సంక్షేమ పథకాలు పేదలకా, బడా బాబులకా? : సీపీఐ చాడా వెంకట్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలు ప్రచార ఆర్భాటాలకే తప్ప అమలు నామమాత్రమే అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలు ప్రచార ఆర్భాటాలకే తప్ప అమలు నామమాత్రమే అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనిగరం రాజకుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన చాడా మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అమలుకు నోచుకోలేదన్నారు.
దళితులకు మూడెకరాల భూమి, పేదలకు నివాస స్థలం అమలు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. గృహలక్ష్మి పథకం కింద నిజమైన లబ్ధిదారులకు కేటాయించకుండా, వారి కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చారన్నారు. దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయకుండా దళితులకు అన్యాయం చేసిందని విమర్శించారు.
బీసీ బంధుకు హడావిడిగా దరఖాస్తు చేసుకోమని చెప్పి లబ్ధిదారులకు ఇప్పటివరకు కూడా నిధులు మంజూరు చేయలేదన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలను మభ్య పెట్టడం కోసమే సంక్షేమ పథకాల పేరుతో హడావిడి చేస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న పాలకులకు ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారూపాక అనిల్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు కార్య లక్ష్మణ్, మండలం కార్యదర్శి ఉటుకురి రాములు, నిమ్మల మనోహర్, మొండయ్య వెంకటరమణ ,మర్రి విజయ్, చిరంజీవి మల్లయ్య, అశోకరావు, రాజిరెడ్డి, మనోహర్ రావు పాల్గొన్నారు.