CM Revanth Reddy | విఫల ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిపై ముద్ర వేసేందుకు ప్రయత్నాలు?

కాంగ్రెస్ పార్టీ విప‌క్షంలో ఉండ‌గానే రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్య‌క్షుడిగా అధిష్టానం నియమించింది. అప్పుడే అనేక మంది నేత‌లు ఎదురుతిరిగారు. క‌నీస మద్దతు కూడా రేవంత్‌కు అందించలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.

CM Revanth Reddy | విఫల ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిపై ముద్ర వేసేందుకు ప్రయత్నాలు?
  • జగమంత కుటుంబంలో ఏకాకి రేవంత్‌!
  • సీఎంకు దన్నుగా నిలువని మంత్రులు!
  • విపక్ష విమర్శలకు గట్టి కౌంటర్‌లు ఏవి?
  • కీలకమైన పదవినీ లెక్క చేయ‌ని వైనం
  • వాళ్ల మద్దతు కూడగట్టడమే పెద్ద టాస్క్‌!
  • పీసీసీ అధ్యక్షుడిని చేసినప్పుడే తిరుగుబాటు
  • అయినా మొండిగా పనిచేసిన రేవంత్‌రెడ్డి
  • కీలక నేతలు నియోజకవర్గాలకు పరిమితమైతే..
  • ఒక్కడై రాష్ట్రమంతా తిరిగి గెలిపించిన నేత
  • అయినా ఇప్పటికీ కొనసాగుతున్న వ్యతిరేకత!
  • రేవంత్‌పై విఫల నేతగా ముద్రపడేసే యత్నం?
  • ఇదే అదనుగా సీఎంను టార్గెట్‌ చేసిన బీఆరెస్‌
  • గాంధీభవన్‌ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చలు

CM Revanth Reddy | టీడీపీ నుంచి వచ్చి ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడయ్యారు. అధిష్ఠానం ఇచ్చిన బాధ్యతను భుజానికెత్తుకుని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కడై పోరాడాడు. ఎన్నికలప్పుడు ముఖ్యమైన నాయకులు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు నియోజకవర్గాలకు పరిమితమైతే.. ఆయన మాత్రం రాష్ట్రమంతా తిరిగి.. కేసీఆర్‌కు కౌంటర్‌లు ఇస్తూ.. ప్రచారాన్ని ఉరకలెత్తించారు. ఎన్నికల్లో విజయం సాధించి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. కానీ.. ఇంత చేసినా.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రేవంత్‌రెడ్డి ఏకాకిగా మారిపోయారన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. తాను పీసీసీ అధ్యక్షుడు కావడాన్ని వ్యతిరేకించిన నాయకులు.. ఇప్పుడు ముఖ్యమంత్రి కావడాన్ని కూడా జీర్ణించుకోలేక పోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి సీనియర్‌ నేతల మద్దతు కూడగట్టుకోవడమే ఆయనకు పెద్ద టాస్క్‌గా మారిపోయిందని అంటున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి వంటి కొందరు మినహాయిస్తే.. మిగిలిన నేతల నుంచి ఆశించిన మద్దతు వస్తున్నట్టు కనిపించడం లేదని సీనియర్‌ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పుడే వ్యతిరేకత

కాంగ్రెస్ పార్టీ విప‌క్షంలో ఉండ‌గానే రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్య‌క్షుడిగా అధిష్టానం నియమించింది. అప్పుడే అనేక మంది నేత‌లు ఎదురుతిరిగారు. క‌నీస మద్దతు కూడా రేవంత్‌కు అందించలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. రేవంత్‌ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఒక నాయకుడు.. ఏకంగా బీజేపీలోకి వెళ్లిపోయాడు. రేవంత్‌ను బ‌హిరంగ‌గానే విమ‌ర్శించారు. పైగా మొద‌టి నుంచి తాము పార్టీలో ఉన్న‌వాళ్ల‌మ‌నే పేరుతో ప్ర‌త్యేకంగా ఒక గ్రూపును కూడా న‌డిపించారన్న విమర్శలు కూడా వచ్చాయి. సొంత పార్టీ నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఎంత స‌హాయ నిరాక‌ర‌ణ జ‌రిగినా రేవంత్‌రెడ్డి మొండిగా పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన బాధ్య‌త‌ల‌ను నెత్తికి ఎత్తుకొని ప‌ని చేశారు. కాంగ్రెస్ పెద్దల స‌ల‌హా మేర‌కు న‌డుచుకొని 2023 డిసెంబ‌ర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్నీ తానైప‌ని చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆనాటి ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ నేత‌ల‌ని చెప్పుకొనేవారంతా వారి వారి నియోజవకర్గాలకే పరిమితం అయితే.. రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రమంతా ప‌ర్య‌టించి, పార్టీని గెలిపించారు. రేవంత్ క‌ష్టాన్ని గుర్తించిన అధిష్ఠానం సీఎం పదవిని ఆయనకే అప్ప‌గించింది. ఆనాటి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల‌న్నింటికీ తాను బాధ్యత వహిస్తానని రేవంత్‌రెడ్డి చెబుతూ వచ్చారు. నాటి సీఎల్పీ నేత‌గా ఉన్న ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మిర్క‌తో క‌లిసి ఇద్ద‌రి సంత‌కాల‌తో గ్యారెంటీ కార్డులు కూడా ఇచ్చారు.

సీఎం అయిన తర్వాత కూడా అదే వ్యతిరేకత

రేవంత్ రెడ్డి సీఎం అయిన త‌రువాత సహచర మంత్రుల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతున్నదనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వాన్ని విమర్శించే క్రమంలో ప్రతిపక్షాలు, ప్రత్యేకించి బీఆరెస్‌.. సీఎం రేవంత్‌రెడ్డినే నేరుగా టార్గెట్‌ చేసుకుంటున్నాయి. వాటికి రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చుకోవాల్సి వస్తున్నదే కానీ.. ఇతర మంత్రుల నుంచి గట్టిగా కౌంటర్‌ వెళ్లడం లేదనే అభిప్రాయం వినిపిస్తున్నది. పైగా కొందరు మంత్రులు.. రేవంత్‌ను తమకంటే జూనియర్‌గా పరిగణిస్తున్నారని, అందుకు ఆయన చెబితే తాము వినేదేంటన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారని, ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తే తాము కౌంట‌ర్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్లుగా ఉంటున్నారని రాష్ట్ర రాజకీయాలను సునిశితంగా ప‌రిశీలించే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు అన్నారు. ఒక‌రిద్ద‌రు మంత్రులైతే ఏకంగా రాయ‌డానికి వీలు లేని భాష కూడా వాడుతున్నార‌ని ఒక నేత ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

సీనియర్‌ నేతల నుంచీ అదే తీరు

మంత్రుల సంగతి ఇలా ఉంటే.. అటు పార్టీలోని సీనియర్‌ నేతల నుంచి కూడా రేవంత్‌రెడ్డికి గట్టి మద్దతు లభించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా విపక్షాలు తమ విమర్శల దాడిని తీవ్రతరం చేశాయన్న రేవంత్‌ రెడ్డికి సన్నిహితంగా మెలిగే నాయకుడొకరు చెప్పారు. మొత్తంగా రేవంత్‌ రెడ్డిలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్‌ కనిపిస్తున్నదని, ఇటీవల పోలీస్‌ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు అలా మాట్లాడినవేనని ఒక రాజకీయ పరిశీలకుడు అన్నారు. వాస్తవానికి రేవంత్‌ ఉన్నది ఉన్నట్టు చెప్పినా.. ఆయన మాటలపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమైందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో రూ.24 వేల కోట్ల వ్యవసాయ రుణాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాఫీ చేసింది. ఇంత పెద్ద పని చేసినా.. కనీస పాజిటివ్‌ వాతావరణం రాలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇది తమ కాంగ్రెస్‌ ఘనత అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా సీనియర్‌ నేతలు ఆసక్తి చూపలేదని అంటున్నారు. ఇదేదో రేవంత్‌రెడ్డి కార్యక్రమం అన్నట్టు వదిలేశారని చెబుతున్నారు.

విఫల నేతగా ముద్రపడేసే యత్నం?

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సక్సెస్‌ అయితే.. ఇక జీవితంలో మనకు అవకాశం రాదన్న ఉద్దేశంతో ఆయనపై విఫల సీఎంగా ముద్ర వేసేందుకు ఒకరిద్దరు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి రేవంత్‌ను విఫల సీఎంగా ముద్ర వేయడం అంటే.. విఫల ప్రభుత్వంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ముద్ర వేయించడమేనన్న సింపుల్‌ లాజిక్‌ను కూడా వాళ్లు మిస్‌ అవుతున్నారన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నది. అదే సమయంలో మళ్లీ గెలుస్తామో లేదో అన్న అనుమానంతో ఇదే టర్మ్‌లో నాలుగు రాళ్లు వెనకేసుకొనే ప్రయత్నాల్లో ఒకరిద్దరు మంత్రులు ఉన్నారన్న చర్చ సచివాలయ వర్గాల్లో సైతం వినిపిస్తున్నది.