బ్రిడ్జిలు కూలినట్లే..కేసీఆర్ ప్రభుత్వమూ కూలబోతుంది: సీపీఐ నారాయణ
నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపంతో వంతెనలు ఏవిధంగా కూలిపోతున్నాయో.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోక తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు

– కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో దోచుకున్నారు
– మంత్రి గంగుల బంధువులు, కాంట్రాక్టర్ల జేబులు నిండాయి
– నాణ్యత ప్రమాణాలపై న్యాయ విచారణ చేయించాలి
విధాత బ్యూరో, కరీంనగర్: నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపంతో వంతెనలు ఏవిధంగా కూలిపోతున్నాయో.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోక తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ బంధువులు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే తీగల వంతెన నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. గురువారం సీపీఐ ప్రతినిధి బృందంతో కలిసి నారాయణ దెబ్బతిన్న తీగల వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీగల వంతెన ప్రారంభించి ఏడాది కాకముందే ఈ వంతెన అప్రోచ్ రోడ్డు బీటలు వారడం, వంతెనపై బీటీ రోడ్డు పగుళ్లు చూపడం నాణ్యతా ప్రమాణాల లోపమే అని ఆయన అన్నారు.
కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని స్పష్టమైపోయినందున, ఈ అంశంపై న్యాయ విచారణ జరిపించాలని, కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. మానేరుకు అడ్డంగా తీగల వంతెన సమీపంలో నిర్మించిన చెక్ డ్యాములు ఇటీవల వరద నీటికి కొట్టుకుపోయాయన్నారు. అయినప్పటికీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకపోవడం, సొమ్ము రికవరీ చేయకపోవడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో కరీంనగర్ పట్టణంలో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని చూస్తుంటే పైన పటారం, లోన లొటారంలా ఉందని, పైపై మెరుగులతో నిర్మాణం చేపట్టి నగరాన్ని అందంగా తీర్చిదిద్దామని, సుందరీకరణ చేసామని అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.
ఈ బ్రిడ్జిని చూస్తుంటే కేసీఆర్, కేటీఆర్ తెల్ల జుట్టుకు నల్ల రంగు వేసుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. అంత మాత్రాన దాని అసలు రంగు బయటపడక మానదని చెప్పారు. తీగల వంతెన అందం మాట ఏమిటో గాని, అధికార పార్టీ నేతలు అడ్డంగా దోచుకోవడానికి ఉపయోగపడిందన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు జరుగుతున్న విషయం మంత్రి గంగుల కమలాకర్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఈటీ నర్సింహా, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, బండ రాజిరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బోయిని తిరుపతి, పైడిపెల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, నలువాల సదానందం, యుగేందర్, బోనగిరి మహేందర్, మచ్చ రమేష్, కంది రవీందర్ రెడ్డి, బూడిద సదాశివ పాల్గొన్నారు.