది. హైదరాబాద్ లో మైనార్టీకో…బీసీకో ఇచ్చే అవకాశముంటుంది. ఎంఐఎంతో స్నేహం కుదిరితే ఇక్కడ పోటీ పెద్ద సమస్యకాకపోవచ్చు. కాంగ్రెస్ లో కూడా ఇది గెలిచే స్థానం కాదు. రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యేల అవసరం రావచ్చు. ఈ కారణంగా ఈ స్థానంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదీకాకుంటే మైనారిటినో, బీసీనో పోటీలో పెట్టే అవకాశముంది. ఎటూ వచ్చీ ఖమ్మం, కరీంనగర్ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికే కీలకం కానున్నది. రాజకీయ వర్గాలతోపాటు కాంగ్రెస్ పార్టీలో సైతం ఈ రెండు స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మూడు స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేయకుండా జాప్యం చేస్తోంది. అభ్యర్ధుల ఎంపిక జాప్యమైతే ఎన్నికలపై ప్రభావం కనబరుస్తుందనే విమర్శలున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట సీటు విషయంలోనూ చివరి వరకు జాప్యం చేస్తే చేదు ఫలితాలు కాంగ్రెస్ చవిచూసింది. ఈ నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపికలో జాప్యానికిగల ఆంతర్యమేమిటనే ప్రశ్నలు కందిరీగల్లా ముసురుకుంటున్నాయి. ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఆదివారం హైదరాబాద్ కు వస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాన్ని ఆయన ఖరారు చేయనున్నారు. ఈ మేరకు టీపీసీసీ ముఖ్యనేతలు, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, పోటీచేసే అభ్యర్ధులు పాల్గొంటారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్ధులెవరో తేలనున్నదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సీఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి ప్రాధాన్యత ఉందని భావిస్తున్నారు. కేసీ వేణుగోపాల్ రాక నేపథ్యంలో మూడు స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపై ఉత్కంట నెలకొంది.

తెలంగాణలో టార్గెట్ 14 స్థానాలు

రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున 14 స్థానాలు తగ్గకుండా ఎంపీలను గెలిచి కాంగ్రెస్ అధిష్టానం తమ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుబెట్టుకోవాల్సిన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి టీమ్ తో పాటు టీపీసీసీ పై ఉంది. ఈ నేపథ్యంలో లోక్ సభ అభ్యర్ధుల ఎంపిక ఆచితూచి చేపడుతున్నప్పటికీ ఖమ్మం,కరీంనగర్ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక అధిష్టానానికి అగ్నిపరీక్షగా మారాయి. ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు సులువుగా గెలిచేందుకు అవకాశం ఉన్నందున పోటీ తీవ్రంగా ఉంది. పోటీపడుతున్న అభ్యర్ధుల్లో పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్న కుటుంబాలకు చెందిన వారు కావడంతో కరువమంటే కప్పకు కోపం…విడవమంటే పాముకు కోపమన్నట్లుగా మారింది. ఖమ్మంలో ఏకపక్ష ఫలితాల వెనుక ప్రస్తుతం ఎంపీ సీటు ఆశిస్తున్న నాయకుల కృషి ఉన్నందున ఎవరినీ కాదనలేని పరిస్థితిని అధిష్టానం ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా ఖమ్మం సీటు ఎవరికి లభిస్తుందనే ఆసక్తి సర్వత్రానెలకొంది. సామాజిక సమీకరణల్లో అన్యాయం జరిగితే మిగిలిన సెక్షన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది. గెలిచిన పార్టీగా కాంగ్రెస్ పై గంపెడాశలు పెట్టుకున్నారు.

14 స్థానాల్లో అభ్యర్ధుల ప్రకటన

రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. ఇందులో రెడ్డి సామాజికవర్గానికి అరు స్థానాలు, ముగ్గురు బీసీలు, రెండు ఎస్టీ, మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలు కేటాయించారు. దీంతో అగ్రవర్ణాల్లో మిగిలిన సామాజిక వర్గాలతో పాటు బీసీలకు తగిన స్థానాలు దక్కలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ లో రెడ్డి ఆధిపత్యం ఉంటుందని కొంత సర్దుకుంటున్నప్పటికీ మరీ ఏకపక్షంగా వారికే అన్నింటా పూర్తిస్థాయి ప్రాధాన్యత లభిస్తే రానున్న రోజుల్లో మిగిలిన సామాజిక వర్గాల నుంచి ముఖ్యంగా బీసీల నుంచి తీవ్ర సమస్యలు తలెత్తనున్నాయి.

ఖమ్మంలో కాలపరీక్ష

ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఆశించిడం గమనార్హం. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్ అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్నారు. తుమ్మల కొంత వెనుకంజ వేసినప్పటికీ పొంగులేటి, భట్టి తమ కుటుంబసభ్యులకే టికెట్ వచ్చేందుకు ఎఐసీసీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికిచ్చినా మరొకరు నారాజ్ అయ్యే అవకాశముంది. ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గమే అయినా ఇందులో ఒకరు మహిగా ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు తనకు ఖమ్మం సీటు తనకు కేటాయించాలంటున్నారు. తనకు అవకాశం రాకుండా భట్టి విక్రమార్క అడ్డుపడుతున్నారని కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదిలా ఉండగా ఖమ్మం అంటే కమ్మ అనే పేరున్ననేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రపసాద్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈయన ఢిల్లీలో తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నవారిలో ఎవరికి లభిస్తుందోననే చర్చ సాగుతుండగా పొంగులేటి వియ్యంకుడు కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డి పేరు జాబితాలో చేరింది. ఈ అభ్యర్ధులకు మధ్యేవాదంగా నిజామాబాద్ కు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మండువ వెంకటేశ్వర్ రావు పేరు తెరపైకి వచ్చింది. రాజీ అభ్యర్ధిగా ఈ పేరు తుమ్మల తీసుకొచ్చారనే ప్రచారం సాగుతోంది. దీంతో అధిష్టానం ఎవరినీ కాదనలేక రాష్ట్రంలోని ముఖ్యనాయకులకే తేల్చుకుని ఒక ప్రతిపాదనతో రావాలని సూచించినట్లు చెబుతున్నారు. ఖమ్మం లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వారు కావడంతో ఎవరు పోటీచేసినా గెలుపు సునాయసమేననే అభిప్రాయం ఉంది. బీఆర్ఎస్ కమ్మ సామాజిక వర్గానికి , బీజేపీ వెలమ సామాజికవర్గానికి అవకాశం కల్పించింది.

కరీంనగర్ లో ఇదే పరిస్థితి

కరీంనగర్ ఎంపీ అభ్యర్ధి ఎంపిక విషయంలోనూ ఇబ్బందిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ పోటీచేసి గెలుపొందారు. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీపడ్డారు. ఆయనను కాదని పొన్నానికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశమిచ్చింది. ప్రవీణ్ రెడ్డి పొన్నానికి అయిష్టాంగనే సహకరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవీణ్ రెడ్డికి కరీంనగర్ ఎంపీగా అవకాశం లభిస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు పరిస్థితి తిరుగబడింది. ఇప్పటికే ఆరుగురు రెడ్డి అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఖమ్మం ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారో దానిపై ఆధారపడి కరీంనగర్ ఎంపీ అభ్యర్ధి ఎంపిక ఉంటుందంటున్నారు. ఇదిలా ఉండగా ప్రవీణ్ రెడ్డితో పాటు బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన తీర్మార్ మల్లన్న టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరి నాయకుల పోటీలో తాజాగా వెలమ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావు పేరు ఆకస్మికంగా తెరపైకి వచ్చింది. కరీంనగర్ లోక్ సభ పరిధిలో వెలమ సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ వెలమలకు ఏ స్థానం కేటాయించకపోవడంతో ప్రస్తుతం రాజేందర్ రావు పేరు చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు బీజీపి మున్నూరు కాపు సామాజిక వర్గానికి, బీఆర్ఎస్ వెలమ సామాజిక వర్గానికి అవకాశం కల్పించింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్నది.
మిగిలిన హైదరాబాద్ స్థానంలో ఏ బీసీకో, మైనార్టికో ఇచ్చే అవకాశం ఉంది. ఎంఐఎంతో ఉండే సంబంధాల పై ఆధారపడి ఇక్కడ అభ్యర్ధి ఎంపిక జరుగనున్నది.